రెంటొమో.. ఇదో స్టోర్ రూం స్టార్టప్!

రెంటొమో.. ఇదో స్టోర్ రూం స్టార్టప్!


హెయిర్ బ్లోయర్ నుంచి హై ఎండ్ కార్ల దాకా..

ప్రతీ ఒక్కటీ అద్దెకిస్తున్న రెంటొమో

6 నెలల్లో పాత వస్తువులకూ బీమా పాలసీ ప్రారంభం

రూ.60 లక్షల నిధుల సమీకరణ కూడా..


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతి ఇంట్లో స్టోర్ రూమ్ కామన్. అందులో వాడి పడేసిన వస్తువులు చాలానే ఉంటాయి. పారేయడానికి మనసు రాక, మళ్లీ వాడాలన్న ఇంట్రస్టూ లేక అవి దుమ్ముపట్టిపోతుంటాయి. అయితే మనకు అక్కర్లేదనుకునే వస్తువులు ఇతరులకు పనికి రావొచ్చుగా! మనం పారేయాలనుకున్న వస్తువులు వేరేవాళ్లకు విలువైనవిగా అనిపించొచ్చుగా! దీన్నే వ్యాపార సూత్రంగా మార్చుకున్నాడు అన్షుల్ జోరి. ఇంకా చెప్పాలంటే హెయిర్ బ్లోయర్ నుంచి హై ఎండ్ కార్ల దాకా ప్రతీ ఒక్కటీ అద్దెకిచ్చే ‘రెంటొమో’ సంస్థను ప్రారంభించాడు.


 మరిన్ని వివరాలివిగో..

పుణే వర్సిటీలో ఎంసీఏ చేశాక.. ఐబిబో, ఆస్క్ లైలా, బుక్ అడ్డా, అమెజాన్ వంటి కంపెనీల్లో కొంత కాలం ఉద్యోగం చేశా. ఓసారి కుటుంబంతో కలిసి యూరప్‌కు వెళ్లా. టూరిస్ట్‌లకు రూమ్ షేరింగ్ ఇచ్చే ఎయిర్ బీఎన్బీ సంస్థ సేవలను చూసి ఆశ్చర్యపోయా. ఇందులో కేవలం గదే కాదు చార్జర్, కెమెరా, ల్యాప్‌టాప్, బైకు, కారు.. ఇలా ప్రతీ ఒక్కటీ అద్దెకిస్తున్నారు. అచ్చం ఇలాంటి సేవలను మన దేశంలోనూ ప్రారంభిస్తే బాగుండనిపించింది! ఆఫీసుకొచ్చాక తెలిసిన వాళ్లకు, సహోద్యోగులకు ఈ-మెయిళ్లు పెట్టా. నా దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అద్దెకు కావాలంటే తీసుకోండని! ఆశ్చర్యకరంగా చాలా మంది నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకేముంది రూ. 5 లక్షల పెట్టుబడితో ఆగస్టు 2015లో రెంటొమో సంస్థను ప్రారంభించాం.


 షేరింగ్ ఎకానమీ. సూటిగా చెప్పాలంటే వస్తువులను అద్దెకివ్వటం, తీసుకోవటం. అయితే మన దేశంలో ఇలాంటి సంస్థలంటే బైకులు, కార్ల వంటి వాటికే పరిమితం. కానీ, అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో దువ్వెన్లు, కెమెరాలు, చార్జర్లు, వంటింట్లోని సామాన్లు.. ఇలా ప్రతీ ఒక్కటీ అద్దెకు దొరకుతాయి. ప్రతీ ఒక్కటీ యూజ్ అండ్ పే పాలసీనే. సరిగ్గా ఇలాంటి కంపెనీయే రెంటొమో.  అంటే వస్తువు యజమానులను, అద్దెకు తీసుకునే వారిని ఇద్దరినీ కలపడమే రెంటొమో పని. ఇంకా చెప్పాలంటే స్టోర్ రూం వస్తువులకు అగ్రిగేటరన్నమాట.


 రూ.10 నుంచి రూ.10 వేల దాకా..

