విదేశీ బంకుల హల్‌చల్‌!

విదేశీ బంకుల హల్‌చల్‌!


దేశీ చమురు రిటైల్‌లోకి విదేశీ దిగ్గజాలు

రాస్‌నెఫ్ట్‌ చేతికి ఎస్సార్‌ ఆయిల్‌ రిఫైనరీ, బంకులు

రూ.86,000 కోట్ల ఒప్పందానికి బ్యాంకులు ఓకే

త్వరలో రిలయన్స్‌– బ్రిటిష్‌ పెట్రోలియం బంకులు కూడా

ఇప్పటికే వేగంగా తెరుచుకుంటున్న రిలయన్స్‌ బంకులు

విస్తరణపై షెల్‌ దృష్టి; త్వరలో మరిన్ని బంకులు

ఆటో ఎల్‌పీజీ స్టేషన్లను పెంచుకోనున్న టోటల్‌

ప్రభుత్వ రిఫైనరీలో వాటా ద్వారా సౌదీ ఆరామ్‌కో!

ప్రభుత్వ దిగ్గజాలది కూడా విస్తరణ బాటే

నాలుగేళ్లలో మరో 9 వేల బంకులు: క్రిసిల్‌
 



(సాక్షి, బిజినెస్‌ విభాగం)

పెట్రోల్‌ బంకులంటే!! భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్, హిందుస్తాన్‌ పెట్రోలియం... ఇవే!. చమురు రిటైలింగ్‌లో ఇప్పటిదాకా ఈ ప్రభుత్వ కంపెనీలదే గుత్తాధిపత్యం. కాకపోతే మున్ముందు పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు. ఎందుకంటే గతనెల వరకూ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ అమ్మకాల్లో దాదాపు 95 శాతం వాటా వీటి చేతిలోనే ఉండగా... మెల్లగా అది తగ్గుతూ వస్తోంది. ప్రయివేటు కంపెనీలైన షెల్, ఎస్సార్‌ ఆయిల్, రిలయన్స్‌ మెల్లగా వాటా పెంచుకోవటమే దీనిక్కారణం. కానీ మూడు నాలుగేళ్లలో ముఖచిత్రం మరింతగా మారిపోనుంది.



ఎందుకంటే ప్రపంచ చమురు దిగ్గజాలైన రాస్‌నెఫ్ట్‌ (రష్యా), బ్రిటిష్‌ పెట్రోలియం (యూకే), ఆరామ్‌ కో (సౌదీ), రాయల్‌ డచ్‌ షెల్‌ (నెదర్లాండ్స్‌)... భారత రిటైల్‌ మార్కెట్‌పై కన్నేశాయి. గతంలోనే భారత్‌లోకి అరంగేట్రం చేసిన షెల్‌... భారీగా పెట్టుబడులు పెంచబోతుండగా... మిగిలిన కంపెనీలు ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. శుక్రవారంనాడు రాస్‌నెఫ్ట్‌ డీల్‌కు రుణదాతలు ఓకే చెప్పిన నేపథ్యంలో... ఇవన్నీ బంకులు ఏర్పాటు చేసే పరిణామం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.



దేశంలో 2014కు ముందు వరకూ పెట్రోల్, డీజిల్‌ ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండేది. వినియోగదారులపై పడే భారాన్ని సబ్సిడీల రూపంలో ప్రభుత్వం భరించేది. కాకపోతే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గిపోవటం కేంద్ర ప్రభుత్వానికి కలిసొచ్చింది. దీంతో మెల్లగా తమ నియంత్రణను సడలించి, మార్కెట్‌ ధరలకు అనుగుణంగా నిర్ణయించే అధికారాన్ని కంపెనీలకు కట్టబెట్టింది. అప్పటికే ఈ రంగంలోకి వచ్చి... పోటీని తట్టుకోలేక చాలా బంకుల్ని మూసేసిన రిలయన్స్, ఎస్సార్‌ ఆయిల్‌ వంటి సంస్థలకు ఈ పరిణామం కలిసొచ్చింది. సబ్సిడీల శకం ముగియటంతో 2014 నుంచీ ఇవి తమ బంకుల్ని తిరిగి తెరిపించటం మొదలెట్టాయి. 2021 నాటికి ఈ రెండు సంస్థలూ దాదాపు 8000 బంకుల వరకూ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల క్రిసిల్‌ నివేదిక ఒకటి వెల్లడించింది.



