మోదీ సర్కారు అతిపెద్ద విజయం ‘జీఎస్‌టీ’

మోదీ సర్కారు అతిపెద్ద విజయం ‘జీఎస్‌టీ’ - Sakshi


న్యూఢిల్లీ: జీఎస్టీని మోదీ సర్కారు సాధించిన అతిపెద్ద విజయంగా అసోచామ్‌ అభివర్ణించింది. గత మూడేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన వాటిలో జీఎస్టీ ముందుంటుందని పేర్కొంది. మోదీ సర్కారు మూడేళ్ల పాలనలో ఆర్థిక రంగానికి సంబంధించి చేపట్టిన సంస్కరణలపై అసోచామ్‌ ఓ నివేదికను విడుదల చేసింది. అందరికీ ఆర్థిక సేవలు, డిజిటలైజేషన్, పెట్టుబడులు, విద్యుత్‌ పంపిణీ సహా ఎన్నో మంచి చర్యల్ని కేంద్రం చేపట్టినట్టు అసోచామ్‌ పేర్కొంది. జీఎస్టీని స్వాతంత్య్రానంతరం అతిపెద్ద సంస్కరణగా అభివర్ణించింది.



 పన్నుల విధానాన్ని మరింత సులభంగా మార్చడం ద్వారా, వ్యాపార సులభతర నిర్వహణకు జీఎస్టీ ఉపకరిస్తుందని అభిప్రాయపడింది. రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం నియంత్రిత స్థాయిలో కొనసాగడం ప్రభుత్వం సాధించిన ఇతర సానుకూలతల్లో ఒకటిగా పేర్కొంది. సబ్సిడీల పంపిణీ ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యల్ని కూడా ప్రస్తావించింది. ‘‘విదేశీ మారక నిల్వలు 372 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. దీనివల్ల రూపాయికి బలం చేకూరుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం కట్టడికి వీలవుతుంది’’ అని పేర్కొంది.



ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్య పరిధి 4%లోపే కొనసాగితే వడ్డీ రేట్లను తక్కువ స్థాయిలోనే కొనసాగిస్తుందని అభిప్రాయపడింది. ప్రైవేటు రంగ రుణాలు పుంజుకోకపోవడం, ఎన్‌పీఏలు గరిష్ట స్థాయిలో ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒత్తిడిలో ఉన్న మెటల్స్, కన్‌స్ట్రక్షన్, రియల్టీ, టెలికం, విద్యుదుత్పత్తి వంటి ప్రాధాన్య రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. విద్య, వైద్య రం గాలకు కేటాయింపులు పెంచాలని పేర్కొంది.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top