దేశీ ఎలక్ట్రానిక్స్‌కే ప్రాధాన్యమివ్వండి...

దేశీ ఎలక్ట్రానిక్స్‌కే ప్రాధాన్యమివ్వండి...


ప్రధాని కార్యాలయం సూచన



న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని శాఖలు, విభాగాలు దేశీయంగా తయారైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని కార్యాలయం (పీఎంవో) సూచించింది. ఇందుకు అనుగుణంగా తాము కొనుగోలుచేయదల్చుకున్న ఉత్పత్తుల జాబితాను పక్షం రోజుల్లోగా నోటిఫై చేయాలని కార్యదర్శుల కమిటీ నిర్ణయించినట్లు పేర్కొంది.  



దీని కోసం ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డైటీ) జారీ చేసిన టెండర్ నమూనాను ఉపయోగించాలని సూచించింది. అలాగే ఆయా శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయదల్చుకున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వివరాలను సమీక్షించేందుకు ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థను రూపొందించాలని డైటీకి తెలిపింది. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటా సుమారు 16-17 శాతంగా ఉంది. దీన్ని 2022 నాటికి 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.



మరోవైపు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ రంగాలు అనుసరించతగిన వ్యూహాల గురించి ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ దిగ్గజాలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి వివరించనున్నారు. రోజు పొడవునా సాగే వర్క్‌షాప్‌కు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు. అలాగే చమురు..గ్యాస్, ఆటోమొబైల్, ఏవియేషన్ రంగ సంస్థల దిగ్గజాలు, ప్రభుత్వ రంగ సంస్థల చీఫ్‌లు, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు నుంచి ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top