హైదరాబాద్‌లో ‘హిటాచి’ రెండో కేంద్రం

హైదరాబాద్‌లో ‘హిటాచి’ రెండో కేంద్రం - Sakshi


- ప్రారంభించిన మంత్రి కేటీఆర్

- 18 నెలల్లో 400 మంది నియామకం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఐటీ సొల్యూషన్స్ రంగంలో ఉన్న హిటాచీ సొల్యూషన్స్ భారత్‌లో కార్యకలాపాలను విస్తరిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్ ఐటీ పార్క్‌లో గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను (జీడీసీ) ఏర్పాటు చేసింది. దీనితో కలిపి ఈ పార్క్‌లో హిటాచీ జీడీసీల సంఖ్య రెండుకు చేరుకుంది. తొలి సెంటర్‌ను 2013లో ఆరంభించింది.



చెన్నైలో కూడా కంపెనీ ఇటువంటి సెంటర్‌ను నిర్వహిస్తోంది. 200 సీట్ల సామర్థ్యం గల నూతన కేంద్రాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ప్రారంభించారు. జపాన్ కంపెనీలు ఒకదాని వెంట ఒకటి భారత్‌లో అడుగు పెడుతున్నాయి. ఈ కంపెనీలకు సేవలందించడంతోపాటు ప్రభుత్వ స్మార్ట్ గవర్నెన్స్ ప్రాజెక్టులపై ఫోకస్ చేశామని ఈ సందర్భంగా హిటాచీ సొల్యూషన్స్ ఇండియా సీఈవో, ఎండీ అనంత్ సుబ్రమణియన్ మీడియాకు తెలిపారు. భారత్‌లో సంస్థ ఉద్యోగుల సంఖ్య 300 ఉంది. 18 నెలల్లో కొత్తగా 400 మందిని నియమిస్తామని వెల్లడించారు.

 

రాష్ట్రానికి మరిన్ని కంపెనీలు: తెలంగాణలో పెట్టుబడులకు కంపెనీలను ఆహ్వానించేందుకు దక్షిణ కొరియా, జపాన్‌కు అక్టోబరు-నవంబరులో వెళ్లనున్నట్టు కె.తారక రామారావు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, అధికారులు దుబాయ్, సింగపూర్, తైవాన్ తదితర దేశాలకు వెళ్లినట్టు గుర్తు చేశారు. ‘తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం జూన్ 12న ప్రకటించిన తర్వాత 35 కంపెనీలు అనుమతులు పొందాయి. రూ.5,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు ఇవి.



సగటున ఒక్కో కంపెనీకి 12 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చాం. మరో 17 కంపెనీల అనుమతులు సిద్ధమవుతున్నాయి’ అని తెలిపారు. కాగా, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌తో(టాస్క్) హిటాచీ ఒప్పందం చేసుకుంది. తొలి విడతగా 50 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తామని టాస్క్ సీఈవో సుజీవ్ నాయర్ తెలిపారు. కొందరిని తమ సంస్థలోకి, మిగిలిన వారికి ఇతర కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హిటాచీ డెరైక్టర్ అభిరాజ్ లూతర్ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top