తగ్గనున్న పుత్తడి ధరలు?

తగ్గనున్న పుత్తడి ధరలు?


*పసిడి దిగుమతులపై పరిమితులు ఎత్తివేత


*80:20 స్కీము ఉపసంహరణ

 

ముంబై: పసిడి దిగుమతులపై పరిమితులకు సంబంధించి వివాదాస్పద 80:20 స్కీమును ఎత్తివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఒకవైపు ప్రభుత్వం, ఆర్‌బీఐ మరిన్ని ఆంక్షలు విధించవచ్చని అంతా భావిస్తున్న తరుణంలో అందుకు విరుద్ధంగా పరిమితులను ఎత్తివేయడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపర్చింది.



తాజా పరిణామంతో పసిడి ధరలు తగ్గొచ్చని ఆలిండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ ఫెడరేషన్ చైర్మన్ హరేష్ సోని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో పాటు దిగుమతి సంస్థలు పసిడి దిగుమతులపై వసూలు చేసే ప్రీమియం కూడా తగ్గనుండటం ఇందుకు దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. అసలు ఈ పథకం ఎంత మాత్రం ఆచరణసాధ్యమైనది కాదని, గుత్తాధిపత్య ధోరణులను ప్రోత్సహించేలా ఉందని సోని వ్యాఖ్యానించారు. మార్కెట్ వర్గాలను స్థిమితపర్చేందుకు స్కీము ఉపసంహరణ నిర్ణయం ఉపయోగపడగలదని, అలాగే దీని వల్ల దిగుమతులు కూడా తగ్గొచ్చని అధికార వర్గాలు తెలిపాయి.



దిగుమతుల భారంతో కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) భారీగా ఎగుస్తుండటంతో ప్రభుత్వం గతేడాది ఆగస్టులో 80:20 స్కీమును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం దిగుమతిదారులు తాము దిగుమతి చేసుకున్న పసిడి పరిమాణంలో 20 శాతాన్ని కచ్చితంగా ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అప్పుడే కొత్తగా మరిన్ని దిగుమతులకు అనుమతి లభిస్తుంది. దీంతో పాటు దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచడంతో పాటు అటు ఆర్‌బీఐ సైతం కొన్ని ఆంక్షలు విధించింది.



దిగిన బంగారం ధర...

ఆంక్షల ఎత్తివేత వార్తతో శుక్రవారం రాత్రి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టు రూ. 26,000లోపునకు తగ్గింది. కడపటి సమాచారం అందేసరికి రూ. 312 క్షీణతతో రూ. 25,935 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం ఔన్సు బంగారం ధర 17 డాలర్ల తగ్గుదలతో 1,180 డాలర్ల వద్ద కోట్ అవుతోంది. ప్రపంచంలో పసిడిని అధికంగా దిగుమతి చేసుకునే దేశం భారత్‌కావడంతో ఇక్కడ పరిమితుల ఎత్తివేత ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో పడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top