ఆగస్ట్‌లో మౌలిక రంగ వృద్ధి 5.8%

ఆగస్ట్‌లో మౌలిక రంగ వృద్ధి 5.8%


 న్యూఢిల్లీ: కీలకైమైన 8 మౌలిక పరిశ్రమలు ఆగస్ట్‌లో 5.8% వృద్ధిని అందుకున్నాయి. ప్రధానంగా బొగ్గు, సిమెంట్, విద్యుత్ రంగాల పనితీరు ఇందుకు దోహదపడింది. గతేడాది(2014) ఆగస్ట్‌లో మౌలిక పరిశ్రమల పురోగమన రేటు 4.7% చొప్పున నమోదైంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం బొగ్గు రంగం 13.4% వృద్ధిని చూపగా, సిమెంట్ 10.3%, విద్యుత్ 12.6% చొప్పున పుంజుకున్నాయి.



ఈ బాటలో స్టీల్  ఉత్పత్తి 9.1% మెరుగుపడినప్పటికీ, ముడిచమురు 4.9%, సహజవాయువు ఉత్పత్తి 8.3% చొప్పున క్షీణించడం గమనార్హం.ఇదే విధంగా రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల విభాగం 4.3% చొప్పున నీరసించాయి. కాగా, ఏప్రిల్-ఆగస్ట్ కాలానికి 8 కీలక పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం 4.4% వృద్ధిని సాధించింది. గతంలో ఇదే కాలానికి 4.2% వృద్ధి నమోదైంది. ఆగస్ట్‌లో 8 కీలక పరిశ్రమలు సగటున మెరుగైన ఫలితాలను సాధించడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు సానుకూలంగా వెలువడేందుకు వీలుచిక్కనుంది. ఐఐపీలో వీటికి 38% వెయిటేజీ ఉండటమే దీనికి కారణం.



 ఆర్థిక రికవరీకి సంకేతం

 ఆగస్ట్‌లో కీలక పరిశ్రమలు 5.8% వృద్ధి సాధించడం ద్వారా ఆర్థిక పురోగమన సంకేతాలను మరింత బలపరుస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ వ్యాఖ్యానించింది. బొగ్గు రంగ వేగం కొనసాగకపోయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఆటంకం ఉండబోదని అభిప్రాయపడింది. మెరుగుపడుతున్న పారిశ్రామికోత్పత్తిని గణాంకాలు పట్టిచూపుతున్నాయని పేర్కొంది. భవిష్యత్‌లో బొగ్గు రంగంలో జోష్ కొనసాగాలంటే బ్లాకులను ప్రభుత్వం తిరిగి వేలం ద్వారా కేటాయించాల్సిన అవసరం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ చెప్పారు. ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టు మొత్తం 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top