హెచ్‌సీఎల్ టెక్.. ప్చ్

హెచ్‌సీఎల్ టెక్.. ప్చ్ - Sakshi


* మార్చి క్వార్టర్ నికర లాభం రూ.1,683 కోట్లు; వృద్ధి 3.6 %

* కరెన్సీ ఒడిదుడుకులతో మార్జిన్లపై ప్రభావం

* సీక్వెన్షియల్‌గా లాభం 12.2% డౌన్   షేరుకి రూ.4 డివిడెండ్...


న్యూఢిల్లీ: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.1,683 కోట్లుగా నమోదైంది.



అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,623 కోట్లతో పోలిస్తే లాభం 3.6 శాతం మాత్రమే వృద్ధి చెందింది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా మార్జిన్లు దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. హెచ్‌సీఎల్ టెక్ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కాగా, క్యూ3లో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 11 శాతం పెరిగి రూ.8,349 కోట్ల నుంచి రూ.9,267 కోట్లకు ఎగబాకింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ3లో కంపెనీ నికర లాభం సగటున రూ.1,797 కోట్లు, ఆదాయం రూ.9,312 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు.

 

ఫలితాల్లో ఇతర ప్రధానాంశాలు...

- రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుపై కంపెనీ రూ.4 డివిడెండ్‌ను ప్రకటించింది.

- మార్చి చివరి నాటికి కంపెనీ వద్ద రూ.838 కోట్ల విలువైన నగదు నిల్వలు ఉన్నాయి.

- క్యూ3లో స్థూలంగా 11,041 మంది ఉద్యోగులను, నికరంగా 3,944 మందిని కంపెనీ జత చేసుకుంది. దీంతో మార్చి చివరినాటికి హెచ్‌సీఎల్ టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,04,184కు చేరింది.

- కంపెనీకి 4 కొత్త కాంట్రాక్టులు దక్కాయి.

 

భారీగా పడిన షేరు...

అంచనాలకంటే తక్కువగా నిరాశాజనకమైన ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర భారీగా పడి ంది. మంగళవారం బీఎస్‌ఈలో ఒకానొకదశలో క్రితం ముగింపు రూ.923తో పోలిస్తే 8.8%(రూ.82) మేర క్షీణించింది. అయితే, ఆ తర్వాత కాస్త కోలుకొని 3.4 శాతం నష్టంతో రూ.891 వద్ద స్థిరపడింది.

 

క్యూ2తో పోలిస్తే లాభంలో భారీ క్షీణత...

త్రైమాసిక ప్రాతిపదికన(సీక్వెన్షియల్‌గా) కంపెనీ నికర లాభం క్యూ3లో 12.2 శాతం పడిపోయింది. డిసెంబర్ క్వార్టర్(క్యూ2)లో లాభం రూ.1,915 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం కూడా క్యూ2లో రూ.9,283 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా 0.2 శాతం తగ్గిపోయింది. వివిధ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం విలువ భారీగా పుంజుకోవడంతో కంపెనీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడింది. క్యూ3లో కంపెనీ రూ.142 కోట్ల ఫారెక్స్ నష్టాలను ప్రకటించింది.



క్యూ2లో ఈ మొత్తం రూ.15 కోట్లు మాత్రమే. ఇది కూడా నికర లాభాలను దెబ్బతీసింది. ఆదాయాలపై కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావం 2.7 శాతం మేర ఉందని కంపెనీ తెలిపింది. ‘అన్ని ప్రాంతాలు, వ్యాపార విభాగాల నుంచి విస్తృత స్థాయిలో వృద్ధిని కొనసాగించాం. బిలియన్ డాలర్లకుపైగా డీల్స్‌ను సాధించగలిగాం. ముఖ్యంగా కన్సూమర్ సేవలు, తయారీ, పబ్లిక్ సర్వీసుల్లో, యూరప్ ప్రాంతం నుంచి అధికంగా డీల్స్ లభించాయి’ అని ఫలితాలపై హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ అనంత్ గుప్తా వ్యాఖ్యానించారు. కొత్త తరం ఐటీ అవుట్‌సోర్సింగ్, డిజిటలైజేషన్‌లలో అద్భుతమైన వృద్ధి అవకాశాలున్నాయన్నారు. విదేశీ విస్తరణ కోసం గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నట్లు కూడా గుప్తా తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top