రిటైల్ వార్కు ఐకియా రెడీ..!

రిటైల్ వార్కు ఐకియా రెడీ..!


హైదరాబాద్‌లో తొలిస్టోర్‌తో ఇండియాలోకి

2025 నాటికి దేశవ్యాప్తంగా 25 స్టోర్లు లక్ష్యం

ఒక స్టోర్ సగటు వార్షిక టర్నోవర్ రూ.720 కోట్లు!

అంతర్జాతీయంగా ప్రస్తుతం 348 స్టోర్లు

గతేడాది అమ్మకాలు రూ.2.72 లక్షల కోట్లు; లాభం 24,200 కోట్లు

ఇండియాలో టీవీలు కూడా ఐకియా బ్రాండ్‌తోనే అమ్మకం!

మల్టీబ్రాండ్ రిటైల్‌కు అనుమతి లేకపోవటమే కారణం

ఐకియా అంతర్జాతీయ వస్తువుల్లో ఇండియా వాటా 3 శాతమే

ఐదేళ్లలో దీన్ని రెట్టింపు చేస్తామంటున్న సంస్థ

ప్రస్తుతానికైతే చైనా నుంచి తెచ్చే వస్తువులే విక్రయం

ఈ వస్తువుల డిజైన్, టెస్టింగ్ మాత్రం ఐకియా సొంతం


 నేను ఒక్కడిని ఒకవైపు... లోకం ఒకవైపు!! ఇప్పుడు యూరప్ రిటైల్ దిగ్గజం ఐకియాను చూస్తే అదే అనిపిస్తుంది.

చెమ్చాలు, బల్బుల నుంచి బెడ్లు, కర్టెన్ల దాకా ఇంటికి కావాల్సిన హోమ్ ఫర్నిషింగ్ మొత్తాన్ని విక్రయించే ఐకియా... భారతదేశానికి కొత్త రిటైల్ అనుభవాన్ని పరిచయం చేస్తామంటోంది. యూరప్‌లో, అమెరికాలో మాదిరి తన స్టోర్లలో ఫర్నిచర్‌తో పాటు టీవీ, ఫ్రిజ్, మైక్రో ఓవెన్ల వంటి హోమ్ అప్లయెన్సెస్‌ను కూడా విక్రయిస్తామంటోంది. అదే జరిగితే... దేశంలో వివిధ బ్రాండ్లతో ఒకేసారి పోటీ పడుతున్నట్లే!! ఎనిమిదేళ్లుగా చైనాలో సైతం నిలకడగా మార్కెట్ వాటా పెంచుకుంటూ వస్తున్న ఈ సంస్థ... ఇండియాలో కూడా 2025 నాటికంటూ  పెద్ద లక్ష్యాలే నిర్దేశించుకుంది. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో స్టోర్ ప్రారంభించనున్న నేపథ్యంలో స్వీడన్‌లోని తన పుట్టినిల్లయిన ‘ఆల్మ్‌హల్ట్’లో తన టెక్నాలజీని, పని  సంస్కృతిని కొందరు పాత్రికేయులకు ప్రత్యక్షంగా చూపించింది. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం...


ఆల్మ్‌హల్ట్(స్వీడన్) నుంచి మంథా రమణమూర్తి

ఆల్మ్‌హల్ట్! నిజానికిది స్వీడన్‌లో ఓ చిన్న ప్రాంతం. కాకపోతే ఏడాదికి రూ.2.7 లక్షల కోట్ల అమ్మకాలు జరిపే ‘ఐకియా’ హృదయం మాత్రం ఇక్కడే ఉంది. దాని వ్యవస్థాపకుడు ఇంగ్వర్ కొంప్రాడ్ సొంత ప్రాంతం కావటంతో పాటు... ప్రపంచ ధనికుల్లో ఒకడిగా ఆయన ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. సైకిల్‌పై వస్తువులు విక్రయించే స్థాయి నుంచి ఆయన తొలి ఐకియా స్టోర్‌ను ఆరంభించింది కూడా ఇక్కడే. ఇప్పుడు ఐకియా కార్పొరేట్ కార్యాలయాల్లో కొన్ని కొన్ని కొలువుదీరటంతో పాటు.. సంస్థ ఉత్పత్తులకు ఆత్మ లాంటి ఇన్నోవేషన్... డిజైన్... టెస్టింగ్... కొన్ని ప్రాంతాలకు అవసరమైన ఉత్పత్తితో పాటు ప్రచార విభాగం... క్యాటలాగ్ ముద్రణ... ఇవన్నీ కూడా జరిగేది ఆల్మ్‌హల్ట్‌లోనే.


