బీమాపై జీఎస్‌టీ ప్రభావం అంతంతే..

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ టీఎస్‌ విజయన్‌.


పర్సనలైజ్డ్‌ పథకాలపై సంస్థల దృష్టి 

బీమా సదస్సులో ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ టీఎస్‌ విజయన్‌




హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంలో ప్రతిపాదిత శ్లాబ్‌తో బీమా ప్రీమియంలు స్వల్పంగా పెరగొచ్చని, అయితే మొత్తం మీద ఇన్సూరెన్స్‌ రంగంపై మాత్రం ప్రభావం పెద్దగా ఉండబోదని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ టీఎస్‌ విజయన్‌ చెప్పారు. గతంలోలాగానే ప్రస్తుతం కూడా పన్ను రేట్ల పెంపు ప్రభావాలకు బీమా పరిశ్రమ సర్దుకోగలదని ఆయన వివరించారు. మంగళవారమిక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య మండళ్ల సమాఖ్య ఫ్యాప్సీ .. ఇన్సూరెన్స్‌ రంగంలో కొత్త పోకడలపై నిర్వహించిన సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా విజయన్‌ ఈ విషయాలు చెప్పారు. ఇన్సూరెన్స్‌ పాలసీల ప్రీమియంలపై ప్రస్తుతం 15 శాతంగా ఉన్న ట్యాక్స్‌ రేటు జీఎస్‌టీ విధానంలో 18 శాతానికి పెరగనున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇన్సూరెన్స్‌ రంగ వృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వివిధ రీఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా భారత్‌లో శాఖలు ప్రారంభిస్తున్నాయని విజయన్‌ తెలిపారు.



రిస్కు ప్రొఫైల్‌ ఆధారంగా పర్సనలైజ్డ్‌ పథకాలు అందించడంపై బీమా కంపెనీలు దృష్టి పెడుతున్నాయన్నారు. ఇందుకోసం డేటా అనలిటిక్స్‌ మొదలైన టెక్నాలజీ ఉపయోగపడుతోందని తెలిపారు. అలాగే వివిధ రకాల బీమా కవరేజీని ఒకే పాలసీలో అందించేలా కాంబీ ప్రోడక్ట్స్‌పైనా ఇన్సూరెన్స్‌ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయని విజయన్‌ చెప్పారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ తరహా పాలసీలు కొన్ని అందిస్తున్నాయని తెలిపారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల పోర్టబిలిటీని ప్రవేశపెట్టే అంశం ఇంకా చర్చల దశలోనే ఉందన్నారు. అటు దేశవ్యాప్తంగా పాతికవేల పైగా ఆస్పత్రులు, చికిత్స ఖర్చులు మొదలైన వాటితో డేటాబేస్‌ను రూపొందించడం ద్వారా చికిత్స వ్యయాలకు సంబంధించి ప్రామాణిక స్థాయిలను నిర్దేశించే ప్రక్రియ కొనసాగుతోందని విజయన్‌ చెప్పారు. డిజిటల్‌ సాంకేతికత కారణంగా రాబోయే రోజుల్లో పాలసీల రూపకల్పన, విక్రయాలు, క్లెయిమ్‌లు, ప్రీమియంల నిర్ధారణ మొదలైన ప్రక్రియల్లో విప్లవాత్మకమైన మార్పులు రాగలవన్నారు.



పెరగనున్న విలీనాల డీల్స్‌..

దేశీయంగా బీమాపై అవగాహనతో పాటు కవరేజీ కూడా పెరుగుతోందని సెమినార్‌లో పాల్గొన్న న్యూ ఇండియా అష్యూరెన్స్‌ సీఎండీ జి.శ్రీనివాసన్‌ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విలీనాలు, కొనుగోళ్ల డీల్స్‌ పెరగడంతో పాటు బీమా ప్రక్రియలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు. భారత్‌ రీఇన్సూరెన్స్‌ హబ్‌గా ఎదిగేందుకు పుష్కలమైన వనరులు ఉన్నాయన్నారు.  2025 నాటికి జనరల్‌ ఇన్సూరెన్స్‌ విభాగ పరిమాణం రూ. 2.5 లక్షల కోట్లకు చేరగలదని ఐసీఐసీఐ లాంబార్డ్‌ సీఈవో భార్గవ్‌ దాస్‌ గుప్తా చెప్పారు. టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ వంటివి బీమా రంగంలో కీలక పాత్ర పోషించగలవన్నారు. ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌ రవీంద్ర మోదీ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top