రెండేళ్లలో డాక్టర్ రెడ్డీస్ మార్జిన్ గెడైన్స్ 25%

రెండేళ్లలో డాక్టర్ రెడ్డీస్ మార్జిన్ గెడైన్స్ 25% - Sakshi


సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్: ఫార్మా వ్యాపారంలో లాభదాయకత పెంచేందుకు తక్కువ మార్జిన్లున్న ఉత్పత్తులను వదిలించుకొని, వ్యయాలను నియంత్రించేందుకు నిర్మాణాత్మక  వ్యూహ రచన చేస్తున్నామని  డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మార్జిన్ గెడైన్స్ 25 శాతంగా లక్ష్యం పెట్టుకున్నామన్నారు.



ప్రధమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో  మరిన్ని కొత్త ఔషధ ఉత్పత్తులు మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని బుధవారం రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత వివిధ ఈక్విటీ రీసెర్చ్ సంస్థలకు చెందిన విశ్లేషకులతో జరిపిన కాన్ఫరెన్స్‌కాల్‌లో ఆయన  ఈ విషయం వెల్లడించారు.డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్‌కు నోటి ద్వారా తీసుకునే మందుల (ఓరల్ సాలిడ్స్) తయారీ సంస్థగా మార్కెట్లో పేరుంది.



అయితే  దీనికి భిన్నంగా కొన్నేళ్లుగా ఇన్‌జెక్టబుల్స్‌పై దృష్టి పెట్టామని, ఈ ఏడాది ఫైల్ చేసిన 11 ఏఎన్‌డీఏ (అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్)లలో 50 శాతం ఇంజెక్టబుల్స్, టాపికల్స్, ప్యాచెస్, సాఫ్ట్ జెల్స్ ఉన్నాయని అభిజిల్ ముఖర్జీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఏడాది 60 శాతానికి పెరుగుతుందని, దీని వల్లనే పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) వ్యయాలు పెరుగుతున్నాయన్నారు. చర్మ వ్యాధుల చికిత్సలో వాడే ఔషధాల తయారీలో పోటీ తక్కువగా ఉండటంతో పాటు లాభదాయకత అధికంగా ఉండటంతో ఆ మార్కెట్‌పై దృష్టి పెట్టామన్నారు.



వెనిజులా ప్రధాన మార్కెట్?

అమెరికా, రష్యా తర్వాత  వెనిజులా దేశం తమకు  అత్యంత ప్రధాన మార్కెట్‌గామారిందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధామార్థంతో పోలిస్తే ద్వితీయార్థం ఫలితాలు మరింత   ఆశాజనకంగా ఉంటాయన్నారు. అమెరికా మార్కెట్లో సరఫరా చేస్తున్న  జనరిక్ ఔషధాల ధరలు గత రెండేళ్లలో అనూహ్యంగా పెరగడంపై దర్యాప్తు కోరుతూ అక్కడి ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన వివాదాస్పద  అంశాలపై సాధికార వివరణలిచ్చామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సౌమెన్ చక్రవర్తి తెలిపారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top