షిప్‌యార్డ్‌ ఆస్తులు ఎస్సార్‌కు!

షిప్‌యార్డ్‌ ఆస్తులు ఎస్సార్‌కు! - Sakshi


1998 నాటి బకాయిలపై కోర్టుకెక్కిన ఎస్సార్‌

రూ. 204 కోట్ల ఆస్తుల అటాచ్‌ చేసిన సుప్రీం కోర్టు

వాటిలో భూములు, విలువైన భవనాలు కూడా

ఎస్సార్‌ న్యాయవాది ఆదిత్య వెల్లడి  



విశాఖపట్నం: ముంబైకి చెందిన ఎస్సార్‌ ఆయిల్‌ లిమిటెడ్‌ కంపెనీకి విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌కు చెందిన రూ.204 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్‌ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్సార్‌ తెలియజేసింది. సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఎస్సార్‌ న్యాయవాది ఎం.ఎన్‌. ఆదిత్య ఈ వివరాలు వెల్లడించారు. ‘‘హిందుస్థాన్‌ షిప్‌యార్డుతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎస్సార్‌ 1998లో రాజమండ్రి దగ్గరున్న రవ్వ గ్యాస్‌ ఫీల్డ్‌ వద్ద నాలుగు ఆయిల్‌ ప్లాట్‌ఫాంలను నిర్మించి అప్పగించింది. అప్పటి ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన   రూ.40 కోట్లను షిప్‌యార్డ్‌ చెల్లించలేదు. దీంతో ఎస్సార్‌ యాజమాన్యం కోర్టుకెళ్లింది.



 2015లో సుప్రీంకోర్టు ఎస్సార్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇస్తూ... అప్పటి మార్కెట్‌ విలువ ప్రకారం రూ.220 కోట్లు చెల్లించాలని మూడు ఈపీలు జారీ చేసింది. దీనిపై హెచ్‌ఎస్‌ఎల్‌ కోర్టుకు వెళ్లి... 1998 నాటి అమెరికన్‌ డాలర్‌ రేట్‌ ప్రకారం బకాయిలను రూపాయల్లో చెల్లిస్తామని, దానిపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని వాదించింది. దీని బదులు 2015 నాటి డాలర్‌ రేటు ప్రకారం బకాయిని వడ్డీతో సహా రూపాయల్లో చెల్లించాలని ఎస్సార్‌ వాదించింది.



చివరకు 2001 నాటి డాలర్‌ రేటు తీసుకోవాలని సుప్రీం తీర్పునిచ్చింది’’ అని ఆదిత్య తెలిపారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.104 కోట్ల విలువైన టీడీఆర్‌లు, రూ.100 కోట్ల విలువైన మల్కాపురం సర్వే నం.1లోని ఆస్తులు, వాల్తేర్‌ అప్‌ల్యాండ్స్‌లోని 2 ఎకరాల  ‘నియో నెస్ట్‌ క్వార్టర్స్‌’ (షిప్‌యార్డ్‌ సీఎండీ నివాసం), సిరిపురంలో ఉన్న ‘వరుణ్‌ పార్క్‌’ (15 ఎకరాలు)ను ఎస్సార్‌కు అటాచ్‌ చేస్తూ కోర్టు తీర్పునిచ్చిందన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top