తయారీ నుంచి అమ్మకాల వరకూ భిన్నమే!!

ఇతర తయారీ సంస్థల్లా ఐకియా తాను విక్రయించే వస్తువులన్నిటినీ తనే తయారు చేయదు.  అలాగని వాల్‌మార్ట్ లాంటి రిటైల్ సంస్థల్లా ఇతరులు తయారు చేసిన వస్తువుల్ని మాత్రమే విక్రయించదు. కొన్ని ఫర్నిచర్ వస్తువుల్ని తాను తయారు చేయటంతో పాటు... తన స్టోర్‌లో విక్రయించే ప్రతి వస్తువునూ తనే డిజైన్ చేయటం... దాన్ని కాంట్రాక్టు తయారీ కంపెనీలకు అప్పగించటంతో పాటు, తయారైన వస్తువుల్ని తనే పరీక్షించటం ఐకియా ప్రత్యేకత. వీటికి తోడు ఆయా తయారీ ప్రాంతాల్లో ఐకియా సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారని ఐకియా కమ్యూనికేషన్స్ (ఇండియా) హెడ్ పాట్రిక్ ఆంటోనీ ‘సాక్షి’తో చెప్పారు.


 ఇక స్టోర్‌లో విక్రయించేటపుడూ ఐకియా ప్రత్యేకత కనిపిస్తుంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో 348కి పైగా స్టోర్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ... దాదాపు ప్రతిచోటా స్టోర్ డిజైన్ ఒకేలా ఉండేలా జాగ్రత్తపడుతుంది. కొనుగోలుదార్ల కోసం రకరకాల బెడ్రూమ్ సెటప్‌లను స్టోర్‌లోనే ఏర్పాటు చేయటంతో పాటు ప్రతి దానికీ ఓ కోడ్ నంబరుంటుంది. స్టోర్ ప్రవేశద్వారం వద్ద మనకిచ్చే ఫారంపై నచ్చిన వస్తువు తాలూకు కోడ్ నంబర్ వేస్తే చాలు. అది బిల్లింగ్ దగ్గరకు వచ్చేస్తుంది. పెపైచ్చు ప్రతి వస్తువునూ కార్లోనో, ట్రాలీలోనే తీసుకెళ్లేలా ఫ్లాట్‌గా ఉండే అట్టపెట్టెల్లో పెట్టి ఇవ్వటం ఐకియా ప్రత్యేకత. దీన్నే సంస్థ ‘ఫ్లాట్ ప్యాక్’ స్ట్రాటజీగా చెబుతుంది. ఇక్కడ కొనే ప్రతి వస్తువూ ఎవరికి వారే బిగించుకునేలా ఉంటుంది.


 మారుతున్న టెక్నాలజీతో...

‘ఆల్మ్‌హల్ట్’లో ప్రధానంగా ఐకియా భవిష్యత్ వ్యూహాలు కనిపిస్తాయి. 2009 నుంచీ ‘‘రూపం- పనితీరు - నాణ్యత - స్థిరత్వం-తక్కువ ధర’’ అనే ఐదు లక్షణాలూ ఉండే డెమొక్రటిక్ డిజైన్ కాన్సెప్ట్‌ను పాటిస్తున్నట్లు సంస్థ డిజైన్ మేనేజర్ ‘మార్కస్ ఎంగ్‌మన్’ చెప్పారు. ‘‘ప్రస్తుతం 70 ప్రొడక్ట్ ఇన్నోవేషన్ బృందాలున్నాయి. ఏటా 3,600 కొత్త వస్తువులు డిజైన్ చేస్తున్నాం. స్టోర్లలో అవి పాత వాటి స్థానాన్ని ఆక్రమిస్తుంటాయి. మొత్తం డిజైనర్లలో 20 మంది ఐకియా ఉద్యోగులు కాగా 170 మంది బయటివారు’’ అని వివరించారాయన.


