గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఇదిగో..

గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఇదిగో.. - Sakshi


న్యూఢిల్లీ:  ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. ధర రూ.6,399. ఇంటర్నెట్‌ను మరో వంద కోట్ల మందికి అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకువచ్చామని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఆండ్రాయిడ్ -క్రోమ్-యాప్స్ విభాగం) సుందర్ పిచ్చయ్య చెప్పారు. ఈ ఫోన్‌ల తయారీ కోసం గూగుల్ సంస్థ  మైక్రోమ్యాక్స్(కాన్వాస్ ఏ1 పేరుతో విడుదల), స్పైస్(డ్రీమ్ యునో), కార్బన్(స్పార్కిల్ వీ)లతో ఒప్పందాలు కుదుర్చుకుంది.



 ఈ కంపెనీల  ఫోన్‌లను అమెజాన్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ మార్కెట్ సంస్థల ద్వారా కొనుగోలు చేయవచ్చు వచ్చే నెల నుంచి రిటైల్ స్టోర్స్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఉచిత డేటా కోసం గూగుల్ సంస్థ ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ ఫోన్‌ల తయారీ ఒప్పందాన్ని  ఏసర్, ఆల్కాటెల్ వన్ టచ్, జోలో, హెచ్‌టీసీ, లావా, ఇంటెక్స్, ఆసూస్, లెనొవొ కంపెనీలకూ విస్తరించాలని గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది.  ఈ ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా భారత్‌లోనే విడుదల చేశారు. త్వరలో ఇండోనేసియా, ఫిలిప్పైన్స్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకల్లో ప్రవేశపెడతామని గూగుల్ పేర్కొంది.



 ఫోన్ ప్రత్యేకతలు: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్‌లో 4.5 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరి, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరి, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,  వంటి ప్రత్యేకతలున్నాయి. ఏడు భారత ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసేలా ఆండ్రాయిడ్ ఓఎస్‌ను మరింత మెరుగుపరచడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ భాషల్లో డేటా వినియోగం పెంపు, యాప్‌లను ప్రమోట్ చేయడానికి ఇది ఉపకరిస్తుందని గూగుల్ భావిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top