అందరి చూపు భాగ్యనగరం వైపు!

అందరి చూపు భాగ్యనగరం వైపు! - Sakshi


‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ

క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు ఎస్. రాంరెడ్డి


ప్రస్తుతం ఐదెకరాల లోపు చేపట్టే ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌కూ షెల్టర్ ఫీజును చెల్లిస్తున్నాం. ఇది జీహెచ్‌ఎంసీ పరిధిలో చ.మీ.కు రూ.750, హెచ్‌ఎండీఏ పరిధిలో అయితే  రూ.600గా ఉంది. అయితే ఇకపై 5 ఎకరాలపైన చేపట్టే ప్రతి ప్రాజెక్ట్‌కు కూడా షెల్టర్ ఫీజును చెల్లించాలని నిర్ణయించుకున్నాం. ఇలా వచ్చే అదనపు సొమ్మును ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ వర్గాల ఇంటి నిర్మాణాలకు ఉపయోగించుకోవ చ్చు.

 

స్థిరాస్తి సంస్థలే కాదు ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు కూడా..

8 నెలల్లో 40 శాతం మేర స్థిరాస్తి ధరలు పెరుగుతాయ్

2020 నాటికి క్రెడాయ్ లీడర్ యువతే

సాక్షి, హైదరాబాద్:
‘‘ఐటీ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు, బడా పారిశ్రామిక సంస్థలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి కంపెనీలు, దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు.. ఇలా ప్రతి ఒక్కరి చూపు భాగ్యనగరంపై పడింది. దీంతో గత పదేళ్లలో దేశంలోని ఏ నగరమూ చేరుకోలేని స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందనుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే రానున్న రోజుల్లో నగరంలో స్థిరాస్తి రంగం నిలకడైన పనితీరును కనబర్చనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటికి నగరంలో స్థిరాస్తి అమ్మకాలు, ధరలు రెండూ 20-25 శాతం మేర పెరిగాయని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు ఎస్. రాంరెడ్డి చెప్పారు. క్రెడాయ్ హైదరాబాద్ సారథిగా ఎన్నికైన సందర్భంగా ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.



ప్రస్తుతం సంయుక్త రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏపీ బిల్డింగ్ కోడ్ నిబంధనలే అమలవుతున్నాయి. దీన్నుంచి తెలంగాణ బిల్డింగ్ కోడ్‌ను విభజించి ఇక్కడి నిర్మాణ రంగం అవసరాలు, అభివృద్ధిలకు వీలుగా నిబంధనల్లో కాసింత మార్పులు తీసుకురావాలి. అప్పుడే సంయుక్త రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి కంటే నాలుగు రెట్లు వృద్ధి కనిపిస్తుంది. పెపైచ్చు ఇక్కడి నూతన పారిశ్రామిక విధానం, పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగ్ రోడ్డు, మెరుగైన మౌలిక వసతులు మరింత కలిసొచ్చే అంశాలు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు పరిశ్రమలు, విద్యుత్, నీళ్లు వంటి వాటిపై దృష్టి పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంపై కన్నేశారు. నిర్మాణ రంగంలో రాత్రికి రాత్రే ఏం జరగదు. దేనికైనా కాసింత సమయం కావాలి. ఒక స్థిరాస్తి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలంటేనే ఎంతలేదన్నా మూడేళ్ల సమయం పడుతుంటే.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సెట్ కావాలంటే మరింత సమయం కావాలి. అయినా రాష్ట్రాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి అందరికంటే ముందున్నారనే చెప్పాలి. ఎందుకంటే నూతన పారిశ్రామిక విధానంతో అంతర్జాతీయ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కంపెనీలను ఆకర్షించారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరించే యోచనలోనూ ఉన్నాయి. ఇవి చాలు పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యతనిస్తుందో చెప్పడానికి.

