ఇన్ఫీకి పూర్వ వైభవం తెస్తా...విశాల్ సిక్కా

ఇన్ఫీకి పూర్వ వైభవం తెస్తా...విశాల్ సిక్కా


* కొత్త సీఈఓ విశాల్ సిక్కా...

* మేధోపరమైన యాప్స్, డేటా సెన్సైస్,

* ఎనలిటిక్స్‌పై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడి


 

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ పూర్వ వైభవాన్ని మళ్లీ తిరిగితీసుకొచ్చి.. పరిశ్రమలో అగ్రస్థానానికి చేర్చడానికి ప్రయత్నిస్తానని ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ విశాల్ సిక్కా పేర్కొన్నారు. కంపెనీ చీఫ్‌గా శుక్రవారం ఆయన ప్రస్తుత సీఈఓ ఎస్‌డీ శిబులాల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. సీఈఓ స్థానంలో ఆయన మీడియాతో తొలిసారిగా మాట్లాడారు. మేధోపరమైన సంపద, సాఫ్ట్‌వేర్ రంగాల్లో వినూత్నతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జటిలమైన ఇంటెలిజెంట్ అప్లికేషన్లు(యాప్స్), డేటా సెన్సైస్, ఎనలిటిక్స్‌పై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీ భవిష్యత్తు వృద్ధిలో ఇవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయన్నారు.

 

దేశీ ఐటీ రంగంలో రెండో అతిపెద్ద కంపెనీగా వెలుగొందుతున్న ఇన్ఫీ 30 ఏళ్ల ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా వ్యవస్థాపకులు కాకుండా ఒక బయటి వ్యక్తి సీఈఓ కుర్చీలో కూర్చోవడం విశేషం. సిక్కా అంతక్రితం జర్మనీ సాఫ్ట్‌వేర్ దిగ్గజం శాప్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరు మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి గురించి మాట్లాడుతూ... కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోనని ఆయన తనతో స్పష్టంగా చెప్పారని సిక్కా పేర్కొన్నారు. అయితే, తాను మాత్రం నారాయణ మూర్తి సలహాలను తీసుకోవడాన్ని ఇష్టపడతానన్నారు. ఇన్ఫోసిస్‌కు లేదంటే దేశీ ఐటీ పరిశ్రమకుమాత్రమే కాకుండా దేశంలోనే ఎందరికో స్పూర్తినిచ్చిన ఒక మహోన్నత వ్యక్తి అంటూ మూర్తి సేవలను ఆయన కొనియాడారు.

 

సమన్వయంతో ముందుకు...

కాగా, కంపెనీ భవిష్యత్తు వ్యూహాలను పేర్కొంటూ... వివిధ విభాగాలను ఒకదానితో మరొకటి మరింత సమన్వయం పెంచుకునేవిధంగా తీర్చిదిద్దనున్నట్లు సిక్కా వెల్లడించారు. అదేవిధంగా ఇప్పుడున్న నిపుణులైన సిబ్బంది బృందంతోనే విభిన్న విభాగాల్లో ప్రాజెక్టులను విజయవంతంగా నడిపిస్తానన్నారు. దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్న ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పనిచేయాలని కూడా తాను భావిస్తున్నట్లు సిక్కా పేర్కొన్నారు.



‘బరోడాతో నాకున్న అనుబంధమే మోడీకి కూడా ఉండటాన్ని చాలా ఆనందంగా ఫీలవుతున్నా. ఆయనను కలుసుకోవాలని కుతూహలంగా ఉంది. మోడీ మిషన్‌లో మా(ఇన్ఫీ) వంతు సహకారమేదైనా అవసరమైతే తప్పకుండా అందిస్తాం. ప్రపంచాన్ని మార్చగలిగే ప్రయత్నాల్లో భాగం పంచుకునే గొప్ప అవకాశం మాకు ఉంది. అంతేకాదు భారత్ కోసం కూడా ఏదైనా ప్రత్యేకంగా చేయకపోతే మా ప్రయత్నాలకు అర్ధం ఉండదు’ అని సిక్కా వ్యాఖ్యానించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top