మౌలిక రంగం హై జంప్...

మౌలిక రంగం హై జంప్...


- మేలో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు 4.4 శాతం

- ఆరు నెలల గరిష్ట స్థాయి

- బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టుల దన్ను

న్యూఢిల్లీ:
ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ మే నెలలో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. గ్రూప్ వృద్ధి రేటు 4.4 శాతంగా నమోదయ్యింది.  అంటే 2014 మే నెలతో పోల్చితే 2015 మే నెలలో ఈ పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి విలువ 4.4 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరు నెలల్లో ఎన్నడూ సాధించనంత వృద్ధి రేటు మేలో నమోదుకావడం విశేషం. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తుల్లో చక్కటి పనితీరు మొత్తం ఫలితంపై సానుకూల ప్రభావాన్ని చూపింది. కాగా సహజ వాయువు విభాగంలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత కొనసాగుతోంది. పైగా ఈ క్షీణ రేటు మరింత పెరిగింది. 2014 మే నెలలో గ్రూప్ వృద్ధి రేటు అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3.8 శాతం. వార్షికంగా ఎనిమిది విభాగాల్లో వృద్ధి రేటు తీరును చూస్తే...

 

బొగ్గు: ఉత్పత్తి రేటు 5.5 శాతం నుంచి 7.8 శాతానికి ఎగసింది.

ముడి చమురు: 0.3 శాతం క్షీణ బాట నుంచి 0.8 శాతం వృద్ధికి మారింది.

సహజ వాయువు: 2.2 శాతం క్షీణత (మైనస్) మరింతగా 3.1 శాతం క్షీణతలోకి జారింది.

రిఫైనరీ ప్రొడక్టులు: 1.8 క్షీణ బాట నుంచి భారీగా 7.9 శాతం వృద్ధి బాటన పట్టింది.

ఎరువులు: ఈ రంగంలో వృద్ధి రేటు భారీగా 17.6 శాతం నుంచి 1.3 శాతానికి పడింది.

స్టీల్: వృద్ధి రేటు 3.3% నుంచి 2.6 శాతానికి తగ్గింది.

సిమెంట్: వృద్ధి 8.4% నుంచి 2.6 శాతానికి దిగింది.

విద్యుత్: వృద్ధి రేటు 6.7% నుంచి 5.5%కి పడింది.



ఏప్రిల్, మార్చి నెలల్లో  క్షీణతే...

మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 38 శాతం వాటా ఉన్న ఈ ఎనిమిది రంగాల గ్రూప్ గడచిన మార్చి, ఏప్రిల్ నెలల్లో అసలు వృద్ధి సాధించలేదు. ఈ  రెండు నెలల్లో 0.1 శాతం, 0.4 శాతం చొప్పున క్షీణించాయి. మే మంచి ఫలితం వల్ల ఏప్రిల్, మే నెలల్లో ఎనిమిది రంగాల వృద్ధి 2.1%గా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలల్లో ఈ వృద్ధి 4.7 శాతం. గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఈ రంగాల వృద్ధి రేటు 3.5 శాతం. కాగా మే నెలలో వృద్ధిరేటు పారిశ్రామిక క్రియాశీతను సూచిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top