ప్రస్తుతం క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్‌లోని 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, 9 మంది ఆఫీస్ బేరర్స్‌లో.. ఐదుగురు మినహా మిగతా అందరూ 35 లోపు వయస్సు వాళ్లే. ఉన్నత విద్యనభ్యసించిన ప్రొఫెషనల్సే. దీన్నిబట్టి చూస్తే 2020 నాటికి క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్‌గా యువతే అనేది నా అభిప్రాయం. ఇప్పటికే మంజీరా, ప్రజయ్, ఎస్‌ఎంఆర్, జనప్రియ, సీఎస్సార్ వంటి నగరానికి చెందిన నిర్మాణ సంస్థల్లో తండ్రులతో పాటు వారి వారసత్వమూ కీలక బాధ్యతల్లో ఉన్నారు. కాకపోతే వీరు మరింత మెరుగైన నాయకత్వ లక్షణాలు, పరిశ్రమ మీద పూర్తి అవగాహన, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు వంటి కీలకాంశాలపై సుశిక్షితులు కావాలి.

రాష్ట్రాభివృద్ధిలో క్రెడాయ్‌ది పెద్దన్న పాత్ర. ప్రస్తుతం హైదరాబాద్ చాప్టర్‌లో 158 మంది మెంబర్లున్నారు. రెండేళ్లలో వీరి సంఖ్యను 250కి పైగా పెంచుతాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రెడాయ్ చాప్టర్లను తెరవనున్నాం. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్, రెవెన్యూ, అగ్నిమాపక మండలి వంటి అన్ని ప్రభుత్వ విభాగాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పనిచేస్తాం. క్రెడాయ్ మెంబర్లకు ప్రాజెక్ట్‌ను ఎక్కడ ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎంత పెట్టుబడులు పెట్టాలి, నిధుల సమీకరణ ఎలా, ప్రాజెక్ట్‌లో ఎలాంటి వసతులివ్వాలి, ధర ఎంత పెట్టాలి.. వంటి అన్ని అంశాల్లోనూ సుశిక్షితులతును చేసేందుకు నిపుణుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, శిక్షణ శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తాం.

సిమెంట్, ఇనుము, ఉక్కు వంటి నిర్మాణ సామగ్రి ధరలను అదుపులో ఉంచేందుకు గంపగుత్తగా (బల్క్) కొనుగోళ్లు చేస్తాం. ఒక్కోదానికి నాలుగేసి కంపెనీలతో చర్చించి టెండర్ల మాదిరిగా సామగ్రిని కొనుగోలు చేస్తాం. దీంతో 10-15 శాతం ధర తక్కువకొస్తుంది. టెక్నాలజీ ద్వారా కొనుగోలుదారులకు మరింత దగ్గరవుతాం. అందుకే క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ పోర్టల్‌ను ప్రారంభిస్తాం. దీంతో  హైదరాబాద్‌కు చెందిన క్రెడాయ్ బిల్డర్ల ప్రాజెక్ట్‌లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం నగరంలో మార్కెట్ మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో గచ్చిబౌలి నుంచి పెద్ద అంబర్‌పేట వరకు హాట్‌స్పాట్. ఎందుకంటే ఇక్కడ భూమి ఉంది. ధరలూ అందుబాటులోనే ఉన్నాయి. విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి. పెపైచ్చు అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ తర్వాత అభివృద్ధి విజయవాడ హైవే మీదుగా వరంగల్ హైవేకు మళ్లే అవకాశాలున్నాయి. మరో 8 నెలల్లో 40-50 శాతం మేర ధరలు పెరిగే అవకాశాలూ లేకపోలేదు.

ప్రభుత్వం కూడా తమ భూములేంటనే వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలి. అప్పుడు బిల్డర్లే గానీ, సామాన్యులే గానీ స్థలాలను కొనుగోలు చేసేముందు ప్రభుత్వ భూములా.. లేక ఎవరికైనా దానం చేసిన భూములా అనేది నిర్ధారణ చేసుకొని కొనుగోలు చేస్తారు. అలాకాకుండా దాదాపు ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయంలో ఇది ప్రభుత్వ భూమంటూనో, వక్ఫ్ భూములంటూనో నోటీసులిస్తే ఎవరికైనా ఎంత సమస్య.. ఎంత నష్టం.. ఎంత డబ్బు వృథా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top