మెట్రోల్లో ఇక ఏటీఎం చార్జీల మోత

మెట్రోల్లో ఇక ఏటీఎం చార్జీల మోత - Sakshi


* ఉచిత లావాదేవీలపై పరిమితులు నేటి నుంచే అమల్లోకి

* సొంత బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 5 లావాదేవీలే

* అంతకు మించితే రూ. 20

* హైదరాబాద్ సహా ఆరు మెట్రోల్లో అమలు


న్యూఢిల్లీ: ఏటీఎంలలో ఉచిత లావాదేవీల సంఖ్యపై పరిమితులు నేటి నుంచే (నవంబర్ 1) అమల్లోకి రానున్నాయి. దీంతో ఆరు మెట్రో నగరాలకు సంబంధించి సొంత బ్యాంకుల ఏటీఎంలలో సైతం సరే నెలకు అయిదు లావాదేవీలు మాత్రమే ఉచితంగా ఉంటాయి. నగదు విత్‌డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ మొదలైనవన్నీ కూడా ఈ పరిమితికి లోబడే ఉంటాయి. అయిదుకు మించితే ప్రతీ దానికి రూ.20 చార్జీలు వర్తిస్తాయి. మరోవైపు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితి కూడా మెట్రోల్లో ఇప్పుడున్న అయిదు నుంచి మూడు లావాదేవీలకు తగ్గుతుంది. అయితే, వీటి విషయంలో ఆర్‌బీఐ కొంత వెసులుబాటునిచ్చింది. మెట్రో నగరాల్లో మూడు లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల ఏటీఎంలలో రెండు నిర్వహించుకునే వీలు కల్పించింది. తాజా మార్పులు సేవింగ్స్ అకౌంటు, కరెంటు అకౌంట్లు అన్నింటికీ వర్తిస్తాయి. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో ఈ పరిమితులు అమలవుతాయి.

 

ఆర్‌బీఐ అనుమతి ఫలితం...: ఏటీఎంలు, బ్యాంకుల శాఖలు పెరగడంతో పాటు బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఉచిత లావాదేవీల పరిమితిని కుదించవచ్చని ఈ ఏడాది ఆగస్టులో ఆర్‌బీఐ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఎన్ని ఉచిత లావాదేవీలు అనుమతించాలన్నది ఆయా బ్యాంకులు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని వివరణ ఇచ్చింది.



ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణ భారంగా మారుతోందని, పెపైచ్చు ఉచిత లావాదేవీల వల్ల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్నాయని బ్యాంకుల సమాఖ్య ఐబీఏ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆర్‌బీఐ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఆరు మెట్రో నగరాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఉచిత లావాదేవీలు యథాప్రకారంగానే ఉంటాయి. నో ఫ్రిల్స్ అకౌంట్ల ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇప్పట్లాగానే అయిదు ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 1.6 లక్షల ఏటీఎంలు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top