బంగారం ఇప్పటికే కొనేశారు..!

బంగారం ఇప్పటికే కొనేశారు..! - Sakshi


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా ఏదైనా వస్తువు ధర తగ్గితే ఎవరైనా కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. బంగారం విషయంలో ఇది మరీ ఎక్కువ. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ధర తగ్గినా కస్టమర్లు దూరంగానే ఉంటున్నారు. భారత్‌లో కొన్ని నెలల క్రితం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.35 వేల దాకా వెళ్లి ప్రస్తుతం రూ.29 వేలకు అటూ ఇటుగా ఉంది. అయినప్పటికీ కస్టమర్లను మెప్పించడం లేదు. దీనికి కారణం ఇప్పటికే అవసరానికి మించి బంగారం కొనడమే. గతేడాది జూన్‌లో బంగారం ధర రూ.25 వేలకు చేరినప్పుడు వినియోగదారులు ఇబ్బడిముబ్బడిగా పుత్తడిని దక్కించుకున్నారు. అదీ గంటల తరబడి క్యూలో నిలుచుని. ఇప్పుడు అందుకు భిన్నంగా బంగారం షాపులు వెలవెలబోతున్నాయి.



 బ్యాంకుల వల్లే ప్రీమియం..: అంతర్జాతీయ మార్కెట్లో  బంగారం ధర ఔన్సుకు(31.1 గ్రాములు) 1,300 డాలర్ల వద్ద కదలాడుతోంది.  10 గ్రాములకు సుమారుగా రూ.24,980 అన్నమాట. 10% కస్టమ్స్ పన్ను, 1% వ్యాట్ మొత్తం రూ.2,841 కలుపుకుంటే భారత్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.27,727 ఉండాలి. కానీ ప్రీమియం ధరకు ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.28,500 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో 999 స్వచ్ఛత బంగారం 10 గ్రాములు రూ.29,830 పలుకుతోంది. బ్యాంకులు అధిక ధరకు విక్రయించడం వల్లే ఈ ప్రీమియం వుంటున్నదనేది బులియన్ వర్తకుల వాదన.



గతేడాది ఔన్సుకు 3 డాలర్లున్న ప్రీమియం, పన్నులతో కలిపి నేడు 70 డాలర్లకుపైగా ఎగబాకిందని బులియన్ విశ్లేషకులు, రిద్ధిసిద్ధి బులియన్స్(ఆర్‌ఎస్‌బీఎల్) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి జి.శేఖర్ తెలిపారు. పసిడి దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తే ప్రీమియం తగ్గుతుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు, భారత్‌కు మధ్య ధరలో వ్యత్యాసం ఉన్నందునే స్మగ్లింగ్ అధికమైందని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్ తెలిపారు. బ్యాంకులు ప్రీమియం భారీగా వసూలు చేస్తున్నాయన్నారు. సెంటిమెంటు బాగోలేదు కాబట్టే ప్రస్తుతం అమ్మకాలు లేవని చెప్పారు. బంగారం దిగుమతుల్లో 20% ఎగుమతి చేయాలన్న నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.



 20% లోపే..: 2013 ఏప్రిల్-జూన్‌తో పోలిస్తే ప్రస్తుత కాలంలో  పసిడి అమ్మకాలు 20% లోపే ఉంటాయని వర్తకులు చెబుతున్నారు. ఇప్పటికే బంగారం కొనుగోలు చేయడం ఒక కారణమైతే, ప్రస్తుతం కస్టమర్ల చేతిలో నగదు లేకపోవడమూ మరో కారణంగా తెలుస్తోంది. అటు ఆభరణాలకు, ఇటు పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ తగ్గింది. గతేడాది ఏప్రిల్ లో డాలరుతో రూపాయి మారకం విలువ రూ.54 ఉంటే, నేడు రూ.60కి చేరడమూ ధర ఎక్కువ కావడానికి కారణమైంది.



 ఇక దిగుమతులు కట్టడి చేసినప్పటికీ ఆభరణాల వర్తకులకు రీసైకిల్డ్ బంగారం మార్కెట్లో లభిస్తోంది.  పసిడిపై రుణాలిచ్చే సంస్థల వద్ద ఆభరణాల నిల్వలు పేరుకుపోతున్నాయి. రుణగ్రస్తులు తిరిగి నగదు చెల్లించకపోవడంతో తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నాయి. ఇలా మార్కెట్లోకి బంగారం వస్తోంది. దీనికితోడు స్మగ్లింగ్ జోరందుకుందని ఓ వ్యాపారి వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో 2011లో ఔన్సు బంగారం ధర 1,910 డాలర్ల దాకా వెళ్లి సంచలనం సృష్టిస్తే, 2013 జూన్ చివరివారంలో 1,180 డాలర్లకు పడింది.

 

 మార్కెట్ తీరునుబట్టి చూస్తే అంతర్జాతీయంగా బంగారం ధర ఈ వారం ఔన్సుకు 1,293-1,350 డాలర్ల మధ్య ఉండొచ్చని ఆర్‌ఎస్‌బీఎల్ అంచనా వేస్తోంది. భారత్‌లో 10 గ్రాములకు రూ.29-31 వేలు పలుకుతుందని ఆర్‌ఎస్‌బీఎల్ ఎండీ పృథ్వీరాజ్ కొఠారి తెలిపారు. అక్షయ తృతీయ సమీపిస్తోందని, దీంతో గిరాకీ పెరిగి బంగారం దిగుమతులు జోరందుకుంటాయని చెప్పారు. రూపాయి బలపడడం కూడా ధర తగ్గేందుకు కారణమైందని చెప్పారు. దేశంలో బంగారం అన్వేషణకై పరిశోధన, అభివృద్ధికి కొత్త ప్రభుత్వం చొరవ చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బంగారం దిగుమతి నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలి. ఇది కార్యరూపం దాల్చితే ఆసియాలో డిమాండ్‌కు భారత్ నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో బంగారం ఆస్తిగా పనికొస్తుందన్న సత్యం జగమెరిగింది. ధరలు తగ్గిన నేపథ్యంలో పసిడికి డిమాండ్ ఊపందుకుంటుంది’ అని చెప్పారు.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top