29,100 మద్దతు కోల్పోతే మరింత క్షీణత

29,100 మద్దతు కోల్పోతే మరింత క్షీణత


మార్కెట్‌ పంచాంగం

బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికల తర్వాత ప్రపంచ మార్కెట్లకు మళ్లీ కొత్త సవాళ్లు ఏర్పడ్డాయి. అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు, ఫ్రాన్స్‌ ఎన్నికలు వంటి పరిణామాల్ని ఇప్పటివరకూ మార్కెట్లు పెద్దగా లెక్కచేయడం లేదనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో గతవారం ప్రపంచ ప్రధాన మార్కెట్లలో స్వల్పంగా హెడ్జింగ్‌ కార్యకలాపాలు మాత్రం జరిగాయి.


ఈ హెడ్జింగ్‌ ఫలితంగా భారత్‌తో సహా గ్లోబల్‌ మార్కెట్లు కాస్త నెమ్మదించాయి. ఇక్కడ కూడా ఇన్వెస్టర్లు వారి పెట్టుబడుల్ని పరిరక్షించుకునే క్రమంలో తాజాగా షార్ట్‌ పొజిషన్లను బిల్డ్‌ చేసుకున్నట్లు ఎన్‌ఎస్‌ఈ డేటా సూచిస్తున్నది. గత గురువారం వరకూ 30 పాయింట్ల ప్రీమియంతో వున్న ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ ప్రీమియం శుక్రవారం 10 పాయింట్లకు తగ్గడంతో పాటు దాదాపు 3 శాతం ఓపెన్‌ ఇంట్రస్ట్‌ పెరగడం షార్ట్‌ బిల్డప్‌కు సూచన.



సెన్సెక్స్‌  సాంకేతికాలు

ఏప్రిల్‌ 21తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 29,701 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత 29,259 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 96 పాయింట్ల స్వల్పనష్టంతో 29,365 పాయింట్ల వద్ద ముగిసింది. ఫ్రాన్స్‌ ఎన్నికల ప్రభావంతో ఈ సోమవారం మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే సెన్సెక్స్‌కు తొలి మద్దతు 50 రోజుల చలన సగటు (50 డీఎంఏ) రేఖ సంచరిస్తున్న 29,100 పాయింట్ల వద్ద లభించవచ్చు.


గ్యాప్‌అప్‌తో మొదలైతే తొలి అవరోధం 29,585 పాయింట్ల వద్ద కలగవచ్చు. 29,100 పాయింట్ల మద్దతును కోల్పోతే 28,950–28,800 శ్రేణి వరకూ పతనం కావొచ్చు. రానున్న రోజుల్లో ఈ శ్రేణిని కూడా వదులుకుంటే క్రమేపీ 28,382 పాయింట్ల వరకూ (గత డిసెంబర్‌ కనిష్టస్థాయి అయిన 25,754 పాయింట్ల నుంచి 30,007 పాయింట్ల గరిష్టం వరకూ జరిగిన ర్యాలీలో ఇది 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి)  తగ్గే ప్రమాదం వుంది. తొలి అవరోధస్థాయిని దాటితే సెన్సెక్స్‌ 29,660–29,840 శ్రేణి వరకూ పెరగవచ్చు. సెన్సెక్స్‌ తిరిగి 30,000 శిఖరాన్ని అధిరోహించాలంటే 29,840 నిరోధస్థాయిని దాటాల్సివుంటుంది.



నిఫ్టీ 9,015 మద్దతు కోల్పోతే డౌన్‌ట్రెండ్‌ కొనసాగింపు...

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతవారం 130 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై  చివరకు అంత క్రితం వారంతో పోల్చితే 31 పాయింట్ల తగ్గుదలతో 9,119 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 50 డీఎంఏ రేఖ కదులుతున్న 9,015 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే 9,185 పాయింట్ల సమీపంలో నిరోధం ఎదురుకావొచ్చు.


9,015 పాయింట్ల దిగువన ముగిస్తే 8,945–8,890 పాయింట్ల శ్రేణిని పరీక్షించవచ్చు. ఈ శ్రేణిని సైతం నష్టపోతే, రానున్న రోజుల్లో క్రమేపీ 8,747 వరకూ క్షీణించవచ్చు.  9,185 నిరోధస్థాయిని దాటితే 9,200–9,250 పాయింట్ల శ్రేణి మధ్య తిరిగి గట్టి అవరోధం కలగవచ్చు. ఈ శ్రేణిని ఛేదిస్తేనే మళ్లీ కొత్త గరిష్టస్థాయిని నిఫ్టీ అందుకునే అవకాశంవుంటుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top