స్థిరత్వంలో భాగంగా పేపర్‌తో ఎం- బోర్డ్‌లను తయారు చేయడానికి, పర్యావరణానికి హాని చేయని వస్తువుల్ని వినియోగించడానికి ప్రయతిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్ కోసం ఐకియా ‘వర్చువల్ రియాలిటీని’ పరీక్షిస్తోంది. ఐకియా సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వీఆర్ హెడ్‌సెట్ ద్వారా మనక్కావాల్సిన వస్తువుల్ని నిజంగా తాకుతున్నట్లుగా అనుభూతి చెందుతూ సెలక్ట్ చేసుకోవటం దీని ప్రత్యేకత. ‘‘ఇది భవిష్యత్ టెక్నాలజీ. దీని అమలుకు కొన్నేళ్లు పట్టొచ్చు. కానీ ఇదో గేమ్ చేంజర్’’ అని సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ హెడ్ సుసాన్ పుల్వెరర్ అభిప్రాయపడ్డారు.


 సింగిల్ బ్రాండా? మల్టీ బ్రాండా?

మరో చిత్రమేంటంటే దేశంలో మల్టీ బ్రాండ్ రిటైల్ సంస్థలు 100 శాతం పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుతం అనుమతి లేదు. కాకపోతే ఐకియా సింగిల్ బ్రాండా... మల్టీ బ్రాండా అన్నది కూడా ఒకింత గందరగోళమే. ఎందుకంటే విదేశాల్లోని స్టోర్లలో టీవీలు, ఓవెన్ల వంటి హోమ్ అప్లయెన్సెస్‌నూ ఇది విక్రయిస్తోంది. అక్కడైతే వీటికి ఐకియా బ్రాండ్ ఉండదు. ఇదే ప్రశ్న పాట్రిక్‌ను అడగ్గా.. ‘‘నిజమే! చూడాలి. ఇండియాలో వాటికీ ఐకియా బ్రాండ్ తప్పకపోవచ్చు. మా వ్యూహాన్ని మార్చుకోవాలేమో’’ అన్నారాయన. అంటే.. ఐకియా టీవీలూ వస్తాయన్నమాట!!.


కేటలాగే పెద్ద మీడియా!!

ఐకియా స్టోర్లలో దొరికే కేటలాగ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా అంటే... ఏటా వివిధ భాషల్లో దాదాపు 22 కోట్లకుపైగా కేటలాగ్‌లు ముద్రిస్తుందీ సంస్థ. అంతే కాదు!! ప్రచారానికి పెట్టే ఖర్చులో 70 శాతం దీనికే పెడుతుంది. ఎందుకంటే ఇదే సంస్థ ప్రధాన ప్రచారాస్త్రం. ఆన్‌లైన్లో సైతం ఈ- కేటలాగ్ లభ్యమవుతుంది. మరో విశేషమేంటంటే ఏడాదికోసారి ముద్రించే కేటలాగ్‌లో... ధరలు కూడా ఉంటాయి. అవి ఏడాదంతా ఒకేలా ఉంటాయి. మధ్యలో పెరగవు.


మూడేళ్ల నుంచే వ్యూహానికి పదును...

ఐకియాను చూస్తే అంతర్జాతీయ కంపెనీల బ్రాండింగ్ వ్యూహం ఎంత పక్కాగా ఉంటుందో అర్థమవుతుంది. 1.5 బిలియన్ యూరోల పెట్టుబడితో ఇండియాలో అడుగుపెడుతున్నామని 2012లో ప్రకటించిన ఐకియా... అప్పటి నుంచీ తగిన ఏర్పాటు చేసుకుంటూ వస్తోంది. ఢిల్లీ తదితర నగరాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించి హోమ్ ఫర్నిషింగ్‌ను ఇష్టపడే వివిధ వర్గాలను వాటికి ఆహ్వానించింది. నగరాల్లో మధ్య తరగతి ఎలా పెరుగుతోందో, 2025 నాటికి ఎంత ఉంటుందో సర్వేలు చేసింది. పలు అంశాలు కలసి రావటంతో తొలి స్టోర్‌కు హైదరాబాద్‌నే వేదికగా నిర్ణయించింది.


2015లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 13 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అంతేకాదు!! 2014లోనే స్వీడిష్ ఎంబసీ వివిధ కళాశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించింది. ఫైనల్స్‌కు హైదరాబాదే వేదిక. విజేతలను ఉచితంగా స్వీడన్‌కు తీసుకెళ్లటంతో పాటు ఐకియా ప్రధాన కార్యాలయాన్నీ చూపించటం విశేషం. ఇక గతేడాది జనవరిలో హైదరాబాద్‌లో హోమ్ ఫర్నిషింగ్‌పై వర్క్‌షాప్‌లు నిర్వహించటంతో పాటు జూన్‌లో జాబ్ మేళానూ   నిర్వహించింది.

