ఫండ్ డివిడెండులో పన్ను కోత ఉంటుందా?

ఫండ్ డివిడెండులో పన్ను కోత ఉంటుందా?


నేను సుందరం గ్లోబల్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇటీవలే ఈ ఫండ్ ఒక్కో యూనిట్‌కు రూ.1 డివిడెండ్‌ను ప్రకటించింది. ఆ ప్రకారం నాకు రూ.1,042 డివిడెండ్ లభించాలి. కానీ నాకు రూ.756.45 డివిడెండ్ మాత్రమే వచ్చింది. ఈ విషయమై సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థను సంప్రదించాను. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) పోగా మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లించామని ఆ సంస్థ వెల్లడించింది. నేను చాలా సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాను. ఎలాంటి మినహాయింపులు లేకుండా పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు నాకు డివిడెండ్‌లు చెల్లించేవి. డీడీటీ కోత నాకు ఇదే మొదటిసారి. ఇప్పుడు నేను ఏం చేయాలి?

 - సాదిక్ ఆలీ, నిజామాబాద్

 

సుందరం గ్లోబల్ అడ్వాంటేజ్ ఫండ్ సంస్థ చేసినది సరైనదే. ఈక్విటీ యేతర మ్యూచువల్ ఫండ్లు డివిడెండ్‌లు చెల్లిస్తే, వీటిపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) తప్పనిసరి. అయితే ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ డివిడెండ్‌లపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మీరు ఇన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకూ మీకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) పడలేదంటే మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ ఉండి ఉండాలి.  మొదటిసారిగా ఈక్విటీయేతర ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుంటారు. దీంతో డీడీటీ మీకు కొత్తగా అనిపిస్తుంది.  ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్ డీడీటీ మదింపు గత ఏడాది బడ్జెట్ నుంచి మారింది. గతంలో ఏదైనా సంస్థ రూ.100 డివిడెండ్‌ను ప్రకటిస్తే, రూ.128.3  డివిడెండ్ చెల్లింపుల కోసం కేటాయించేది. రూ.100 ఇన్వెస్టర్‌కు, రూ.28.3 పన్నులుగా చెల్లించేది. ఇలా కాకుండా స్థూల డివిడెండ్ మొత్తంపై డీడీటీని చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది.  దీని ప్రకారం ఏదైనా డివిడెండ్ సంస్థ రూ.100 డివిడెండ్‌ను ప్రకటిస్తే, దానిపై 28.33 శాతం డీడీటీని ప్రభుత్వానికి, మిగిలిన దానిని ఇన్వెస్టర్‌కు మ్యూచువల్ ఫండ్ సంస్థలు చెల్లిస్తున్నాయి.

 

నా వయస్సు 38 సంవత్సరాలు. వారం క్రితం ఈక్విటీ ఫండ్స్ నుంచి పెద్ద మొత్తమే రిడీమ్ చేశాను. మరో మూడు నెలల తర్వాత కానీ వీటి అవసరం నాకు ఉండదు. అప్పటి వరకూ ఈ పెద్ద మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయమంటారా? లేక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏమైనా పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? అలా అయిన పక్షంలో కొన్ని ఉత్తమమైన డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి. నేను 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నాను.        - పవన్, సికింద్రాబాద్

 

కార్పొరేట్ బాండ్లు, గిల్ట్‌ల్లో స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేసే  షార్ట్ టెర్మ్ డెట్ ఫండ్స్‌ను ఎంచుకోండి. పన్ను ప్రయోజనాల విషయానికొస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, డెట్ ఫండ్స్‌కు తేడా ఏమీ లేదు. వీటిపై వచ్చే రాబడులను మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ శ్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. పన్ను విషయాల్లో కాకుండా కొన్ని  విషయాల్లో డెట్ ఫండ్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకంటే మెరుగైనవి. డెట్ ఫండ్స్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపసంహరించుకోవచ్చు. ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయానికొస్తే, వాటిని మధ్యలో ఉపసంహరించుకుంటే కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని డెట్ ఫండ్స్ 7.5 శాతం నుంచి 10 శాతం రేంజ్‌లో రాబడులు ఇస్తాయి. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి పరిశీలించదగ్గ కొన్ని  షార్ట్ టెర్మ్ డెట్ ఫండ్స్- పీర్‌లెస్ షార్ట్‌టెర్మ్, సుందరం సెలెక్ట్ షార్ట్‌టెర్మ్ డెట్ అసెట్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్ట్రా షార్ట్ టెర్మ్ బాండ్ ఫండ్, టారస్ ఆల్ట్రా షార్ట్ టెర్మ్ బాండ్ ఫండ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్ ఇన్‌కమ్ ఫండ్‌లు.

 

నేను ఇటీవలనే ఎస్‌బీఐ ఎఫ్‌ఎంసీజీ ఫండ్‌లో రూ.లక్ష వరకూ ఇన్వెస్ట్ చేశాను. ఇది మంచి నిర్ణయమేనా?                   -మేఘమాల, విజయవాడ



ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, ఇతర రంగాలు ఏమంత మంచి పనితీరు కనబరచకపోయినప్పటికీ, ఎఫ్‌ఎంసీజీ రంగం మాత్రం  మంచి వృద్ధినే సాధించింది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో ఎంత మంచి రాబడి ఇస్తున్న మ్యూచువల్ ఫండ్‌లోనైనా ఇన్వెస్ట్ చేయడం మంచిది  కాదు. మరీ ముఖ్యంగా ఏదైనా ప్రత్యేక రంగానికి చెందిన ఫండ్ అయితే అది అసలు మంచి నిర్ణయమే కాదు. అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేది వివిధీకరణ ప్రయోజనాలు పొందడానికే.  అందుకని మీ పెట్టుబడులను కనీసం మూడు విభిన్నమైన మ్యూచువల్ ఫండ్స్‌కు విస్తరించండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానాన్ని(సిప్) అనుసరిస్తే మంచి ప్రయోజనాలు పొందగలరు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top