ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌ ’డీల్‌’ కు ప్రేమ్‌జీ బ్రేక్‌!

ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌ ’డీల్‌’ కు ప్రేమ్‌జీ బ్రేక్‌! - Sakshi


చిన్న ఇన్వెస్టర్లకు చెల్లింపులపై

ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ అభ్యంతరాలు

డీల్‌ స్వరూపంపై స్పష్టత

ఇవ్వాలంటూ స్నాప్‌డీల్‌ బోర్డుకు లేఖ




ముంబై: దేశీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ విలీనానికి అవరోధాలు కొనసాగుతున్నాయి. స్నాప్‌డీల్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు తలో రకంగా పరిహారం లభించేలా ఉన్న డీల్‌ స్వరూపంపై తాజాగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సంస్థ అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో మొత్తం విలీన ఒప్పందానికే విఘాతం కలగడమో లేదా స్నాప్‌డీల్‌ వేల్యుయేషన్‌ను మరింతగా తగ్గించడమో జరిగే పరిస్థితి నెలకొంది.



విలీన ప్రతిపాదన ప్రకారం స్నాప్‌డీల్‌లో పెట్టుబడులు పెట్టిన ప్రారంభ దశ ఇన్వెస్టర్లు కలారి క్యాపిటల్, నెక్సస్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌కి ప్రత్యేకంగా 60 మిలియన్‌ డాలర్లు లభించనున్నాయి. అలాగే స్నాప్‌డీల్‌ వ్యవస్థాపకులు కునాల్‌ బెహల్, రోహిత్‌ బన్సల్‌కి 30 మిలియన్‌ డాలర్లు దక్కనున్నాయి. ఉద్యోగులకు 30 మిలియన్‌ డాలర్ల మేర ప్రత్యేక చెల్లింపుల రూపంలో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ నెలాఖర్లోగా లేదా జూలై ప్రారంభంలో మదింపు ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. డీల్‌ సాకారమైతే దేశీ ఈ–కామర్స్‌ రంగంలో ఇదే అత్యంత భారీ ఒప్పందం కాగలదు.



అయితే, స్నాప్‌డీల్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేసిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌(ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ సంస్థ).. ఉద్యోగుల ప్యాకేజీకి ఓకే చెప్పినప్పటికీ.. ప్రారంభదశ ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులకు ఇవ్వనున్న ప్రత్యేక ప్యాకేజీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్నాప్‌డీల్‌ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. షేర్‌హోల్డర్లందరికీ సమాన ప్రయోజనాలు కల్పించాలని, డీల్‌ నిబంధనలపై మరింత స్పష్టతనివ్వాలని ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో స్నాప్‌డీల్‌కు అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూసీ రంగంలోకి దిగింది. డీల్‌ సాకారమయ్యేలా.. మైనారిటీ ఇన్వెస్టర్లలో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నిస్తోంది.



వేల్యుయేషన్‌కు మరింతగా కోత పడే అవకాశాలు..

పోటీ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా కార్యకలాపాలు విస్తరించేందుకు నిధులు సమీకరించుకోలేక స్నాప్‌డీల్‌ కొన్నాళ్లుగా గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ఒకప్పుడు 6.5 బిలియన్‌ డాలర్ల మేర పలికిన స్నాప్‌డీల్‌ వేల్యుయేషన్‌ ప్రస్తుతం బిలియన్‌ డాలర్ల స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో అందులో పెట్టుబడులున్న సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌.. దాన్ని ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. స్నాప్‌డీల్‌ ఇన్వెస్టర్లంతా ఒప్పుకుంటేనే ఒప్పందంపై ముందుకెడతామంటూ ఫ్లిప్‌కార్ట్‌ షరతు విధించడంతో .. ఒప్పందంపై సాఫ్ట్‌బ్యాంక్‌ ఇతర ఇన్వెస్టర్ల మద్దతు కూడా కూడగట్టింది. తాజాగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ అభ్యంతరాలతో సమస్య మరింత జటిలంగా మారనుంది. దీంతో స్నాప్‌డీల్‌ వేల్యుయేషన్‌ మరింత తగ్గొచ్చనేది పరిశ్రమ వర్గాల అంచనా. స్నాప్‌డీల్‌లో రతన్‌ టాటా, ఇంటెల్‌ క్యాపిటల్, బెస్సీమర్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్, బ్లాక్‌రాక్, టెమాసెక్‌లకు వాటాలున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top