నిఫ్టీని 10వేల మార్కుకు తీసుకెళ్లింది ఇవే!

నిఫ్టీని 10వేల మార్కుకు తీసుకెళ్లింది ఇవే!

ముంబై : నిఫ్టీ ఇండెక్స్‌ తొలిసారి ఇన్వెస్టర్లందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మకమైన మార్కు 10వేలను తాకింది. భారీ లాభాలతో మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఈ మార్కును నిఫ్టీ తాకగలిగింది. అనంతరం అస్థిరమైన ట్రేడింగ్‌తో నిఫ్టీ 10వేల మార్కు కింద ట్రేడైంది. నేటి సెషన్‌ చివరి వరకు మళ్లీ 10వేల మార్కును తాకలేదు. కానీ తొలిసారి 10వేల మార్కును నిఫ్టీ అధిగమించడంతో ఇన్వెస్టర్లలో కోలాహాలం నెలకొంది. దీపావళి సంబురాలను దలాల్‌స్ట్రీట్‌ నేడే జరుపుకుంది. స్వీట్లు, మిఠాయిలతో ఈ సంబురాన్ని ఇన్వెస్టర్లు ఆస్వాదించారు. నిఫ్టీ ఈ మార్కును ఛేదించడానికి 21 ఏళ్ల సమయం పట్టింది. వచ్చే టార్గెట్‌ ఇక 11వేల మార్కే. అయితే ఇంత అత్యంత కీలకమైన మార్కును నిఫ్టీ ఛేదించడానికి ప్రధాన కారణాలు ఐదింటిని చెప్పుకోవచ్చు. అవేమిటో ఓ సారి చూద్దాం...

 

రాజకీయ స్థిరత్వం...

2014 మే నెలలో మోదీ మేనియాతో బీజేపీ గెలుపు కెరటం ఎగరవేసింది. అనంతరం ప్రధాని కుర్చీలో నరేంద్రమోదీని కూర్చోబెడుతూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ సమయంలో నిఫ్టీ 7వేల మార్కు దగ్గర ఉంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జూలై 25న నిఫ్టీ మూడు వేల పాయింట్లు ఎగిసి, అత్యంత కీలకమైన మార్కు 10వేలను తాకింది. దీనికి గల ప్రధాన కారణం రాజకీయ స్థిరత్వమే అని చెప్పుకోవచ్చు. 2014 సాధారణ ఎన్నికల్లో గెలుపును సాధించి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఇటు మార్కెట్‌కు అటు ఇన్వెస్టర్లకు ఎంతో విశ్వాసాన్ని అందించింది. కేవలం అది మాత్రమే కాక, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ తన హవా సాగించడంతో పాటు, నగర పాలక ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోవడంతో ఇన్వెస్టర్లలో మరింత విశ్వాసం పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో నమో మంత్రం సూపర్‌ హిట్‌ కొట్టడంతో, 2019 ఎన్నికల్లోనూ మోదీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని విదేశీ, దేశీయ ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. 

 

ఎఫ్‌ఐఐ నిధులు....

2014 మే నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ రూ.1.5 లక్షల కోట్లకు పైగా నిధులను భారత్‌కు తరలించారు. యూపీఏ ప్రభుత్వం మొదటిసారి పాలనలో ఉన్నప్పుడు కూడా రూ.1.4 లక్షల కోట్ల మేర ఈక్విటీలు మార్కెట్‌లోకి వచ్చాయి. కానీ 2017 మార్చి నెలలో ఒక్క నెలలోనే అత్యధిక మొత్తంలో అంటే రూ.33,781.93 కోట్ల మేర ఎఫ్‌ఐఐ పెట్టుబడులు భారత మార్కెట్‌లోకి వచ్చి రికార్డులు సృష్టించాయి. ఒకవేళ ఫెడరల్‌ రిజర్వు రేట్ల పెంపు చేపట్టినప్పటికీ, విదేశీ నగదు భారీమొత్తంలోనే మన దేశంలోకి వస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు. 

 

ఆదాయాలపై అంచనాలు...

ఆర్థిక సంవత్సరం 2017-18లో ఆదాయాలు రెండింతల సంఖ్యలో ఉంటాయని మెజార్టీ నిపుణులు అంచనావేస్తున్నారు. 2017-2018 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వృద్ధి వీటికి సహకరిస్తుందని పేర్కొంటున్నారు. అంతేకాక 2019 ఆర్థిక సంవత్సరంలో మరింత రికవరీని చూస్తామన్నారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రథమార్థంలో జీఎస్టీ ప్రభావాన్ని కంపెనీ ఎదుర్కొంటాయని, కానీ తర్వాత కోలుకుంటున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకటిస్తున్న జూన్‌ క్వార్టర్‌ ఫలితాలు స్థిరంగా ఉన్నాయి. ఎలాంటి అతిపెద్ద ముప్పును ఇవి సూచించడం లేదు. దీంతో స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. మరోవైపు బ్యాంకుల ఆస్తుల నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఇవి కూడా స్టాక్‌ మార్కెట్‌పై అనుకూల ప్రభావాని చూపుతున్నాయి.

 

ఎక్కువ జీడీపీ వృద్ధి...

ముఖ్యమైన సంస్కరణలు జీఎస్టీ, బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌లో సవరణలు, ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌, బ్లాక్‌ మనీ, రెరా, వరుసగా రెండో ఏడాది సాధారణ రుతుపవనాలు వంటివి దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి సహకరించనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2018-19లో జీడీపీ వృద్ధి రేటు 8 శాతం పైననే నమోదవుతుందని చాలామంది ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. 2017, 18లలో మన వృద్ధి రేటు చైనా కంటే ఎక్కువగానే ఉంటుందని ఐఎంఎఫ్‌ కూడా చెబుతోంది. మరోవైపు సోమవారం విడుదల చేసిన తన రిపోర్టులో దేశీయ జీడీపీ అంచనాలు 7.2 శాతంగా ఐఎంఎఫ్‌ పేర్కొంది. దీంతో స్టాక్‌ మార్కెట్లు ఊపందుకున్నాయి.

 

సంస్కరణలు....

2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సంస్కరణలనే కేంద్రం చేపట్టింది. దానిలో అ‍త్యంత ముఖ్యమైనది గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ). దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీతో దేశీయ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా ఎంతో బూస్ట్‌ ఇవ్వనుందని తెలుస్తోంది. జీఎస్టీతో పన్ను ఎగవేతలకు కూడా​ ప్రభుత్వం చెక్‌ పెడుతోంది. మరో సంస్కరణ రెరా అదే రియల్‌ ఎస్టేట్‌ యాక్ట్‌ 2016. మే 1 నుంచి ఈ యాక్ట్‌ అమల్లోకి వచ్చింది. దీంతో వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి వెనువెంటనే ప్రాజెక్టులను పూర్తిచేయడానికి దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దివాలా చట్టంతో బ్యాంకింగ్‌ రంగం కూడా కోలుకోనుంది. ఆర్థిక వృద్ధికి బ్యాంకింగ్‌ రంగం అత్యంత కీలకమైనది. ఇవే కాక మరికొన్ని సంస్కరణలను కూడా ప్రభుత్వం చేపడుతోంది. దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతోంది. పెట్టుబడులు వెల్లువ కొనసాగుతోంది. 

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top