శ్రీలంక కన్నా దిగువన భారత్

శ్రీలంక కన్నా దిగువన భారత్ - Sakshi


వ్యాపారాలకు ఉత్తమ దేశాలతో ఫోర్బ్స్ జాబితా

93వ ర్యాంకుకే పరిమితం  

అగ్రస్థానంలో డెన్మార్క్


 

న్యూయార్క్: వ్యాపారాలకు ఉత్తమ దేశాల జాబితాలో భారత్ 93వ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 146 దేశాలతో ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన ఈ జాబితా లో మెక్సికో(61), కజాఖ్‌స్థాన్(65), శ్రీలంక (89) దేశాల కన్నా దిగువన నిల్చింది. వ్యాపారానికి ఉత్తమ దేశాల 9వ వార్షిక జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానం దక్కించుకోగా, హాంకాంగ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, స్వీడన్ వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్ 105వ స్థానంలో నిల్చింది. వరుసగా మూడో ఏడాది గినియా ఆఖరు ర్యాంకులో ఉంది.



భారత్ స్వేచ్ఛా మార్కెట్ ఎకానమీగా మారుతున్నప్పటికీ గతకాలపు నియంత్రణ విధానాలు ఇంకా కొన్ని అలాగే ఉన్నాయని ఫోర్బ్స్ పేర్కొంది. పేదరికం, అవినీతి, హింస, మహిళలపై వివక్ష, విద్యుదుత్పత్తి..సరఫరాలో లోపాలు, మేధోహక్కుల పరిరక్షణ పటిష్టంగా లేకపోవడం మొదలైన సవాళ్లను భారత్ పూర్తి స్థాయిలో అధిగమించాల్సి ఉంటుందని తెలిపింది.



సానుకూలంగా భవిష్యత్..

 ఎన్నికల అనంతరం సంస్కరణలపై ఆశలు, కరెంటు అకౌంటు లోటు తగ్గుదల, రూపాయి స్థిరపడటం తదితర అంశాలతో 2014లో భారత్‌పై ఇన్వెస్టర్లకు మళ్లీ సానుకూల అంచనాలు నెలకొన్నాయని ఫోర్బ్స్ వివరించింది. దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు చూస్తే ఒక మోస్తరు సానుకూలంగానే ఉన్నాయని పేర్కొంది. పెద్ద స్థాయిలో యువ జనాభా, పొదుపు..పెట్టుబడులు పెట్టడం మెరుగ్గా ఉండటం, అంతర్జాతీయ ఎకానమీతో మరింతగా అనుసంధానం మొదలైనవి ఇందుకు దోహదపడగలవని ఫోర్బ్స్ పేర్కొంది.

 

అమెరికా మరో 4 స్థానాలు డౌన్..

ఇతర సంపన్న దేశాలతో పోలిస్తే అమెరికా మరింతగా వెనుకబడింది. గతేడాది కన్నా మరో నాలుగు స్థానాలు దిగజారి 18వ స్థానంతో సరిపెట్టుకుంది. 2009లో రెండో స్థానంలో ఉన్న అమెరికా అప్పట్నుంచీ వరుసగా వెనుకబడుతూనే ఉంది. స్థిరాస్తి హక్కులు, నవకల్పనలు, పన్నులు, టెక్నాలజీ, అవినీతి, స్వేచ్ఛ, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ తదితర 11 అంశాల ప్రాతిపదికగా ఫోర్బ్స్ 146 దేశాలను వడబోసి ఈ జాబితాను తయారు చేసింది.



ఇదిలాఉండగా... భారత్ వాణిజ్య స్వేచ్ఛ విషయంలో 122 ర్యాంకుకు పరిమితమైంది. ద్రవ్యపరమైన స్వేచ్ఛలో 135వ స్థానం, టెక్నాలజీలో 120, పన్నుల భారంలో 122, అలసత్వంలో 128, అవినీతిలో 78, స్థిరాస్తి హక్కుల అంశంలో 55వ ర్యాంకు దక్కించుకుంది. అయితే, మార్కెట్ పనితీరు అంశంలో మాత్రం మూడో స్థానం, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణలో 7వ ర్యాంకులో నిలిచింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top