నోయిడాలో ఇంటెక్స్ ఐదో ప్లాంటు

నోయిడాలో ఇంటెక్స్ ఐదో ప్లాంటు


2015-16లో 3 కోట్ల మొబైల్స్ విక్రయ లక్ష్యం

- తయారీ, ఆర్‌అండ్‌డీకి రూ. 1,500 కోట్లు

- ఇంటెక్స్ డెరైక్టర్ కేశవ్ బన్సల్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్ 5వ ప్లాంటును నోయిడాలో ఏర్పాటు చేస్తోంది. ఏటా 35-40 లక్షల ఫోన్ల తయారీ సామర్థ్యంతో దీనిని నెలకొల్పుతోంది. ఈ ప్లాంటుతోసహా తయారీకి వచ్చే మూడేళ్లలో సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడిగా వెచ్చించనుంది. అలాగే ఆర్‌అండ్‌డీకి రూ.500 కోట్లు వెచ్చించనుంది. కంపెనీకి ఇప్పటికే జమ్మూ, బడ్డి, నోయిడాలో నాలుగు ప్లాంట్లున్నాయి. నెలకు 25 లక్షల ఫోన్లను తయారు చేయగల సామర్థ్యం ఈ ప్లాంట్లకు ఉంది. కంప్యూటర్ పరికరాలు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్ల వంటి ఉపకరణాలను సైతం ఇంటెక్స్ ఉత్పత్తి చేస్తోంది. ఇక ఈ ఏడాది మార్కెటింగ్‌కు కంపెనీ రూ.300 కోట్లు ఖర్చు చేయనుంది. భవిష్యత్తులో అవసరమైతే దక్షిణాదిన కూడా ప్లాంటు నెలకొల్పుతామని కంపెనీ డెరైక్టర్ కేశవ్ బన్సల్ సోమవారమిక్కడ తెలిపారు.

 

50 శాతం స్మార్ట్‌ఫోన్లు..


ఇంటెక్స్ 2015-16లో మొబైల్స్ ద్వారా రూ.8,000 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. 2014-15లో మొత్తం 2 కోట్ల యూనిట్లను కంపెనీ విక్రయించింది. వీటిలో 70 లక్షల యూనిట్లు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయని కేశవ్ బన్సల్ తెలిపారు. ఈ ఏడాది 3 కోట్ల ఫోన్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇందులో స్మార్ట్‌ఫోన్ల వాటా 50 శాతం ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటెక్స్ ఎక్స్‌పీరియన్స్ జోన్లు 400 ఏర్పాటు చేస్తామన్నారు. జొల్లా అభివృద్ధి చేసిన సెయిల్ ఫిష్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందిన స్మార్ట్‌ఫోన్లను నవంబర్‌లో విడుదల చేస్తామని సేల్స్ సీనియర్ జీఎం సంజయ్ కలిరోనా వెల్లడించారు.

 

ఆక్వా ట్రెండ్ విడుదల..

ప్రిన్స్ మహేశ్‌బాబును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఇంటెక్స్ ప్రకటించింది. మహేశ్ చేతుల మీదుగా ఆక్వా ట్రెండ్ పేరుతో 4జీ మొబైల్‌ను ఆవిష్కరించింది. 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, లాలీపాప్ 5.1 ఓఎస్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీని వాడారు. 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ సోనీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, హాట్‌నాట్ ఇతర ఫీచర్లు. 8.9 మిల్లిమీటర్ల మందంతో ఫోన్‌ను రూపొందించారు. ధర రూ.9,444. ఏడాదిపాటు స్క్రీన్ బ్రేకేజ్ వారంటీ ఉంది. సెన్సార్ ఆధారిత ఫ్లిప్ కవర్‌ను పొందుపరిచారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top