ఆన్‌లైన్ స్టోర్స్‌లో పెట్టుబడుల ‘క్లిక్’

ఆన్‌లైన్ స్టోర్స్‌లో పెట్టుబడుల ‘క్లిక్’ - Sakshi


జోరే కారణం..

 ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం జోరు, ఖర్చుచేసే మధ్యతరగతి వర్గాలు పెరుగుతుండటం... యువత ఆన్‌లైన్ షాపింగ్‌కు మొగ్గుచూపుతుండటంతో భారత్‌లోనూ ఈ-కామర్స్ రంగం కళకళలాడుతోంది. ప్రస్తుతం దేశీ ఈ-కామర్స్ మొత్తం మార్కెట్ విలువ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. ఇందులో ఈ-రిటైలింగ్ పరిశ్రమ మార్కెట్ విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.18,000 కోట్లు)గా ఉంది. ఇది 2018 నాటికి ఏడింతలకు పైగా ఎగబాకి 22 బిలియన్ డాలర్లకు చేరవచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు.



 అపార అవకాశాలు...

 ఈ-కామర్స్ మార్కెట్‌ను మరీ ఎక్కువచేసి చూపుతున్నారన్న వాదనలు ఉన్నప్పటికీ.. స్టార్టప్‌లలో పెట్టిన పెట్టుబడులను ప్రస్తుతం వాటి వ్యాపారాలు, వేల్యుయేషన్స్‌తో పోలిస్తే చాలా చౌకగానే భావించవచ్చని కలారి క్యాపిటల్ అనే వీసీ సంస్థ అంటోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డాలర్ల(రూ.6,000 కోట్లు) ఆదా య మైలురాయిని అధిగమించగా... ఢిల్లీకి చెందిన మరో ఈ-రిటైలింగ్ అగ్రగామి స్నాప్‌డీల్ కూడా ఈ ఏడాది చివరికల్లా బిలియన్ డాలర్ల అమ్మకాల మార్కును అందుకోనుంది.



గతేడాది ఈ-కామర్స్ పరిశ్రమ 50 కోట్ల డాలర్ల(సుమారు రూ.3,000 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించింది. ఈ ఏడాది పెట్టుబడులు మరింత పెరిగే అవకాశాలున్నాయి. భారత్‌లోని టాప్-15 ఈ-కామర్స్ కంపెనీల వేల్యుయేషన్ 4.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా మింత్రాను  ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన డీల్‌లో ఇన్వెస్టర్లకు 5-10 రెట్ల లాభాలు వచ్చినట్లు పరిశ్రమ వర్గాల అంచనా. అయితే, కొందరు విశ్లేషకులు మాత్రం మార్కెట్‌తో పోలిస్తే ప్రస్తుతం కంపెనీల వేల్యుయేషన్స్ మరీ ఎక్కువగా ఉన్నాయని భిప్రాయపడుతున్నారు.



అన్‌లిస్టెడ్ సోషల్‌నెట్‌వర్కింగ్ అప్లికేషన్(యాప్) వాట్స్‌యాప్‌ను ఫేస్‌బుక్ ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకు కొనుగోలు చేయడం తెలిసిందే. ఇంత ఎక్కువ వేల్యుయేషన్‌కు భారీగా యాక్టివ్ వినియోగదారుల సంఖ్య, భవిష్యత్తులో మరింత వ్యాపార విస్తరణకు అవకాశమే కారణం. ఇప్పుడు మన ఈ-కామర్స్ కంపెనీల వేల్యుయేషన్స్ పెరగడానికి ఇలాంటి అంశాలే దోహదం చేస్తున్నాయనేది నిపుణులు మాట.



    విస్తరిస్తున్న వ్యాపారం..

ఆన్‌లైన్ గ్రాసరీ స్టోర్ బిగ్‌బాస్కెట్ రూ.240 కోట్లను సమీకరించే యత్నాల్లో ఉంది. కంపెనీ విలువ బిలియన్ డాలర్లు(రూ.6,000 కోట్లు) ఉంటుందని తాజా అంచనా.



టీవీ, ఆన్‌లైన్ షాపింగ్‌స్టోర్ నాప్‌తోల్ కూడా సుమారు రూ. 240 కోట్లను ప్రైవేటు ఈక్విటీ(పీఈ)/వెంచర్‌క్యాపిటల్(వీసీ) ఫండ్స్ నుంచి సమీకరించాలని భావిస్తోంది.



ఫ్లిప్‌కార్ట్‌లో డీఎస్‌టీ గ్లోబల్ అనే పీఈ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో తాజాగా 21 కోట్ల డాలర్లను(సుమారు రూ.1,260 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటికే టైగర్ గ్లోబల్, నాస్పెర్స్, ఐకోనిక్ క్యాపిటల్ ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారులుగా ఉన్నాయి.

 

 సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్న దేశీ ఈ-కామర్స్ రంగంలోకి పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తుతోంది. అత్యంత ఆకర్షణీయమైన స్టార్టప్ పరిశ్రమగా నిలుస్తున్న ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్‌కు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ప్రతిరోజూ కనీసం రెండు కొత్త ఈ-రిటైలింగ్ వెంచర్లు పుట్టుకొస్తుండటమే దీనికి నిదర్శనం. అత్యుత్తమ పనితీరు, ఆదాయాల జోరున్న ఆన్‌లైన్ రిటైల్ కంపెనీల్లో డాలర్లను మరింతగా కుమ్మరించేందుకు ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ ముందుకొస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీల వేల్యుయేషన్స్(విలువ) కూడా అంతకంతకూ దూసుకెళ్తున్నాయి. ఆయా కంపెనీలపై ఆన్‌లైన్ కస్టమర్లు ఉంచుతున్న భరోసాయే దీనికి దోహదం చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top