ఐసీఐసీఐ లాభం 2,922 కోట్లు

ఐసీఐసీఐ లాభం 2,922 కోట్లు


క్యూ4లో 10 శాతం వృద్ధి...

నికర వడ్డీ ఆదాయం 5,079 కోట్లు; 17% అప్

వదలని మొండిబకాయిల బెడద...

షేరుకి రూ. 5 డివిడెండ్ ప్రకటన...


 న్యూఢిల్లీ: దేశీ ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్‌ను మొండిబకాయిలు వెంటాడుతున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 10.2 శాతం వృద్ధి చెంది రూ.2,922 కోట్లుగా నమోదైంది.



అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,652 కోట్లుగా ఉంది. మొండిబకాయిలకు ప్రొవిజనింగ్(కేటాయింపులు) పెరగడం, రుణ వృద్ధి మందగించడం వంటివి లాభాల వృద్ధిపై ప్రభావం చూపాయి. కాగా, క్యూ4లో బ్యాంక్ స్టాండెలోన్ ఆదాయం రూ.14,465 కోట్ల నుంచి రూ.16,235 కోట్లకు పెరిగింది. 12.2% వృద్ధి చెందింది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 17% పెరిగి రూ.5,079 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఎన్‌ఐఐ రూ.4,357 కోట్లుగా ఉంది.



క్యూ4లో నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) 3.46 శాతం నుంచి 3.57 శాతానికి చేరింది. ఇక పూర్తి ఏడాదికి చూస్తే(2014-15) స్టాండెలోన్ లాభం రూ.10 వేల కోట్లను అధిగమించింది. 2013-14లో నమోదైన రూ.9,810 కోట్లతో పోలిస్తే 14% వృద్ధి చెంది రూ.11,175 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.54,606 కోట్ల నుంచి రూ.61,267 కోట్లకు ఎగసింది. 12.1% వృద్ధి నమోదైంది.



కాగా, క్యూ4లో విదేశీ మారక(ఫారెక్స్) లావాదేవీలకు సంబంధించిన లాభాలు 3 రెట్ల జంప్‌తో రూ.245 కోట్ల నుంచి రూ.726 కోట్లకు దూసుకెళ్లాయి. లేదంటే... లాభాల వృద్ధి మరింత మందగించేది. కన్సాలిడేటెడ్‌గా చూస్తే...: బీమా, బ్రోకింగ్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి చూస్తే(కన్సాలిడేటెడ్) ఐసీఐసీఐ నికర లాభం క్యూ4లో 13.24% పెరిగి రూ.3,085 కోట్లకు చేరింది. ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.21,652 కోట్ల నుంచి రూ.24,914 కోట్లకు ఎగసింది.

 

మొండిబకాయిలు పెరిగాయ్...

బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) క్యూ4లో 3.78 శాతానికి ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 3.03 శాతమే. ఇక నికర ఎన్‌పీఏలు సైతం 0.82 శాతం నుంచి 1.4 శాతం పెరిగాయి.  దీంతో ప్రొవిజనింగ్ మొత్తం కూడా రెట్టింపై రూ.714 కోట్ల నుంచి రూ.1,345 కోట్లకు చేరింది. క్యూ4లో కొత్తగా రూ.3,260 కోట్ల స్థూల ఎన్‌పీఏలు జతవగా.. ఇందులో పునర్‌వ్యవస్థీకరించిన రుణాల వాటా రూ.2,246 కోట్లుకావడం గమనార్హం. మరో రూ.1,500 కోట్ల రుణాలు పునర్‌వ్యవస్థీకరణ బాటలో ఉన్నట్లు బ్యాంక్ వెల్లడించింది.

 

ఇతర ముఖ్యాంశాలివీ...

బ్యాంక్ రుణ వృద్ధి క్యూ4లో 14%గా ఉంది. దీంతో మార్చి, 2015 నాటికి మొత్తం రుణాల పరిమాణం రూ.3,87,522 కోట్లు. కాగా, రిటైల్ రుణాల్లో 25, కార్పొరేట్ రుణాలు 10% వృద్ధి చెందాయి.

డిపాజిట్లు 9 శాతం ఎగసి రూ.3,61,563 కోట్లకు చేరాయి.

జీవిత బీమా అనుంబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం 2014-15లో స్వల్పంగా రూ.1,567 కోట్ల నుంచి రూ.1,634 కోట్లకు పెరిగింది. సాధారణ బీమా సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ నికర లాభం రూ. 511 కోట్ల నుంచి రూ.536 కోట్లకు చేరింది.

రూ. 2 ముఖవిలువ గల షేరుపై రూ. 5 డివిడెండ్ ప్రకటించింది.

 ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర సోమవారం బీఎస్‌ఈలో 1.85 శాతం క్షీణించి రూ.302.4 వద్ద స్థిరపడింది.

 

కొన్ని వ్యాపార విభాగాలకు చెందిన రుణాల్లో సమస్యల కారణంగానే మొండిబకాయిలు పెరిగాయి. అయితే, ఎన్‌పీఏలకు ఇదే గరిష్టస్థాయి కావచ్చు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. అదే విధంగా రుణాల్లో 20 శాతం, డిపాజిట్ల విషయంలో 16% వృద్ధిని అంచనా వేస్తున్నాం. కార్పొరేట్ రంగం నుంచి ఇంకా డిమాండ్ పుంజుకోవాల్సి ఉంది. దీంతో రిటైల్ రుణాలపైనే అధికంగా దృష్టిపెడుతున్నాం.

 - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top