హెలో కర్రీ చేతికి పరాటా పోస్ట్

హెలో కర్రీ చేతికి పరాటా పోస్ట్


రూ.50 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న బ్లూచిప్ కంపెనీ...

డిసెంబర్‌కల్లా దేశంలో 90 ఔట్‌లెట్లు


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాణ్యమైన పరాటాలు ఇప్పుడు హెలో కర్రీ మెనూలోకి వచ్చి చేరాయి.  హోమ్ డెలివరీ రంగంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన పరాటా పోస్ట్‌ను ,ఈ నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెలో కర్రీ కొనుగోలు చేసింది. ఎంత మొత్తానికి కొనుగోలుచేసిందీ కంపెనీ వెల్లడించలేదు. పరాటా పోస్ట్‌ను కొనుగోలు చేసిన సందర్భంగా హలో కర్రీ సీఈఓ రాజు భూపతి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు విశేషాలు వెల్లడించారు. అవి....

 

ఎంత తింటే.. అంతే డబ్బులు

సింగిల్, ఫ్యామిలీ, జంబో ప్యాక్స్.. ఇదీ స్థూలంగా బిర్యానీ ప్యాక్‌ల రకాలు. హలో కర్రీ అనే స్టార్టప్ ఒక అడుగు ముందుకేసి హైటెక్‌సిటీలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ పేరుతో వినూత్న రెస్టారెంట్‌ను ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏంటంటే మనకు ఎంత బిర్యానీ రైస్ కావాలంటే అంత.. ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇక్కడ. గ్రాముకు 50 పైసల చొప్పున చెల్లించాలి అంతే. ఇలా ఎందుకంటే బిర్యానీ బాగా లేదనో, ముక్కలు తినేసి ఆహారం వదలటమో, అనుకున్న దానికంటే ఎక్కువుందనో.. ఇలా కారణాలేమైనా నగరంలో రోజుకు 24.8 శాతం ఆహారం దుర్వినియోగం అవుతోంది. వేస్ట్ కాకుండా ఉండాలంటే ఎంత బిర్యానీ కావాలో ఎంచుకునే అవకాశం కస్టమర్లకే ఇస్తే సరిపోతుందంటారాయన.

 

దేశంలో 80-90 ఔట్‌లెట్లు..

ప్రస్తుతం హలో కర్రీకి హైదరాబాద్‌లో గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లిలో ఔట్‌లెట్లున్నాయి. వీటి నుంచి నెలకు 10 వేల ఆర్డర్లొస్తున్నాయి. మరో 15 రోజుల్లో పంజగుట్ట, హిమాయత్‌నగర్‌లోనూ ప్రారంభించనున్నాం. బెంగళూరులో  లోనూ సెంటర్లు ఉన్నాయి. డిసెంబర్‌కల్లా దేశంలో 80-90 ఔట్‌లెట్లు ప్రారంభించానేది లక్ష్యం.

 

30 నిమిషాల్లో డెలివరీ..: ప్రస్తుతం ఒక్క రోజులో హైదరాబాద్‌లోని మొత్తం హోమ్ డెలివరీ మార్కెట్లో హలో క ర్రీ వాటా 25%. వాట్సాప్, యాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఆర్డర్లివ్వొచ్చు. ధరలు రూ.79-149 వరకున్నాయి. ఆర్డరిచ్చిన 30 నిమిషాల్లో సరఫరా చేస్తాం. ప్రస్తుతం హలో కర్రీకి 5 లక్షల మంది కస్టమర్లున్నారు.

 

పరాటా పోస్ట్ గురించి..

ఐఐఎం గ్రాడ్యుయేట్లు ముకేష్ లాంబ, రితురాజ్‌లు 2013లో పరాటా పోస్ట్‌ను ప్రారంభించారు. 55 రకాల పరాటాలు, కూరలను ఈ కంపెనీ సరఫరా చేస్తోంది. గతేడాది 3 లక్షలకుపైగా పరాటాలతో 60 వేల ఆర్డర్లను విజయవంతంగా పూర్తి చేసింది. పరాటాపోస్ట్ కొనుగోలుచేయడంతో పాటు దేశీయ ఫుడ్ డెలివరీ రంగ కంపెనీల కొనుగోలుపై దృష్టిపెట్టాం. ముంబై కంపెనీని త్వరలో కొనుగోలు చేయనున్నాం.

 

రూ.50 కోట్ల పెట్టుబడులు..

2014లో కంపెనీ ప్రారంభించే రోజుల్లో రూ.3.5 కోట్ల పెట్టుబడులు పెట్టాం. తర్వాతి నెల రోజుల్లోనే వెంచర్ క్యాపిటలిస్ట్ శశిరెడ్డి రూ.3 కోట్లు సీడ్ ఫండ్ అందించారు. తాజాగా రూ.50 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒక బ్లూ చిప్ కంపెనీ ముందుకొచ్చింది. నెల రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top