ఇరకాటంలో పడ్డ ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ డీల్

ఇరకాటంలో పడ్డ ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ డీల్ - Sakshi

ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ విలీనానికి అజిమ్ ప్రేమ్ జీ మెలక పెట్టారు. ఈ డీల్ తుదిఆమోదం పొందితే, మైనార్టీ షేర్ హోల్డర్స్ హక్కులను ఎలా రక్షిస్తారని ప్రేమ్ జీ పెట్టుబడుల సంస్థ ప్రశ్నించింది. ఫ్లిప్ కార్ట్ కొనాలనుకుంటున్న స్నాప్డీల్ లో విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీకి మైనార్టీ స్టేక్ ఉంది. ఈ విషయంపై మరోసారి స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రేమ్జీ పెట్టుబడుల సంస్థ అడుగుతోంది. దీంతో ఈ డీల్ మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలుగా ఈ పెట్టుబడుల సంస్థ దీనిపై తమకు క్లారిటీ కావాలని అడుగుతూనే ఉంది. ఇతర మైనార్టీ ఇన్వెస్టర్ల ఆందోళనలను కూడా ఈ సంస్థ కంపెనీ బోర్డు సభ్యుల ముందు ఉంచుతోంది. 

 

అంతేకాక ఈ విలీన డీల్ లో స్నాప్ డీల్ ఇద్దరి సహవ్యవస్థాపకులకు, మరో ఇద్దరికి స్పెషల్ చెల్లింపులు చేయాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. కానీ దీనికి ప్రేమ్జీ ఇన్వెస్ట్ అడ్డుచెబుతోంది. బుధవారం స్నాప్ డీల్ బోర్డుకు రాసిన లేఖలో ఎంపికచేసిన స్నాప్ డీల్ షేర్ హోల్డర్స్, వ్యవస్థాపకులు చెల్లించే 90మిలియన్ డాలర్లు తమకు ఆమోదయోగ్యంగా లేవని,  ఉద్యోగులకు చెల్లిదామనుకున్న 30 మిలియన్ డాలర్ల స్పెషల్ పేమెంట్ల ప్రతిపాదన తమకు సమ్మతమేనని ప్రేమ్జీ ఇన్వెస్ట్ పేర్కొంది. ఈ తారతమ్యంతో కూడిన పేమెంట్లు, కేవలం పెద్ద స్నాప్ డీల్ ఇన్వెస్టర్లకు, వ్యవస్థాపకులకు మాత్రమే మేలు చేకూరుతుందని ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. 

 

ప్రస్తుతం ఈ సంస్థను తక్కువ విలువ కట్టి, ఫ్లిప్ కార్ట్ కు అమ్మబోతున్నారు. ఒకప్పుడు 40వేల కోట్లతో స్నాప్ డీల్ ను కొనడానికి ముందుకొచ్చిన సంస్థలు, తర్వాత దానిలో పావు శాతం ఇవ్వడానికి కూడా సముఖత వ్యక్తంచేయలేదు. దీంతో స్నాప్ డీల్ సంస్థకు తక్కువ విలువ కట్టి ఫ్లిప్ కార్ట్ కు అమ్మేస్తున్నారు. ఈ డీల్ ను జూన్ వరకు ముగించేయాలని స్నాప్ డీల్ అతిపెద్ద వాటాదారు అయిన సాఫ్ట్ బ్యాంకు నిర్ణయించింది. కానీ ఈ ప్రక్రియ మరికొంత కాలం ఆలస్యమయ్యేటట్టు కనిపిస్తోంది. ప్రేమ్జీ ఇన్వెస్ట్ తో పాటు రతన్ టాటా, ఫాక్స్ కాన్, అలీబాబా గ్రూప్, ఆంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, ఈబే, హాంకాంగ్ ఆధారిత హెడ్జ్ ఫండ్స్ స్నాప్ డీల్ లో ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. వీరందరూ 40 శాతం కలిగి ఉన్నారు. కానీ వీరు బోర్డు బాధ్యతను నిర్వర్తించడం లేదు.  
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top