ఫైనాన్షియల్ బేసిక్స్..

ఫైనాన్షియల్ బేసిక్స్..


 క్రెడిట్ కార్డుకు ముందు..

క్రెడిట్ కార్డు అనేది ప్రస్తుతం మనిషికి ఒక అత్యవసరమైన ఆర్థిక సాధనంగా మారిపోయింది. కార్డు వల్ల నిత్య జీవితంలో చాలా ప్రయోజనాలు పొందొచ్చు. అయితే కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిందేమంటే... ప్రపంచంలో ఏదీ ఫ్రీగా రాదు. ‘పెట్టే వాడికి కొట్టే హక్కు ఉంటుంది’ అనే విషయాన్ని కూడా మనం మరచిపోకూడదు. ఎందుకంటే క్రెడిట్ కార్డులను సరైన పద్ధతిలో ఉపయోగించుకోకపోతే బాధపడాల్సి వస్తుంది. ‘తాహతుకు మించి ఏ పని చేయకూడదు’ అనే నిత్య సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.


కార్డు ద్వారా చేసే ఖర్చులు.. నిజంగా అవసరమైనవా? కాదా? అని ఒకటికి వందసార్లు ప్రశ్నించుకోవాలి. అనవసరపు వ్యయాలను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ ఒక్క ఖర్చే కదా... అని అలసత్వం ప్రద ర్శిస్తే నె లాఖరులో బిల్లు తడిసి మోపెడవుతుంది. అందుకే వచ్చే బిల్లును కట్టగలమా? లేదా? అని చూసుకోవాలి. బిల్లు ఎంతొచ్చిన పర్వాలేదు. కట్టేస్తాను. అనుకుంటే చింతలేదు. కానీ బిల్లు గురించి ఆలోచించే వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించకపోతే అధిక పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. అలాగే మన సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది.


 క్రెడిట్ కార్డుకు తీసుకునే ముందు వాటి చార్జీలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. వీటిల్లో వడ్డీ రేటు, వార్షిక ఫీజు, ఆలస్య రుసుం వంటి వాటికి ప్రాధాన్యమివ్వండి. మీరు వాహన ఇంధనానికో లేదా టికెట్ బుకింగ్స్‌కో కార్డులను ఎక్కువగా వాడాల్సి వస్తుందనుకుంటే.. కోబ్రాండెడ్ కార్డులను తీసుకోవడం ఉత్తమం.


వీటి ద్వారా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే కార్డు క్రెడిట్ లిమిట్ ఎంతుందో చూడండి. మరీ ఎక్కువ లిమిట్ తీసుకోవద్దు. ఎక్కువ లిమిట్ వల్ల అధికంగా ఖర్చు చేసి ఒక్కొక్కసారి బిల్లులను చెల్లించలేని పరిస్థితి రావొచ్చు. చాలా క్రెడిట్ కార్డులు రివార్డు పాయింట్లను అందిస్తుంటాయి. కొనుగోలుకు ముందు ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో వెతకండి. వాటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకోండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top