స్టార్టప్ కంపెనీలు నిలదొక్కుకోవాలంటే...

స్టార్టప్ కంపెనీలు నిలదొక్కుకోవాలంటే...


*ఐఎంటి ఓర్టస్ సదస్సులో వక్తల అభిప్రాయం



హైదరాబాద్ :ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు విజయవంతం కావాలంటే కొన్ని సూత్రాలకే లోబడే వ్యవహరించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ (ఐఎంటి), హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన ’భారత్‌లో స్టార్టప్ కంపెనీలకు ఉన్న అవకాశాలు –నిలదొక్కుకొనే సమర్ధత’  అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వాణిజ్యరంగ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.


 


కొత్త కంపెనీలకు ఉండాల్సిన నైపుణ్యత, లక్షణాలు, సాధించాలనే లక్ష్యం, నూతన ఆవిష్కరణల కోసం పరుగులు తీసే సమర్ధత ఉన్నప్పుడే  విజయాన్ని కైవసం చేసుకోగలవని ప్యానల్‌లో ఉన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ఇండియాలో స్టార్టప్ కంపెనీలు నిలదొక్కుకోవాలంటే కొన్ని లక్ష్యాలను అధికమించాలని వారు పేర్కొన్నారు. సరైన వ్యాపార వాతవరణాన్ని సృష్టించుకోగలగటంతో పాటు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉంటేనే స్టార్టప్ కంపెనీలు విజయవంతం కాగలుగుతాయని ఐఎంటి డైరక్టర్ డా.. సతీష్ ఐలవాడి అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విద్యారంగం, పరిశ్రమ వర్గాలు సమిష్టిగా కృషిచేస్తేనే స్టార్టప్ కంపెనీలు ధృడంగా రూపొందుతాయని ఆయన అన్నారు.  



సాధించాలనే బలమైన లక్ష్యంతోపాటు పరిశ్రమల్లో వస్తున్న మార్పులను గమనించకల్గిన ముందుచూపు అవసరమని ఆర్‌ఏ కెమ్ ఫార్మా డైరక్టర్  శిరీష్ కుమార్ రావుల అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీలు ఎదుర్కోంటున్న సమస్యలను ఎడ్వాంటా సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకులు, సీఈవో రవి  దేవులపల్లి వివరించారు. డబ్బును సంపాదించాలన్న లక్ష్యంతో పాటు డబ్బుపై గౌరవం, విలువ ఉండాలని ఆయన అన్నారు. అదే విజయానికి సోపానాలను నిర్మిస్తుందని రవి దేవులపల్లి అన్నారు. గత దశాబ్దాలుగా ప్రభుత్వరంగ సంస్థలనుంచి ప్రయివేటు సంస్థలలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, అలాగే స్టార్టప్ కంపెనీలతో పెరుగుతున్న ఉద్యోగఅవకాశాలను వయలెట్ స్ట్రీట్ సహవ్యవస్థాపకులు నయన్ కుమార్ వివరించారు.



స్టార్టప్ కంపెనీలు తప్పక విజయంసాధిస్తాయన్న ఆశాభావాన్ని వెక్ట్రా ఫ్యామిల్టీ ఎండి మను శ్రీనివాసన్ వ్యక్తం చేశారు. ఇంకుబేషన్ సెంటర్ల ఏర్పాటుతోపాటు ప్రభుత్వంనుండి సహాయసహకారాలు అందితే స్టార్టప్ కంపెనీలు అగ్రగామిగా దూసుకెళ్తాయని శ్రీనివాసన్ అన్నారు. చదువుకు, సరదాలకు మధ్య మంచి సమన్వయం సాధించి సమయపాలన చేయగలిగినప్పుడే విజయం వారిని వరిస్తుందని నిపుణులు ఐఎంటి బిజినెస్ స్కూల్ విద్యార్ధులకు సూచించారు.


 


చివరగా, సరైన మానసిక పరిపక్వతో పాటు, తమ ఆలోచనలలో స్పష్టత, నూతనత్వం ఉన్న వ్యక్తులకు విజయ తధ్యమని నిపుణులు పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఎంటి డైరక్టర్ డా.. సతీష్ ఐలవాడి సంధానకర్తగా వ్యవహరించారు. విద్యార్ధుల్లో వ్యాపార వ్యవస్థాపనకు కావాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకొనే శక్తిని కలిగించేందుకు ఓర్టస్  తరహా సదస్సులను నిర్వహిస్తున్నట్టు డా.. సతీష్ ఐలవాడి చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top