ప్రస్తుతం రెంటొమోలో ట్రావెల్, స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్, మోటార్ బైక్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వంటి విభాగాల్లో సుమారు 550 వస్తువులు అద్దెకిచ్చేందుకు రిజిస్టరై ఉన్నాయి. అవసరాన్ని బట్టి నెల, రోజు, వారం లెక్కన వస్తువులను అద్దెకు తీసుకోవచ్చు. వీటి ధరలు పది రూపాయల నుంచి పది వేల దాకా ఉన్నాయి. బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన రెంటొమో సేవలు హైదరాబాద్, ఢిల్లీ, గుర్గావ్, పుణె, లక్నో నగరాలకు విస్తరించాయి.


వస్తువులను అద్దెకివ్వాలనుకుంటే..

మన దగ్గరున్న వస్తువులను రెంటొమో ద్వారా అద్దెకివ్వాలనుకుంటే.. రెంటొమో వెబ్‌సైట్‌లోకి లాగిన్ కాగానే అక్కడ అప్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వస్తువు తాలుకు ఫొటోలను అప్‌లోడ్ చేసి.. ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, అద్దె వంటి ఇతర వివరాలిస్తే సరిపోతుంది. అద్దెకు తీసుకోవాలనుకునే వ్యక్తి.. మా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి ఏ వస్తువు కావాలో నమోదు చేస్తే చాలు.. దానికి సంబంధించిన వ్యక్తుల, వాటి అద్దె వివరాలొస్తాయి. నచ్చితే సంబంధిత వ్యక్తి తాలుకు ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఫెరిఫై చేసి.. వస్తువు తాలూకు యజమాని ఫోన్ నంబర్‌ను ఇస్తాం. మరో ఆరు నెలల్లో అప్‌లోడ్ చేసే వస్తువులకు బీమా పాలసీలను ప్రారంభించనున్నాం. అపోలో, భారతీ ఆక్సా సంస్థలతో చర్చిస్తున్నాం.


 వస్తువులు తిరిగొస్తాయా మరి..

యజమానుల దగ్గర్నుంచి వస్తువులను అద్దెకు తీసుకొని అవసరం తీరాక తిరిగి ఇచ్చేయడమే దీని పని. అంటే తాత్కాలిక అవసరాల కోసం కొత్త వస్తువులు కొనాల్సిన పనుండదు. దానివల్ల డబ్బు మిగులుతుంది. అటు అద్దెకిచ్చిన వారికీ ఎంతో కొంత ఆమ్‌దాని. ఎలా చూసినా ఇద్దరికీ లాభమే. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. అద్దెకిచ్చిన వస్తువు తిరిగి రాకపోతే? ఒకవేళ వచ్చినా ఏదైనా డ్యామేజి జరిగితే? దానికీ ఓ పరిష్కారం చూపించింది రెంటొమో. చుట్టుపక్కల వాళ్లు స్నేహితులు, కామన్ ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్ ఇలా రెంటొమోలో ఒక కమ్యూనిటీ ఉంటుంది. వారిలో అవసరం ఉన్న వారికి వస్తువులు అద్దెకివ్వొచ్చు. ఫేస్‌బుక్ ఐడీతో ఇందులోకి రిజిస్టర్ కావాల్సి ఉంటుందన్నమాట.


రూ.60 లక్షల నిధుల సమీకరణ..

‘‘సంస్థను ప్రారంభించిన 5 నెలల్లోనే సుమారు 6 వేల మంది మా సేవలను వినియోగించుకున్నారు. రోజుకు 30-40 మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇటీవలే రెంటొమో ఆండ్రాయిడ్ యాప్‌ను కూడా ప్రారంభించాం. ప్రస్తుతం మా సేవలు ఉచితంగానే అందిస్తున్నాం. ఇటీవలే మా సంస్థలో యూకే నుంచి శివ అశోక్, యూఏఈకి చెందిన మరో ఇన్వెస్టర్ ఇద్దరు కలిసి రూ.60 లక్షల పెట్టుబడులు పెట్టారని’’అన్షుల్ వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top