గణాంకాల గుబుల్..!

గణాంకాల గుబుల్..! - Sakshi


దేశీ, విదేశీ గణాంకాలతో స్టాక్ మార్కెట్ కుదేల్

- పతన బాటలోనే అన్ని రంగాల సూచీలు

- ఇంట్రాడేలో 703 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

- 587 పాయింట్ల నష్టంతో 25,696 వద్ద ముగింపు

- ఒక దశలో 224 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

- 185 పాయింట్ల క్షీణతతో 7,786 వద్ద ముగింపు


కీలక పరిశ్రమల వృద్ధితో పాటు జీడీపీ కూడా అంచనాలు తప్పటం స్టాక్ మార్కెట్లను ఆందోళనలో పడేసింది. చైనా ఆర్థిక వ్యవస్థపై భయాలను పెంచేలా వెలువడిన మరో రెండు రకాల గణాంకాలు ఈ ఆందోళనలను ఎగదోసి... మంగళవారం స్టాక్ మార్కెట్‌ను పడగొట్టాయి. అంతర్జాతీయంగా వృద్ధి మధ్యస్థంగానే ఉంటుందన్న ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టినా లగార్డె వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.



దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 587 పాయింట్ల నష్టంతో 25,696 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 185 పాయింట్లు(2.33 శాతం) క్షీణించి 7,786  పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది దాదాపు ఏడాది కనిష్ట స్థాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల పాలయ్యాయి. బ్యాంక్‌లు బాగా పతనమయ్యాయి. లోహ, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ, వాహన, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లు నష్టపోయాయి. దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల కారణంగా మార్కెట్ నష్టాలు కొంత రికవరీ అయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 25,580 పాయింట్లకు పడిపోయింది. ఇది సోమవారం నాటి ముగింపుతో పోల్చితే 703 పాయింట్ల నష్టం.  ఇంట్రాడేలో  నిఫ్టీ 7,747 పాయింట్లను తాకింది. ఇది సోమవారం నాటి ముగింపుతో పోల్చితే 224 పాయింట్ల నష్టం కావటం గమనార్హం.

 

సన్ ఫార్మా ఒక్కటే..,

గ్లాక్సోస్మిత్‌లైన్ (జీఎస్‌కే) ఆస్ట్రేలియా ఓపియేట్స్ వ్యాపార విభాగం విలీనం పూర్తవటంతో సన్ ఫార్మా స్వల్పంగా లాభపడి రూ.901 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో లాభపడ్డ షేర్ ఇదొక్కటే. ఫిచ్ రేటింగ్స్ సంస్థ వయబిలిటి రేటింగ్‌ను తగ్గించడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ 7 శాతం తగ్గింది. ఆగస్టు వాహన విక్రయాలు అంచనాలను అందుకోలేకపోవడంతో మారుతీ 2.6%, ఎంఅండ్‌ఎం 3.8% చొప్పున నష్టపోయాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనతో వేదాంత, హిందాల్కో, టాటా స్టీల్ 4-5% రేంజ్‌లో నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.675 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.682 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

 

బ్యాంక్ షేర్లు బేర్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేస్‌రేట్‌ను తగ్గించింది. మరికొన్ని బ్యాంకులు కూడా బేస్‌రేట్‌ను తగ్గిస్తాయని, దీంతో బ్యాంకుల మార్జిన్లు తగ్గుతాయనే అంచనాలతో బ్యాంక్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు కీలక పరిశ్రమల వృద్ధి పడిపోవడం కూడా బ్యాంక్ షేర్లపై ప్రభావం చూపింది. యాక్సిస్ బ్యాంక్ 5.2 శాతం నష్టపోగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతం వరకూ దిగజారాయి.

 

ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం...

లండన్: చైనా భయాలు, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన ఆందోళనలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఆసియా, యూరోప్, అమెరికా మార్కెట్లు నష్టాలబాటలో ఉన్నాయి. జపాన్‌కు చెందిన నికాయ్ 4 శాతం, చైనా షాంఘై స్టాక్ సూచీ 1.2 శాతం(ఈ సూచీ ఒక దశలో 4 శాతం నష్టపోయింది), సిడ్ని 2.2 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2.2 శాతం చొప్పున పడిపోయాయి. ఇక యూరప్ మార్కెట్ల విషయానికొస్తే, జర్మనీకి చెందిన డ్యాక్స్ 2.4 శాతం, ఇంగ్లాండ్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 3.1 శాతం, ప్రాన్స్‌కు చెందిన సీఏసీ 2.4 శాతం చొప్పున క్షీణించాయి. అమెరికా స్టాక్ మార్కెట్ విషయానికొస్తే డోజోన్స్,నాస్‌డాక్‌లు చెరో  2.5 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

 

భారీ నష్టాలు ఎందుకంటే..

- గత క్యూ1లో 7.5 శాతంగా ఉన్న జీడీపీ ఈ క్యూ1లో 7 శాతానికే పరిమితమయింది.

- ఈ ఏడాది జూన్‌లో 3%గా ఉన్న 8 కీలక పరిశ్రమల వృద్ధి... జూలైలో 1.1 శాతానికి పడిపోయింది.

- జూలైలో 50గా ఉన్న చైనా అధికారిక తయారీ రంగ పీఎంఐ... ఆగస్టులో 49.7కు పడిపోయింది. ఇక ఫైనల్ కియాక్సిన్/మార్కిట్ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ 47.3కు పడిపోయింది. చైనాకు సంబంధించి వెలువడిన ఈ రెండు మాన్యుఫాక్చరింగ్ పీఎంఐలు చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలను మరింత పెంచాయి. ఎందుకంటే ఈ సూచీ 50 కన్నా దిగువనుంటే మందగమనం కిందే లెక్క.

- భారత స్టాక్ మార్కెట్లో కీలకంగా వ్యవహరించే విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టు నెలలో రూ.17,000 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. 1997 నుంచి చూస్తే ఇదే రికార్డ్ స్థాయి నికర అమ్మకాలు.

- అంతర్జాతీయంగా వృద్ధి మధ్యస్థంగానే ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎండీ క్రిస్టినా లగార్డె చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రికవరీ బలహీనంగా ఉందని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధి మందగిస్తోందని ఆమె పేర్కొన్నారు.

- ఆర్థిక గణాంకాలు బాగుండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలోనే వడ్డీరేట్లు పెంచే అవకాశాలున్నాయన్న అంచనాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి.

- చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళన, లాభాల స్వీకరణతో చమురు ధరలు 7% వరకూ పడిపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top