పెట్టుబడులతో మహిళా పారిశ్రామికవేత్తలు రెడీ

పెట్టుబడులతో మహిళా పారిశ్రామికవేత్తలు రెడీ - Sakshi


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా వ్యాపారావకాశాలను అందుకోవడానికి మహిళా పారిశ్రామికవేత్తలు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల పారిశ్రామికవాడలో 10 ఎకరాల్లో ప్లాస్టిక్, మెటల్ షీట్ల తయారీ యూనిట్లు ఏర్పాటుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ వుమన్ ఎంట్రప్రెన్యూర్స్‌కు(కోవె) చెందిన 25 మంది సభ్యులు రెడీ అయ్యారు.



 ఒక్కో యూనిట్‌కు స్థలం, మెషినరీకి కలిపి తొలుత రూ.25 లక్షలు వెచ్చించనున్నారు.  ఒక్కో ఎకరా ఎంత ధరకు ఇచ్చేది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చేతిలోకి స్థలం రాగానే 6 నెలల్లో యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని కోవె ప్రెసిడెంట్ సౌదామిని తెలిపారు. సోమవారమిక్కడ జరిగిన కోవె అవార్డుల కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మొత్తం 26 కంపెనీలు కోవె అవార్డు అందుకున్నాయి.



 ఆటోమోటివ్ పార్క్‌లో..: తూప్రాన్ మండలం కాలకల్ వద్ద ఉన్న కోవె ఇంజనీరింగ్, ఆటోమోటివ్ పార్కులో త్వరలోనే 10 కంపెనీలు రానున్నాయని సౌదామిని వెల్లడించారు. ఇప్పటికే 4 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయని, పార్కులో మొత్తం 23 కంపెనీలు వస్తాయన్నారు. ఒక్కో యూనిట్ కనీస పెట్టుబడి రూ.3 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. తూప్రాన్ మండలం కూచారం వద్ద కోవె ఫుడ్ పార్కు ఏర్పాటవుతోందని, 12 ఎకరాల్లో రానున్న ఫుడ్ పార్క్‌లో యూనిట్ల ఏర్పాటుకు 30 మంది సభ్యులు ముందుకొచ్చారని వివరించారు.



 కళాశాలల స్థాయి నుంచే..: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అపార అవకాశాలు ఉన్నాయని కోవె సీమాంధ్ర శాఖ చైర్‌పర్సన్, హోలీమేరీ, నలంద గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ సెక్రటరీ ఎ.విజయశారద రెడ్డి తెలిపారు. వ్యాపార రంగంలో అడుగిడేలా కళాశాలల స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇందుకోసం కళాశాలల్లో ప్రత్యేకంగా ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్(ఈడీపీ) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.



 గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మలిచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నామని కోవె కర్నాటక శాఖ చైర్‌పర్సన్ రూపారాణి తెలిపారు. అన్నా యూనివర్సిటీతో చేతులు కలిపామని కోవె తమిళనాడు శాఖ సెక్రటరీ కళ్యాణి చెప్పారు. యూనివర్సిటీలో 3 వేల మంది విద్యార్థులున్నారని, ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నామని వివరించారు. కోవె వుమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎంట్రప్రెన్యూర్‌షిప్-2014 హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అక్టోబరు 18-20 తేదీల్లో జరగనుంది. మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులు, సేవలను వివిధ దేశాలకు విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని కోవె ప్రతినిధి జ్యోత్స చెరువు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top