మన ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతోంది!

మన ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతోంది!


ఇప్పుడున్నంత పటిష్టంగా ఎన్నడూలేదు..

వృద్ధిరేటు మరింత దూసుకెళ్తుంది...

ఇదంతా కేంద్రంలో పటిష్ట నాయకత్వం,

కీలక సంస్కరణల ఫలితమే...

హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యలు


ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూలేనంత పటిష్టంగా ఉందని, రాబోయే కాలంలో వృద్ధి రేటు మరింతగా పరుగులు తీసే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. ప్రధానంగా కేంద్రంలో బలమైన నాయకత్వం ఉండటంతోపాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ జోరుకు దోహదం చేస్తున్నాయని చెప్పారు. సోమవారమిక్కడ భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన ‘రిస్క్ సమిట్’లో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా పరేఖ్ మోదీ సర్కారు పనితీరుపై సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


‘స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే... మన ఎకానమీ ఇప్పుడున్నంత బలమైన స్థాయిలో ఇదివరకెన్నడూ లేదు.ప్రస్తుత  కేంద్ర ప్రభుత్వ హయాంలో భారీస్థాయి అవినీతి అనేది పూర్తిగా తొలగింది. 7.5 శాతం పైగా వార్షిక జీడీపీ వృద్ధిరేటు అంచనాలతో ఇతర దేశాలతో పోలిస్తే మన ఎకానమీ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో పాటు అద్భుతమైన వృద్ధి సామర్థ్యం కూడా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అంతేకాదు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం ఎనానమీకి తోడ్పాటునందిస్తోంది’ అని పరేఖ్ వ్యాఖ్యానించారు.


 ప్రభుత్వ వ్యయం ఆసరా...

ప్రైవేటు రంగ కంపెనీల పెట్టుబడులు ఇంకా మందగమనంలోనే కొనసాగుతున్నప్పటికీ.. ప్రభుత్వ వ్యయం ముఖ్యంగా మౌలికసదుపాయాల కల్పనపై చేస్తున్న పెట్టుబడులు పుంజుకోవడంతో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘పోర్టులు, జల మార్గాలు, విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీస్ ఇలా ఇన్‌ఫ్రా రంగంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించి కార్యకలాపాలు చకచకా జరుగుతున్నాయి. అంతేకాదు పునరుత్పాదక ఇంధన రంగంలో సామర్థ్యాల పెంపు కూడా వేగవంతమైంది. సేవల మెరుగుదల కోసం రైల్వే శాఖ అనేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ టెండర్లు, బిడ్డింగ్ ప్రక్రియల్లో ఈ-వేలాన్ని పూర్తిగా ప్రవేశపెట్టడం దేశంపై విశ్వసనీయత పెరిగేలా చేస్తోంది. భారత్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిక రాబడులను ఆశించే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లను మరింత ఆకర్షించడంపై దృష్టిసారించాలి.’ అని అభిప్రాయపడ్డారు.


ప్రపంచ మార్కెట్లపట్ల అప్రమత్తంగా ఉండాలి..

ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. యూరోపియన్ బ్యాంకుల ఇబ్బందులు ఇంకా కొనసాగుతుండటం... ఇతరత్రా ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. పలు కీలక ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాలను తాకడం లేదా దానికి దరిదాపుల్లో కదలాడుతున్నాయి. వర్థమాన మార్కెట్లలో అధిక రాబడులకు ఆస్కారం ఉండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టిసారిస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 3-4 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు భారత్ క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోవడంతో రూపాయి విలువ తీవ్ర కుదుపులకు గురైంది. అయితే, ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్లలో భారత్‌తో పాటు ఇతర వర్ధమాన దేశాలపట్ల సెంటిమెంట్ మెరుగుపడింది.


గడిచిన వారంలో విదేశీ ఈక్విటీ ఫండ్స్ వర్ధమాన మార్కెట్లలో 5 బిలియన్ డాలర్ల నిధులను కుమ్మరించాయి. అంతేకాదు 20 బిలియన్ డాలర్లను బాండ్‌లలో పెట్టుబడి పెట్టారు. అయితే, రానున్న రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై తీసుకోబోయే నిర్ణయానికి సంబంధించి అంచనాల మేరకు వర్ధమాన దేశాల మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉంది. పెంపు దిశగా స్పష్టత వచ్చేకొద్దీ విదేశీ నిధులు మళ్లీ భారీగా వెనక్కివెళ్లేందుకు ఆస్కారం ఉంది. మళ్లీ కరెన్సీ విలువలు, స్టాక్స్‌లో తీవ్ర హెచ్చు తుగ్గులు ఉండొచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top