84 విమానాలు రద్దు చేసిన ఇండిగో

84 విమానాలు రద్దు చేసిన ఇండిగో - Sakshi

ముంబై : బడ్జెట్‌ క్యారియర్‌ ఇండిగో 84 విమానాలను శుక్రవారం రద్దు చేసింది. అంతేకాక 13 విమానాలను ఎక్కడికక్కడ నిలిపివేసింది. ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమానాల్లో కొత్త ఇంజిన్‌లో తలెత్తిన సమస్యతో ఈ విమానయాన సంస్థ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తమ నిర్ణయానికి ప్రభావితమయ్యే ప్రయాణికులకు తగిన ప్రదేశాల్లో వసతి కల్పించామని లేదా వారిని వేరే మార్గాలకు బదలాయించినట్టు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌ 21 నుంచి జూలై 3 మధ్య కాలంలో కూడా మొత్తం 667 విమానాలను ఇండిగో రద్దు చేసింది. జూన్‌ 27 ఒక్కరోజే 61 విమానాలను రద్దుచేసింది.

 

యునెటెడ్‌ టెక్నాలజీస్‌కు చెందిన ప్రాట్‌, విట్నీలు అభివృద్ధి చేసిన ఇంజిన్‌లలో తరుచు సమస్యలు తలెత్తుతున్నాయని ఇండిగో తెలిపింది. ఈ సమస్యలతో ఎయిర్‌బస్‌ నుంచి ఇండిగో, దాని ప్రత్యర్థి గోఎయిర్‌లు నడిపే విమానాల రాక ఆలస్యమవుతోంది. ఈ నెల మొదట్లో కూడా ఇంజిన్‌లో తలెత్తిన సమస్యతో ప్రాట్‌ అండ్‌ విట్నీ ఈ విమానయాన సంస్థలకు నష్టపరిహారం చెల్లించింది.

 

అయితే ఎంత మొత్తంలో నష్టపరిహారాలు అందుకున్నాయో మాత్రం ఇండిగో, గోఎయిర్‌ ప్రకటించలేదు. గత ఏడాదిగా తలెత్తుతున్న ఈ సమస్యలపై విచారణ వ్యక్తంచేసిన ఎయిర్‌లైన్స్‌ అధికారులు, త్వరలోనే వీటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికే సమస్య ఉన్న ఇంజిన్‌లను పెద్ద మొత్తంలో తొలగించామని, కానీ తమ వద్ద తగినంత స్పేర్‌ ఇంజిన్‌లు అందుబాటులో లేవని ఇండిగో ప్రెసిడెంట్‌ ఆదిత్య గోష్‌ చెప్పారు. తమ కార్యచరణలో లోపాలు సవాళ్లుగా నిలుస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. బిలీనియర్‌ రాహుల్‌ భాటియా, రాకేష్‌ గంగ్వాల్‌ ఆధీనంలో ఇండిగో నడుస్తోంది.  430 ఏ320 నియో జెట్స్‌కు ఆర్డర్‌ ఇస్తే, 22 మాత్రమే ఇప్పటికే పొందినట్టు బ్లూమ్‌బర్గ్‌ రిపోర్టు చేసింది.    ​

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top