గృహ రుణాలపై వడ్డీ రాయితీ అమల్లోకి

గృహ రుణాలపై వడ్డీ రాయితీ అమల్లోకి


జనవరి 1 నుంచి వర్తింపు; మార్గదర్శకాలు విడుదల...

నెలకు రూ. 2 వేల దాకా తగ్గనున్న ఈఎంఐ భారం

70 ఆర్థిక సంస్థలతో ఎన్‌హెచ్‌బీ ఒప్పందం




న్యూఢిల్లీ: మధ్య ఆదాయ వర్గాల కోసం ప్రకటించిన గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం ప్రయోజనాలను కేంద్రం జనవరి 1 నుంచి వర్తింపచేయనుంది. ఇందుకు సంబంధించిన సీఎల్‌ఎస్‌ఎస్‌ (మధ్య ఆదాయ గ్రూపుల – ఎంఐజీ) మార్గదర్శకాలను నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ ఎండీ శ్రీరామ్‌ కల్యాణరామన్‌ బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆవిష్కరించారు. జనవరి 1 నుంచి ఈ పథకం ప్రయోజనాలను వర్తింపచేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ స్కీముతో మధ్య ఆదాయ వర్గాల లబ్దిదారులకు ఈఎంఐల భారం నెలకు రూ. 2,000 దాకా  తగ్గనున్నట్లు ఆయన చెప్పారు. క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీమ్‌ను (సీఎల్‌ఎస్‌ఎస్‌–ఎంఐజీ) ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్‌ 31న ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్కీమ్‌ నిర్వహణ మార్గదర్శకాలనే కల్యాణరామన్‌ ఆవిష్కరించారు.


పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద సీఎల్‌ఎస్‌ఎస్‌ను (ఎంఐజీ) అమలు చేసేందుకు 45 హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, 15 బ్యాంకులతో పాటు మొత్తం 70 ఆర్థిక సంస్థలు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌తో బుధవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషించే మధ్యతరగతి వర్గాల సొంతింటి కల సాకారానికి తోడ్పాటునివ్వడం అవసరమని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర గృహ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.



స్కీము స్వరూపం ఇదీ..

సీఎల్‌ఎస్‌ఎస్‌ (ఎంఐజీ) కింద రూ.12 లక్షల దాకా వార్షికాదాయం గల వారు తీసుకునే గృహ రుణాల్లో రూ.9 లక్షల దాకా పరిమాణంపై 4 శాతం మేర వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. అలాగే రూ. 18 లక్షల దాకా వార్షికాదాయం గల ఉన్నవారికి రూ. 12 లక్షల దాకా గృహ రుణాలపై 3 శాతం వడ్డీ సబ్సిడీ దక్కుతుంది. గృహ రుణాలపై వడ్డీ రేటు 8.65 శాతంగా పరిగణించిన పక్షంలో... 4 శాతం వడ్డీ సబ్సిడీతో రూ.9 లక్షల హౌసింగ్‌ లోన్‌పై నెలకు ఈఎంఐ భారం రూ.2,062 దాకా తగ్గుతుందని కల్యాణరామన్‌ చెప్పారు. అలాగే 3 శాతం వడ్డీ సబ్సిడీతో రూ. 12 లక్షల రుణంపై నెలవారీ వాయిదాల భారం రూ. 2,019 మేర తగ్గగలదని వివరించారు.


జనవరి 1 నుంచి స్కీమును వర్తింపచేస్తున్నందున ఈ ఏడాది ప్రారంభం నుంచి గృహ రుణం పొందినవారు లేదా దరఖాస్తులు ప్రాసెసింగ్‌ ప్రక్రియలో ఉన్న వారు రూ.2.35 లక్షల దాకా వడ్డీ సబ్సిడీ ప్రయోజనాలు పొందడానికి అర్హులని కల్యాణరామన్‌ పేర్కొన్నారు. రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల దాకా వార్షికాదాయాలు ఉన్న మధ్య ఆదాయ వర్గాలు కూడా కొత్త సీఎల్‌ఎస్‌ఎస్‌ (ఎంఐజీ) కింద వడ్డీ సబ్సిడీ పొందేందుకు అర్హులని ఆయన వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top