కలామ్.. ఆర్థికరంగంలోనూ దార్శనికత

కలామ్.. ఆర్థికరంగంలోనూ దార్శనికత - Sakshi


శాస్త్రవేత్త నుంచి ప్రథమ పౌరుని స్థాయి వరకూ దేశానికి అత్యుత్తమ సేవలు అందించిన అబ్దుల్ కలామ్... 2007లో రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లెక్కలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.  దేశం 9 శాతం పైగా వృద్ధి సాధిస్తున్న ఆ రోజుల్లో... ఈ గణాంకాల పట్ల అంతగా సంతృప్తి చెందలేదాయన.



ఇవి దేశ నిజ ఆర్థిక వ్యవస్థకు అద్దం పట్టడంలేదని ఆయన అన్నారు.  ‘దేశం ఆర్థికంగా ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పటానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలనూ ప్రాతిపదికగా తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు ‘నేషనల్ ప్రాస్పరిటీ ఇండెక్స్’ను సూచించారు కూడా.



జీడీపీ, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారి (బీపీఎల్) జీవన ప్రమాణాలు, వృద్ధుల జీవన ప్రమాణాల కలయికతో ఈ ఇండెక్స్ ఉండాలన్నారు. ప్రస్తుతం సేవలు, వ్యవసాయం, పారిశ్రామిక తదితర రంగాల ఉత్పత్తి విలువల ప్రాతిపదికన జీడీపీని లెక్కిస్తున్నారు. వృద్ధి వేగం, ఆ ఫలాలు సామాన్యుడికి అందకపోతే లాభం ఉండదని ఆయన చెప్పేవారు. పట్టణాల్లో ఉన్న సౌకర్యాలు గ్రామాలన్నిటికీ రావాలని, అప్పుడే సంపూర్ణ వృద్ధి సాధ్యమవుతుందని అనేవారు.



దేశంలో దాదాపు 60 కోట్ల మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగం వృద్ధిపై మీడియా సైతం దృష్టి సారించాలని, తద్వారా ఈ రంగాన్ని వృద్ధిలో ప్రధాన భాగస్వామిని చేయాలని చెప్పేవారు. అత్యున్నత స్థాయి ఆర్థిక వృద్ధి సాధించడానికి కావలసిన అవకాశాలూ, శక్తి సామర్థ్యాలూ భారత్‌కు ఉన్నాయని ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇవన్నీ కలామ్ దేశ ఆర్థిక దార్శనికతకు అద్దం పట్టేవే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top