బయోటెక్ స్టార్టప్స్ లో పాంచ్ పటాకా!

బయోటెక్ స్టార్టప్స్ లో పాంచ్ పటాకా!


బయో ఆసియా సదస్సులో టాప్-5 సంస్థల ఎంపిక

సాక్షి, హైదరాబాద్: స్టార్టప్... స్టార్టప్... స్టార్టప్! దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదే మాట. కొత్తకొత్త ఐడియాలతో ఉరకలేస్తున్న యువత వాటిని ఆచరణలో పెట్టేందుకు, వ్యాపారాలుగా మార్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు రూపం ఈ స్టార్టప్ కంపెనీలు. ఇలా స్టార్టప్‌లుగా మొదలైన అనేక కంపెనీలిప్పుడు  వ్యాపార రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్న విషయం మనకు తెలిసిందే. హైదరాబాద్ కేంద్రంగా రెండు రోజులపాటు జరిగిన బయో ఆసియాలోనూ స్టార్టప్ కంపెనీలు సందడి చేశాయి. బయోటెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న దాదాపు 40 కంపెనీలు తమ ఉత్పత్తులు, ఆలోచనలను ఇక్కడ ప్రదర్శించగా బుధవారం వాటిల్లో అత్యుత్తమమైన ఐదు కంపెనీలను ఎంపిక చేశారు. ఆసక్తికరమైన వాటి వివరాలు...


 ఆక్సియో బయో సొల్యూషన్స్

ఏదైనా ప్రమాదం జరిగి మనిషి గాయపడితే వీలైనంత తొందరగా రక్తస్రావాన్ని అరికట్టడం ప్రాణాలు నిలుపుతుందని మనకు తెలుసు. ఈ పనిచేసేందుకు ఇప్పటివరకూ ప్రత్యేకమైన టెక్నాలజీలేవీ లేవు.  ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కున్నామంటోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆక్సియో బయో సొల్యూషన్స్. ఈ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన ఆక్సియోస్టాట్ (బ్యాండీజ్ లాంటిది)ను గాయంపై ఉంచితే నిమిషాల వ్యవధిలో రక్తస్రావాన్ని పూర్తిగా అరికట్టవచ్చునని సంస్థ ప్రతినిధి లియో తెలిపారు. ఈ వినూత్న టెక్నాలజీని ఇప్పటికే భారత సైనికులకు అందిస్తున్నామని, అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు.


 సీటార్స్

ఎముకలు విరిగితే వాటి స్థానంలో లోహపు ప్లేట్లు వాడటం తెలిసిందే. ఇలా ప్లేట్లు అమర్చేందుకు చేసే సర్జరీ చాలా క్లిష్టమైంది... సర్జరీ సమయంలోనే రోగి శరీర నిర్మాణానికి తగ్గట్టుగా వాటి ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తూంటుంది. ఇందుకోసం ఎక్కువ సమయం పడుతుంది కూడా. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ చిక్కులన్నింటినీ తప్పించేందుకు సెంటర్ ఫర్ టెక్నాలజీ అసిస్టెడ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ(సీటార్స్). చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కృషి ఫలితంగా 12 గంటలు పట్టే శస్త్రచికిత్స ఇప్పుడు రెండున్నర గంటల్లోనే పూర్తి చేయొచ్చు.


 కాల్ అంబులెన్స్

రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చేందుకు పనికొచ్చే మొబైల్ అప్లికేషన్ ఇది. ప్రమాదానికి గురైతే స్మార్ట్‌ఫోన్‌లోని ఈ అప్లికేషన్‌ను ఆన్ చేస్తే చాలు... అది 108 వంటి అత్యవసర సేవలందించే సంస్థలకు రింగ్ ఇవ్వడంతోపాటు పది సెకన్ల వ్యవధిలో ప్రమాదం జరిగిన చోటును కూడా జీపీఎస్ సాయంతో అంచనా కడుతుంది. అంతేకాకుండా... ప్రమాదబాధితుడి తాలూకూ ఆరోగ్య వివరాల (ముందుగా నమోదు చేసుకున్నవి)ను ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కు అందిస్తుంది కూడా. ఈ మేరకు తాము అనేక ప్రైవేట్ ఆసుపత్రులతో అవగాహన కుదుర్చుకున్నట్లు సంస్థ ప్రతినిధి ఉమాశంకర్ తెలిపారు. అపరిచిత వ్యక్తి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కూడా మీరు కాల్ అంబులెన్స్ అప్లికేషన్‌లోని స్ట్రేంజర్ బటన్‌ను నొక్కడం ద్వారా వారికి సాయపడవచ్చునని ఆయన వివరించారు.


 బుక్‌మెడ్స్.కాం

ఇంటర్నెట్ ద్వారా మీకు మందులు ఆర్డర్ చేసేందుకు ఉపయోగపడే వెబ్‌సైట్ ఇది. కాకపోతే దీంతోపాటు కొన్ని అదనపు సర్వీసులూ అందిస్తుంది. మీరు ఆర్డర్ చేసిన మందులను మూడు గంటల్లోపు మీ సమీపంలోని ఫార్మసీ ద్వారా హోం డెలివరీ చేయడం, మందులేసుకోవడం మరచిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేయడం, మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడం ఈ సర్వీసుల్లో కొన్ని. హైదరాబాద్, కోల్‌కతా, పుణే, లక్నో సహా ఇతర నగరాల్లోని 260 ఫార్మసీల ద్వారా తాము ఈ సేవలు అందిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు మహమ్మద్ అబూబకర్ తెలిపారు.


 అవర్‌హెల్త్‌మేట్

ఉద్యోగం లేదా వ్యాపారం నిమిత్తం విదేశాల్లో ఉన్న వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలు అందించేందుకు పనికొచ్చే స్టార్టప్ ఇది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తోంది. ఎన్‌ఆర్‌ఐలు ఈ కంపెనీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంటే స్వదేశంలో ఉండే వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా.... తగిన వైద్య సేవలు అందే ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు తాము దేశవ్యాప్తంగా 17 వేల మంది డాక్టర్లతో కలసి పనిచేస్తున్నామని, దాదాపు వెయ్యి రకాల వైద్యసేవలను ముందుగా నిర్ణయించిన ధరకు అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి అభినవ్ కృష్ణ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top