ఇండియాలో సోర్సింగ్ పెరుగుతుందా?

ఐకియా 30 ఏళ్లుగా విదేశాల్లోని తన స్టోర్లలో విక్రయించడానికి ఇండియాలో రకరకాల వస్తువుల్ని తయారు చేయిస్తోంది. ప్రస్తుతం ఏటా ఇండియా నుంచి సోర్స్ చేస్తున్న వస్తువుల విలువ రూ.234 కోట్లు. వీటిలో అత్యధికం కర్టెన్లు, కార్పెట్ల వంటి కాటన్ వస్తువులే. ‘‘ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల మంది పత్తిరైతులుండగా ఒక్క ఇండియాలోనే 4 లక్షల మంది ఉన్నారు. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో ఇండియా వాటా 11.5 శాతం.


తక్కువ నీటిని వాడుతూ పండించేలా కాటన్ ఫర్ మోర్ సస్టెయినబుల్ సోర్సెస్ (సీఎంఎస్‌ఎస్) నినాదంతో మేం పనిచేస్తున్నాం. ఈ పద్ధతిలో పండించిన 85 లక్షల టన్నుల పత్తిని ఏటా కొంటున్నాం. ఇది మా పత్తి కొనుగోళ్లలో  35 శాతం. తెలంగాణ నుంచి 10 నుంచి 12 శాతం పత్తి కొంటున్నాం. జన్యు మార్పిడి (జీఎం) విత్తనాల విషయానికొస్తే దీన్లో రైతు నిర్ణయమే కీలకం. అయితే ప్రపంచంలో 90 శాతం పత్తి జీఎం విత్తనాలతోనే పండుతోందని గుర్తుంచుకోవాలి’’ అని ఐకియాలో కాటన్ లీడర్‌గా పని చేస్తున్న బిహార్ వాసి ప్రమోద్ సింగ్ చెప్పారు.


 హైదరాబాద్‌లో వచ్చే ఏడాది స్టోర్ ఆరంభించినా... దీన్లోని వస్తువులు మాత్రం అత్యధికం విదేశాల నుంచి తెచ్చినవే ఉంటాయి. ప్రస్తుతం ఐకియా తన స్టోర్ల కోసం చైనా నుంచి 25 శాతం, పోలండ్, స్వీడన్‌ల నుంచి తలా 8 శాతం సోర్స్ చేస్తోంది. ఇండియా నుంచి 3 శాతమే సోర్స్ చేస్తుండగా... దేశంలో అమ్మే వస్తువుల్లో కనీసం 30 శాతం స్థానికంగా తయారు చేసినవై ఉండాలనే నిబంధన ఇక్కడ ఉంది. అయితే తొలి ఐదేళ్లూ ఈ నిబంధన వర్తించదు కాబట్టి... వచ్చే ఐదేళ్లలో ఇండియా నుంచి సోర్స్ చేసే వస్తువుల్ని 30 శాతానికి పెంచుకుంటామని పాట్రిక్ ఆంటోనీ చెప్పారు.


‘‘మీరు చైనా నుంచి వస్తువుల్ని డంప్ చేసి విక్రయిస్తారు కదా? దీనివల్ల ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న మేకిన్ ఇండియా భావన దెబ్బతినదా?’’ అని ఆయన్ను ప్రశ్నించగా... ‘‘మేం ప్రస్తుతం ఏటా రూ.234 కోట్ల విలువైన వస్తువుల్ని ఇండియా నుంచి ఎగుమతి చేస్తున్నాం. మున్ముందు దీన్ని వేగంగా పెంచుతాం. వచ్చే ఐదేళ్లలో మేం దిగుమతి చేసుకునే వస్తువుల విలువకన్నా ఎగుమతి చేసేవే ఎక్కువగా ఉంటాయి’’ అని చెప్పారాయన. కాకపోతే ప్రస్తుతం సగటున ఒక ఐకియా స్టోర్ ఏడాదికి రూ.720 కోట్ల అమ్మకాలు జరుపుతోంది. 2025 నాటికి దేశంలో 25 స్టోర్లు ఏర్పాటు చేయాలన్నది ఐకియా లక్ష్యం. మరి ఆ లెక్కన.. 25 స్టోర్లలో విక్రయాలు 2015 నాటికి రూ.18,000 కోట్లుగా ఉంటాయి. ఆ మేరకు ఇండియాలో తయారీ పెరుగుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top