‘‘దీంతో ప్రస్తుతం 4–5 శాతంగా ఉన్న వీటి వాటా 2021 నాటికి 15 శాతానికి చేరుతుంది. అయితే ప్రస్తుతం 53 వేల బంకులున్న ప్రభుత్వ రంగ బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ కూడా అప్పటికి మరో 9వేల బంకుల్ని ఏర్పాటు చేస్తాయి. దేశంలో పెట్రోల్, డీజిల్‌కు పెరగనున్న డిమాండ్‌ దృష్ట్యా ఇవన్నీ విస్తరణ ప్రణాళికలు వేస్తున్నాయి’’ అని క్రిసిల్‌ వివరించింది. ప్రస్తుతం ఎస్సార్‌ ఆయిల్‌కు దేశవ్యాప్తంగా 2,700 బంకుల వరకూ ఉండగా... ముకేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు 1200 వరకూ ఉన్నాయి. వీటిలో చాలావరకూ మూతపడగా... ఇటీవలే ఒక్కొక్కటిగా వేగంగా తెరుచుకుంటున్నాయి. డచ్‌ దిగ్గజం షెల్‌కు దేశంలో 83 బంకులున్నాయి.



బ్రిటిష్‌ పెట్రోలియంతో రిలయన్స్‌ జట్టు!

ఇక దేశీ చమురు దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు దేశవ్యాప్తంగా 5000 బంకుల వరకూ ఏర్పాటు చేయటానికి లైసెన్సుంది. మూతపడ్డవి కూడా కలిపితే దీనికి ఇప్పటికే 1200 బంకులున్నాయి. అంతర్జాతీయ దిగ్గజం బ్రిటిష్‌ పెట్రోలియానికి కూడా దేశంలో 3,500 బంకులు ఏర్పాటు చేయటానికి సూత్రప్రాయంగా అనుమతి ఉంది. ఇటీవలే రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ... ఇక్కడికొచ్చిన బ్రిటిష్‌ పెట్రోలియం అధినేత డూడ్లీతో చర్చలు జరిపారు. అనంతరం రెండు సంస్థలూ కలిసి దేశీ చమురు రిటైల్‌ రంగంలో అవకాశాల్ని అందిపుచ్చుకుంటాయని సంయుక్త సమావేశంలో ప్రకటించారు కూడా. దీంతో త్వరలో రిలయన్స్‌–బీపీ బంకులు కూడా సాకారం కానున్నాయనేది ధ్రువపడింది.



విస్తరణ దిశగా టోటల్, షెల్‌!

నెదర్లాండ్స్‌కు చెందిన చమురు దిగ్గజం రాయల్‌ డచ్‌ షెల్‌ కంపెనీకి గతేడాది డిసెంబర్‌ నాటికి దేశంలో 83 బంకులున్నాయి. అంతర్జాతీయంగా ఈ ఏడాది 25 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అయితే దీన్లో ఎంత మొత్తాన్ని ఇండియా కార్యకలాపాల కోసం వెచ్చిస్తారన్నది ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే పోటీ పెరుగుతున్న దృష్ట్యా భారత మార్కెట్లో పెట్టుబడులు కూడా ఉంటాయని, తమ నెట్‌వర్క్‌ పెరుగుతుందని షెల్‌ ఇండియా సీఈఓ నితిన్‌ ప్రసాద్‌ ఈ మధ్యే చెప్పారు. కాకపోతే జీఎస్‌టీ వల్ల పెట్రోల్, గ్యాస్‌ వ్యాపారం మరింత ఖరీదైనదిగా మారుతుందని కూడా చెప్పారాయన. ఇక ఫ్రెంచ్‌ దిగ్గజం టోటల్‌కు ఇప్పటికే 40కి పైగా ఆటోగ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లున్నాయి. వీటి సంఖ్య కూడా మరింత పెరగవచ్చని పెట్రోలియం శాఖ వర్గాలు చెబుతున్నాయి.



