పన్ను సమాచార మార్పిడికి జీ20 ఓకే

పన్ను సమాచార మార్పిడికి జీ20 ఓకే


కెయిర్న్స్: విదేశీ పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట దిశగా జీ20 దేశాల కూటమి మరో కీలక ముందడుగు వేసింది. ఆటోమేటిగ్గా ఆయా దేశాల మధ్య పన్నుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను అమలు చేసేందుకు కట్టుబడాలని నిర్ణయించాయి. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్‌ల రెండు రోజుల సమావేశం ముగింపు అనంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో విషయాన్ని వెల్లడించారు.



 పన్నుల సమాచారాన్ని జీ20, అదేవిధంగా ఇతర దేశాలు అటోమేటిక్ రూట్‌లో పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం కోసం ప్రపంచస్థాయి యంత్రాంగాన్ని 2017కల్లా లేదంటే 2018 చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని సమావేశం తీర్మానించినట్లు ప్రకటన పేర్కొంది. విదేశాల్లో నల్లధనాన్ని వెనక్కిరప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత్‌కు ఈ ఆటోమేటిక్ యంత్రాంగం చాలా ఉపయోగపడనుంది. పన్ను ఎగవేత ఆరోపణలు లేదా నిర్ధిష్టంగా ఏదైనా దేశం కోరితేనే ప్రస్తుతం పన్నుల సమాచారాన్ని ఇతర దేశాలు అందిస్తున్నాయి. దీని స్థానంలో ఆటోమేటిక్ సమాచార మార్పిడి వ్యవస్థను పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) రూపొందించింది.



 ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్ చాన్నాళ్లుగా ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భారత్ తరఫున వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్‌లు జీ20 సదస్సుకు హాజరయ్యారు. కంపెనీలు ఎక్కడైతే  లాభాలు గడిస్తున్నాయో... అక్కడే పన్నులు చెల్లించాలన్న వాదనపైనా సమావేశం దృష్టిపెట్టింది. లాభాల తరలింపునకు అడ్డుకట్టవేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళికలను 2015కల్లా ఖరారు చేయనున్నారు.



 ప్రపంచ జీడీపీకి మరో 2 ట్రిలియన్ డాలర్లు జత

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా మరిన్ని చర్యలను చేపట్టాలని జీ20 సమావేశం పిలుపునిచ్చింది. 2018కల్లా ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మరో 2 శాతం అదనపు వృద్ధిని జతచేసేందుకు కృషిచేయనున్నట్లు పేర్కొంది. అంటే జీడీపీని 2 ట్రిలియన్ డాలర్లు(దాదాపు రూ.120 లక్షల కోట్లు) మేర పెంచాలనేది లక్ష్యం.



నవంబర్‌లో బ్రిస్బేన్‌లో జరగనున్న జీ20 సదస్సు నా టికి వృద్ధి పెంపునకు తగిన చర్యలు, ప్రణాళికలను రూపొందించనున్నట్లు జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలకు చెందిన మొత్తం 20 దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 85% వాటా వీటిదే. ప్రపంచ జీడీపీకి 1.8 శాతం అదనపు వృద్ధిని జోడించడం సాధ్యమేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)-ఓఈసీడీ అంచనాలు చెబుతున్నాయని.. మరో 0.2% పెంచడానికి కట్టుబడాలని జీ20 దేశాలు నిర్ణయించినట్లు వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.



ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 3.4%గా ఉండొచ్చు. వచ్చే ఏడాది 4%కి మెరుగుపడుతుందని అంచనా. కాగా, ఐఎంఎఫ్‌లో కోటా, పాలన సంస్కరణలు కూడా జీ20 దేశాలకు ప్రాధాన్య అంశమని సమావేశ ప్రకటన పేర్కొంది. వీటి ఆమోదం కోసం అమెరికాను ఒప్పించే చర్యలు కొనసాగుతాయని వెల్లడించింది. కోటా సంస్కరణలు అమలైతే భారత్‌కు ఐఎంఎఫ్‌లో ఓటింగ్ హక్కుల వాటా ఇప్పుడున్న 2.44% నుంచి 2.75 శాతానికి పెరుగుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top