గ్రీస్ ప్రభావం భారత్‌పై తక్కువే

గ్రీస్ ప్రభావం భారత్‌పై తక్కువే - Sakshi


అక్కడి సంక్షోభంతో రూపాయిపై ప్రతికూలత..

- పెట్టుబడులు కొంత వెనక్కివెళ్లే అవకాశం ఉంది

- ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్

న్యూఢిల్లీ:
గ్రీస్‌లో ఆర్థిక సంక్షోభ ప్రభావం భారత్‌పై  తక్కువగానే ఉండొచ్చని, మన ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటమే దీనికి కారణమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. బెయిలవుట్ ప్యాకేజీ షరతులను గ్రీస్ ప్రజలు రిఫరెండంలో తిరస్కరించిన నేపథ్యంలో అక్కడ సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే సంకేతాలతో పాటు, యూరోజోన్‌లో గ్రీస్ భవితవ్యం కూడా డోలాయమానంలో పడిన సంగతి తెలిసిందే. ‘గ్రీస్ సంక్షోభంపై హైడ్రామా మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది.



ఈ ప్రతికూలతలను తట్టుకోగలిగే సామర్థ్యం మన ఆర్థిక వ్యవస్థకు ఉంది. ఎందుకంటే దేశంలో స్థూల ఆర్థిక పరిస్థితులు అత్యంత స్థిరంగా ఉన్నాయి. తగినన్ని విదేశీ మారక నిల్వలు కూడా ఉండటంతోపాటు పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది’ అని సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. అయితే, డాలర్ పెట్టుబడులు కొంతమేర తరలిపోయే అవకాశాలు ఉండటంతో రూపాయి మారకం విలువపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ ఎలాంటి అసాధారణ పరిస్థితులు తలెత్తలేదని స్పష్టం చేశారు.

 

మనపై పరోక్ష ప్రభావం..: రాజీవ్ మహర్షి

గ్రీస్ సంక్షోభం వల్ల అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురయ్యే ప్రమాదం ఉందని.. దీనిపై యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ), అమెరికా ఫెడరల్ రిజర్వ్‌లే తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి వ్యాఖ్యానించారు. అయితే, యూఎస్ ఫెడ్ గనుక వడ్డీరేట్లను పెంచితే మన మార్కెట్‌పై కొంత ప్రతికూలత ఉండొచ్చని ఆయన చెప్పారు. మనపై గ్రీస్ ప్రభావం పరోక్షోంగానే ఉంటుందని.. అక్కడి పరిణామాలన్నింటినీ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందన్నారు.

 

అనిశ్చితిలో గ్రీస్, యూరో...

ఎథెన్స్: బెయిలవుట్ ప్యాకేజీలను కొనసాగించాలంటే కఠినమైన సంస్కరణలు, పెన్షన్లలో కోత, పన్నుల పెంపు, ఇతరత్రా వ్యయ నియంత్రణ చర్యలకు ఒప్పుకోవాలంటూ యూరోపియన్ యూనియన్(ఈయూ), అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) విధించిన షరతులను గ్రీస్ ప్రజలు తిరస్కరించారు. రిఫరెండంలో 61 శాతం మంది ఓటర్లు షరతులకు నో చెప్పగా.. కేవలం 39 శాతం మాత్రమే ఓకే అన్నారు. దీంతో రుణదాతలకు చుక్కెదురైంది. మరోపక్క, ఈ పరిణామంతో ఆర్థిక సాయంలేక, ఇప్పటికే నెలకొన్న సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదంతో గ్రీస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యూరోజోన్‌లో ఆ దేశం ఉంటుందా, బయటికి పోతుందా అనేది తేలాల్సి ఉంది. అటు యూరోజోన్ దేశాల సింగిల్ కరెన్సీ యూరో మనుగడకూడా ప్రశ్నార్థంకంగా మారుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్... గత నెల 30న ఐఎంఎఫ్‌కు కట్టాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయి విషయంలో చేతులెత్తేసి డిఫాల్ట్ అయింది. అధికారికంగా గ్రీస్ దివాలా తీసినట్లు  యూరోపియన్ ఆర్థిక స్థిరత్వ యంత్రాంగం(ఈఎఫ్‌ఎస్‌ఎఫ్) ప్రకటించింది.

