జన్యు ఫార్మసీకి ఉజ్వల భవిష్యత్

జన్యు ఫార్మసీకి ఉజ్వల భవిష్యత్ - Sakshi


 ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మీ జన్మ రహస్యాన్ని గురించి తెలుసుకోవాలనుకొంటున్నారా? భవిష్యత్తులో మీకొచ్చే రోగాల గురించి ముందస్తు సమాచారం కావాలా? మీ గోత్రం..మరిచి పోయారా?ఇప్పుడు ఇలాంటి వివరాలన్నీ క్షణాల్లో సిద్ధం చేస్తోంది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ మ్యాప్ మై జినోమ్.



 కొత్త ఔషధాల గుర్తింపు(డ్రగ్ డిస్కవరీ), బయో ఇన్ఫర్మాటిక్స్ రంగాలలో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ఓసిమమ్ బయో సొల్యూషన్స్ అధినేత అనూ ఆచార్య కన్జూమర్  మ్యాప్ మై జినోమ్ స్టార్టప్ సంస్థ స్థాపించి ఇప్పటికే వేలాదిమంది వ్యక్తుల జన్యు రహస్యాలను శాస్త్రీయంగా పరీక్షించి భవిష్యత్తులో అనూహ్య రోగాల బారిన పడకుండా ముందస్తు హెచ్చరికలు చేయగలిగారు.



 ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి ఇంజనీరింగ్ పట్టభద్రురాలైన అనూ ఆచార్య వరల్ట్ ఎకనామిక్ ఫోరమ్ నుండి 2011లో యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డును అందుకొన్నారు. జినోమ్ మ్యాపింగ్ ద్వారా మధుమేహం, హృద్రోగం, లివర్, కిడ్నీ, మోకాళ్ల నొప్పులు, బట్టతల, క్యాన్సర్ లాంటి జబ్బుల నుండి తప్పించుకునే అవకాశం ఉందంటున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో జన్యు ఆధారిత ఫార్మసీ విజయవంతమైందని, భారతదేశంలో ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందంటున్న అనూ ఆచార్యతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలివీ..

 

మ్యాప్‌మైజినోమ్ లక్ష్యం?

 ఓసిమమ్ బయో ద్వారా పారిశ్రామిక అవసరాలకు డ్రగ్ డిస్కవరీ, బయో ఇన్ఫర్మాటిక్స్ లాంటి సేవలను గత పద్నాలుగేళ్లుగా అందిస్తున్నాం. దీనికోసం అమెరికాలో జీన్‌లాజిక్ అనే ఓ సంస్థను రూ. 600 కోట్లతో కొనుగోలు చేశాం. అయితే జన్యుసంబంధమైన అధ్యయనాలు కన్జూమర్స్ బయోటెక్నాలజీ రంగంలో అవకాశాలను గుర్తించి, దీనికోసం ప్రత్యేక స్టార్టప్ కంపెనీ అవసరమని భావించి మ్యాప్‌మైజినోమ్‌ను ఏర్పాటు చేశాం. రెండేళ్లు ఇన్‌క్యుబేట్ చేసిన తర్వాత 2012లో అవసరమైన  సీడ్ క్యాపిటల్ బంధువులు, మిత్రుల నుండి సేకరించాం. త్వరలో వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ ద్వారా రూ. 30 కోట్లు (5 మిలియన్ డాలర్లు) సమీకరిస్తున్నాం. చర్చలు సాగుతున్నాయి.

 

జినోమ్ పత్రి అంటే?

 ఒక రకంగా ఇది హెల్త్ హారోస్కోప్ లాంటిది.  జినోమ్ పత్రి ద్వారా శాస్త్రీయమైన వ్యక్తిగత ఆరోగ్య వివరాలు వెల్లడవుతాయి. . జన్యువుల ద్వారా పరీక్షించబడ్డ వ్యక్తి ఎలాంటి రోగాల బారిన పడే అవకాశముందో గుర్తించవచ్చు. లైఫ్ స్టైల్, డైట్ ద్వారా ఎలాంటి జబ్బుల బారినపడే అవకాశముందో స్టాటిస్టికల్ టూల్స్ ద్వారా గుర్తించే అవకాశముంది. జినోమ్ పత్రిలో ఆయా వ్యక్తులకు సంబంధించిన  దాదాపు 100 లక్షణాలను క్రోడీకరించటం జరుగుతుంది. అంతేకాదు. ఏయే డ్రగ్స్‌కు మీరు రియాక్ట్ అవుతారో కూడా గుర్తించవచ్చు. మీరు 50 ఏళ్లకు పైబడ్డవారై, డయాబెటిస్ వ్యాధితో బాధ పడుతుంటే మీరు వాడుతున్న మందులు పనిచేస్తాయో లేదో కూడా గుర్తించవచ్చు. దీని ద్వారా అవసరమైన మందులనే తీసుకునే వీలు పడుతుంది.



 మ్యాప్‌మై జినోమ్ స్టార్టప్ ఏ దశలో ఉంది?

 ఇప్పుడు మేం మార్కెట్‌కు  తగ్గ ఉత్పత్తిని ( ప్రోడక్ట్-మార్కెట్ ఫిట్) అందించటంలో విజయం సాధిం చాం. దేశ వ్యాప్తంగా 38 కార్పొరేట్ హాస్పిటల్స్, డయాగ్నస్టిక్స్ కేంద్రాలతో ఒప్పందాలు చేసుకున్నాం. రోజూ 38 వేల మందికి డయాగ్నస్టిక్ సేవలందించే డాక్టర్ లాల్ నెట్‌వర్క్ ద్వారా ఉత్తర భారత దేశంలో విస్తరిస్తున్నాం. అలాగే వెల్‌నెస్ సెంటర్లతోనూ అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నాం.



 మీరిచ్చే రిపోర్టుల్లో ఖచ్చితత్వం ఏ మేరకు ఉంటుంది?

 మేమిచ్చే జన్యు నివేదికలు 99.9 శాతం ఖచ్చితమైనవి. ఈ రంగంలో అత్యుత్తమమైన ఇల్యూమినా మెషీన్లను మేం వాడుతున్నాం. రిపోర్టు నాణ్యతలో రాజీ లేదు. ఇది ప్రిడిక్టివ్ టెస్ట్ మాత్రమే అని గమనించాలి. దీని వల్ల భవిష్యత్తులో మీరు ఏయే రోగాల బారిన పడే అవకాశం ఉందో ముందస్తుగా సూచించే పరీక్షలు మాత్రమే ఇవి. తగిన జాగ్రత్తలు తీసుకొని, లైఫ్ స్టైల్‌ను మార్చుకొనేందుకే ఈ పరీక్షలు చేయించుకుంటారు. మా వెబ్‌సైట్ మ్యాప్‌మైజినోమ్.ఇన్ ద్వారాగానీ, మేము ఒప్పందం కుదుర్చుకున్న లాల్‌పాథ్‌లాబ్స్ ద్వారా ఈ పరీక్షలకు సంప్రదించవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top