బంగారం.. రెండు వారాలు ఆగండి!

బంగారం.. రెండు వారాలు ఆగండి! - Sakshi


కొంత వెనక్కు తగ్గవచ్చంటున్న నిపుణులు

ముంబై/న్యూయార్క్: పసిడికి సంబంధించి వచ్చే రెండు వారాలూ వేచిచూసే ధోరణి అవలంబించడం మంచిదన్నది నిపుణుల సూచన. అమెరికా ఫెడ్ ఫండ్ రేటును  (ప్రస్తుత శ్రేణి 0.25-0.50 శాతం) పెంచే విషయంలో నెలకొన్న సందిగ్ధత... పసిడిపైనా పడుతుందన్నది వారి వాదన. మొత్తంమీద పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,340 డాలర్ల దిగువకు పడిపోవడం వెనకడుగును సూచిస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.



ఇది మద్దతు స్థాయి కావటం వల్ల ఇక్కడి నుంచి పసిడి పెరుగుతుందా? లేక మరింత కిందకు జారుతుందా? అన్నది ఫెడ్ ఫండ్ రేటుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 0.25 శాతం నుంచి ఫెడ్ ఫండ్ రేటు పెరిగితే... క్రమంగా ఔన్స్ బంగారం 1,000 డాలర్ల దిగువకు జారిపోతుందన్న విశ్లేషణలకు భిన్నంగా ఈ ఏడాది ప్రారంభం నుంచీ భారీగా పెరిగి ఒక దశలో 1,370 డాలర్లకు చేరిన సంగతి గమనార్హం.

 

వారంలో పసిడి కదలికలు...

కాగా శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధర భారీగానే పడింది. అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్‌లో పసిడి ధర ఔన్స్‌కు వారం వారీగా చూస్తే 21 డాలర్లు పడి  1,324 డాలర్ల వద్ద ముగిసింది. వెండి కూడా నష్టాలతో 18.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా ప్రధాన బులియన్ మార్కెట్‌లో పసిడి 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు వారం వారీగా రూ.335 తగ్గి రూ.31,385 వద్ద ముగిసింది. 99.5  స్వఛ్చత ధర సైతం అంతే స్థాయిలో తగ్గి రూ.31,235కు దిగింది.

(డాలర్ మారకంలో రూపాయి విలువ 67.06)

 

ఒత్తిడి ఉంటుంది...

సెప్టెంబర్‌లో ఫెడ్ ఫండ్ రేటు నిర్ణయం, ఆర్థిక వ్యవస్థ అందుకు తగిన విధంగా ఉందని ఫెడ్ చైర్మన్ ప్రకటన పసిడి ధరపై ఒత్తిడిని పెంచుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 1,285-1,300 శ్రేణికి పడిపోయే అవకాశాలూ లేకపోలేదు.

- ఫృద్వీరాజ్ కొఠారీ, ఎండీ, రిద్దిసిద్ధి బులియన్స్

 

దేశంలో రూ.30 వేల పైనే...

డాలర్ ఇండెక్స్ పెరగవచ్చు. ఇది పసిడిపై ఒత్తిడిని పెంచే అంశమే. అయితే రానున్న పెళ్లిళ్ల సీజన్ పసిడికి దేశీయంగా కొంత పటిష్టతను చేకూర్చే అంశం. భారత్‌లో పసిడి ట్రేడింగ్ సమీప కాలంలో రూ.30,000-రూ.30,500 శ్రేణిలో ఉండవచ్చు.

- నవీన్ మాథూర్, ఏంజిల్ బ్రోకింగ్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top