 

మరో రెండు రోజులు బ్యాంకుల మూసివేత

గ్రీసు బ్యాంకుల్ని మరో రెండు రోజులు(మంగళ, బుధవారాలు) మూసివేస్తున్నట్లు గ్రీక్ బ్యాంక్ అసోసియేషన్ తెలిపింది. ఏటీఎంలలో 60 యూరోల రోజువారీ విత్‌డ్రాయిల్ లిమిట్ కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం గెలిచిందన్న ఆనందం అందరిలోనూ కనబడుతోందని రిఫరెండం ఫలితాల తర్వాత గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ టెలివిజన్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘యూరప్ చరిత్రలో ఈ ఆదివారం ఎంతో ప్రకాశవంతమైన రోజు. ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని బ్లాక్‌మెయిల్ చేయలేరని ఈ రిఫరెండం నిరూపించింది. గ్రీస్ వాసులు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు’ అని సిప్రస్ వ్యాఖ్యానించారు. 48 గంటల్లో బెయిలవుట్ డీల్ కుదరవచ్చని తమ ప్రభుత్వం భావిస్తోందని.. రుణదాతలతో సంప్రదించి తగిన పరిష్కారం కోసం కృషిచేస్తామని చెప్పారు.

 

గ్రీస్ ఆర్థిక మంత్రి రాజీనామా...

బెయిలవుట్ షరతులకు రిఫరెండంలో గ్రీస్ ప్రజలు నో చెప్పినప్పటికీ ఆశ్చర్యకరమైన రీతిలో ఆ దేశ ఆర్థిక మంత్రి యానిస్ వరోఫాకిస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘గ్రీస్‌కు బెయిలవుట్ విషయంలో రానున్న రోజుల్లో జరిపే చర్చల్లో నేను పాల్గొనకూడదని యూరప్, యూరోజోన్ భాగస్వామ్యపక్షాల్లో కొందరు కోరుకుంటున్నారు. డీల్ కుదుర్చుకునే విషయంలో ప్రధానికి సహకరించాలన్నదే నా ఉద్దేశం. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నా’ అని యానిస్ పేర్కొన్నారు. రుణదాతలతో జరుపుతున్న సంప్రతింపుల్లో షరతులపై చాలాసార్లు గ్రీస్ ఆర్థిక మంత్రి తీవ్రంగా విభేదించడం గమనార్హం. కాగా, గ్రీస్ కొత్త ఆర్థిక మంత్రిగా యుక్లిడ్ సాకలోటస్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల మంత్రిగా వ్యవహరించిన ఆయన బెయిలవుట్ చర్చల్లో పాలుపంచుకున్నారు.



నేడు యూరోజోన్ సదస్సు..

బ్రసెల్స్/బెర్లిన్:
రిఫరెండం ఫలితాలపై చర్చించేందుకు నేడు(మంగళవారం) యూరోజోన్ నేతలతో సదస్సును నిర్వహించనున్నట్లు ఈయూ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ప్రకటించారు. ఈ  సదస్సుకు ముందు యూరోజోన్ ఆర్థిక మంత్రులు కూడా సమావేశం కానున్నారు. మరోపక్క, తాజా పరిణామాలపై జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్ ఆదివారం పొద్దుపోయాక టెలిఫోన్‌లో చర్చించుకున్నారని... రిఫరెండంలో గ్రీస్ ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని వారు అభిప్రాయపడినట్లు మెర్కెల్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. యూరోపియన్ కమిషన్(ఈసీ) కూడా ఇదే విధమైన ప్రకటనను విడుదల చేసింది.



ఈసీ ప్రెసిడెంట్ జీన్-క్లాడ్ జుంకర్, ఈసీబీ చీఫ్ మారియో డ్రాగి, యూరోజోన్ ఆర్థిక మంత్రుల బృందం హెద్ జెరోన్ డిసెల్‌బ్లోయెమ్‌లు రిఫరెండం తీర్పుపై సోమవారం చర్చించారు. కాగా, గ్రీస్‌తో తాజా చర్చలు జరిపేందుకు ప్రాతిపదిక ఏదీ లేదని మెర్కల్ ప్రతినిధి స్టెఫెన్ సీబెర్ట్ చెప్పారు. యూరోజోన్‌లో కొనసాగాలనుకుంటే, తాజా ప్రతిపాదనలతో గ్రీస్ ముందుకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top