గతంలోనే ఆరామ్‌కో ఆసక్తి!

దేశీ రిటైల్‌ చమురు రంగంపై సౌదీకి చెందిన అంతర్జాతీయ దిగ్గజం ఆరామ్‌కో ఇదివరకే ఆసక్తి చూపించింది. పెట్రో ధరలు తగ్గుతున్న దృష్ట్యా దేశంలో మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ సంస్థ ఇతర అవకాశాల్ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే రిటైల్‌లోకి అడుగు పెట్టనున్నట్లు గతంలో సంస్థ వర్గాలు వెల్లడించాయి. అయితే తాజాగా ఈ సంస్థ దాదాపు 100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6.4 లక్షల కోట్లు) ఐపీఓకు రావటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరామ్‌కోలో దేశీ చమురు దిగ్గజాలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు వాటా తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడూ కలిసి దేశంలోనే అతిపెద్దదైన చమురు రిఫైనరీని మహారాష్ట్రలో దాదాపు రూ.2 లక్షల కోట్లతో ఏర్పాటు చేయటానికి ఇటీవలే ఒప్పందం చేసుకున్నాయి. ఈ రిఫైనరీలో ఆరామ్‌కోకు వాటా ఇచ్చి... బదులుగా ఆ సంస్థలో వాటా తీసుకునే అవకాశముందని పెట్రోలియం మంత్రి ఇటీవలే చెప్పారు కూడా. ఇదే జరిగితే ఆరామ్‌కో దేశీ రిటైల్‌ ప్రవేశానికి మార్గం సుగమమవుతుంది కూడా.



ఎస్సార్‌ ఆయిల్‌ రూట్లో ‘రాస్‌నెఫ్ట్‌’

గుజరాత్‌లోని వడినార్‌లో భారీ చమురు రిఫైనరీతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 2,700 రిటైల్‌ బంకులున్న ఎస్సార్‌ ఆయిల్‌ను రూ.84,000 కోట్లు పెట్టి కొనుగోలు చేయటానికి రష్యాకు చెందిన చమురు అన్వేషణ, రిఫైనింగ్‌ దిగ్గజం రాస్‌నెఫ్ట్‌ గతేడాది అక్టోబర్లోనే ఒప్పందం చేసుకుంది. కాకపోతే ఎస్సార్‌ ఆయిల్‌కు భారీగా రుణాలుండటంతో ఆ మేరకు ఆ సంస్థ షేర్లు బ్యాంకుల కన్సార్షియం వద్ద ఉన్నాయి. దీంతో ఒప్పందానికి ఈ అంశం అడ్డంకిగా నిలిచింది.



శుక్రవారంనాడు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల నేతృత్వంలోని 23 బ్యాంకుల కన్సార్షియం ఈ ఒప్పందానికి సమ్మతించింది. షేర్లను విడుదల చేయటానికి ఒప్పుకుంది. దీంతో ఎస్సార్‌ ఆయిల్‌లో రాస్‌నెఫ్ట్‌ 49 శాతం వాటాను, కమోడిటీ ట్రేడింగ్‌ సంస్థ ట్రాఫిగురా–యూసీపీ జాయింట్‌ వెంచర్‌ 25 శాతం వాటాను దక్కించుకోవటానికి మార్గం సుగమమైంది. దీంతో త్వరలోనే రాస్‌నెఫ్ట్‌ బంకులు సాక్షాత్కారం కానున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top