ఏడాదిపాటు స్థిరంగానే భారత్ రేటింగ్

ఏడాదిపాటు స్థిరంగానే భారత్ రేటింగ్


అప్‌గ్రేడ్ కావాలంటే ద్రవ్యలోటు కట్టడి,

సంస్కరణలపై మరిన్ని చర్యలు కీలకం

మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ నివేదిక...

ముంబై: భారత్ సార్వభౌమ(సావరీన్) పరపతి రేటింగ్ వచ్చే ఏడాదిపాటు స్థిరంగానే కొనసాగవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజి దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. అయితే, రేటింగ్ అప్‌గ్రేడ్ కావాలంటే మాత్రం ప్రభుత్వం ద్రవ్యలోటు కట్టడి, ప్రభుత్వ వ్యయాల తగ్గింపు, ఇంధన సబ్సిడీల్లో కోత, సంస్కరణల దిశగా మరిన్ని నిర్ణయాత్మక, సమయానుకూల చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.



మూడీస్ ప్రస్తుతం భారత్‌కు ‘బీఏఏ3’ రేటింగ్‌ను, ఫిచ్ ‘బీబీబీ-’ రేటింగ్‌ను స్టేబుల్(స్థిరం) అవుట్‌లుక్‌తో కొనసాగిస్తున్నాయి. అయితే, ఒక్క స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్‌అండ్‌పీ) మాత్రమే ‘బీబీబీ-’ నెగటివ్(ప్రతికూల) అవుట్‌లుక్‌తో రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌లో ఇదే అతితక్కువ స్థాయి రేటింగ్. ఇంతకంటే తగ్గితే జంక్(పెట్టుబడులకు అత్యంత ప్రతికూలం) స్థాయికి పడిపోతుంది. దీనివల్ల దేశీ కంపెనీలు, ప్రభుత్వానికి విదేశీ నిధుల సమీకరణ చాలా భారంగా మారుతుంది.  భారత్ రేటింగ్ రానున్న కాలంలో డౌన్‌గ్రేడ్ అయ్యేందుకు ఏజెన్సీలు ఎలాంటి నిర్దిష్ట కారకాలనూ(ట్రిగ్గర్స్) పేర్కొనలేదు. అయితే, రేటింగ్ అవుట్‌లుక్‌ను నెగటివ్ నుంచి మళ్లీ స్థిరానికి పెంచాలంటే.. వృద్ధి పుంజుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్యోల్బణం తగ్గుదల చాలా ముఖ్యమని ఎస్‌అండ్‌పీ అంటోంది.



రేటింగ్ ఏజెన్సీలతో ఆర్థిక శాఖ సమావేశాలు...

భారత్ సావరీన్ రేటింగ్‌ను పెంచాల్సిందిగా కోరేందుకు వచ్చే 2-3 నెలల్లో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలతో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశం కానుంది. ద్రవ్యలోటు కట్టడికి(ఈ ఏడాది 4.1 శాతం లక్ష్యం) తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలను ఈ సందర్భంగా వివరించనుంది. ఆగస్టు 12న ఎస్‌అండ్‌పీ, 28న జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(జేసీఆర్‌ఏ) ప్రతినిధులతో భేటీ కానున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫిచ్, మూడీస్ ప్రతినిధులతో సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో సమావేశాలు ఉండొచ్చని ఆయన చెప్పారు. 2016-17కల్లా ద్రవ్యలోటును 3%కి తగ్గించాలనేది కేంద్రం లక్ష్యం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top