వదలని చైనా భయాలు

వదలని చైనా భయాలు


 ప్రభావం చూపని మ్యాట్ నిర్ణయం



  కొనసాగుతున్న అమ్మకాలు, నష్టాలు

  243 పాయింట్ల నష్టంతో 25,454 పాయింట్లకు సెన్సెక్స్

  69 పాయింట్ల నష్టంతో 7,717 పాయింట్లకు నిఫ్టీ

  13 నెలల కనిష్టానికి సూచీలు

 

 స్టాక్ మార్కెట్ నష్టాలు బుధవారం కూడా కొనసాగాయి. చైనా, యూరప్, అమెరికా తయారీ రంగ గణాంకాలు నిరాశజనకంగా ఉండటంతో అంతర్జాతీయంగా వృద్ధిపై ఆందోళనతో  వరుసగా మూడో రోజూస్టాక్ మార్కెట్ నష్టాల పాలయ్యింది. ఆద్యంతం ఊగిసలాటకు గురైన ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 243 పాయింట్ల కోల్పోయి 25,454 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 7,717 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇది దాదాపు 13 నెలల కనిష్ట స్థాయి. విదేశీ ఇన్వెస్టర్లపై ఈ ఏడాది ఏప్రిల్ 1కి ముందు కాలానికి కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)ను వర్తింపజేయరాదన్న ఏ.పి. షా కమిటీ సూచనను ప్రభుత్వం ఆమోదించింది.



స్టాక్ మార్కెట్‌పై ఈ నిర్ణయం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.  విద్యుత్తు, పీఎస్‌యూ, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, వాహన, లోహ షేర్లు పతనమయ్యాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజ, రియల్టీ సూచీలు మినహా మిగిలిన తొమ్మిది రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.  ఇటీవల బాగా పతనమైన రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, టెక్నాలజీ షేర్లలో కొనుగోళ్లు స్టాక్ మార్కెట్ మరింత నష్టపోకుండా నిరోధించాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనతో స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్క నెలలోనే 10 శాతం నష్టపోయాయి. ఆగస్టులో చైనా తయారీరంగ గణాంకాలు పడిపోవడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులంటున్నారు. ఈ రెండు అంశాల కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని వారంటున్నారు.

 

 సద్భావ్ ఐపీఓ 2.2 రెట్లు సబ్‌స్క్రైబ్

 మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా... సద్భావ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఐపీఓ 2.24 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రూ.100-143  ప్రైస్‌బాండ్‌గా  ఈ ఐపీఓ ఆగస్టు 31న ప్రారంభమై బుధవారం ముగి సింది.కాగా ప్రైస్‌బాండ్‌ను తగ్గించి, ఐపీఓ కాలాన్ని పొడిగించిన ప్రభాత్ డైరీ ఐపీఓ బుధవారం నాటికి 36% సబ్‌స్క్రైబ్ అయింది.


Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top