చికెన్ లెగ్స్ స్వేచ్ఛా దిగుమతులు వద్దు

చికెన్ లెగ్స్ స్వేచ్ఛా దిగుమతులు వద్దు


కేంద్ర ప్రభుత్వానికి నెక్ వినతి

హైదరాబాద్: అమెరికా నుంచి ఎలాంటి సుంకాలు లేకుండా చికెన్ లెగ్ పీసుల దిగుమతికి విదేశీ వ్యవహారాల శాఖ ప్రతిపాదించినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై నెక్ ఆందోళన వెలిబుచ్చింది. భారత్ నుంచి బాస్మతి బియ్యం, పండ్లు దిగుమతి చేసుకోవడంతో పాటు ఐటీ నిపుణులకు దోహదపడేలా వలస సంస్కరణలను అమెరికా అమలు చేస్తే చికెన్ లెగ్ పీసుల స్వేచ్ఛా దిగుమతికి అనుమతిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలా చేయడం వల్ల భారత్‌లోని 50 లక్షల మందికిపైగా పౌల్ట్రీ రైతులు, ఈ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది తీవ్రంగా నష్టపోతారని నెక్ ఓ ప్రకటనలో పేర్కొంది.



ఇతర ఉత్పత్తుల ఎగుమతి కోసం, ఐటీ నిపుణుల ప్రయోజనాల కోసం పౌల్ట్రీ రైతుల జీవితాలను పణంగా పెట్టడం తగదని తెలిపింది. ‘అమెరికా ప్రజలు చికెన్ బ్రెస్ట్‌ను మాత్రమే అధికంగా తింటారు. లెగ్‌పీసులకు గిరాకీ అతి తక్కువ. అక్కడ కిలో చికెన్ ధర 4 డాలర్లు, బ్రెస్ట్ మీట్ 7.9 డాలర్లుగా ఉంది. చికెన్ లెగ్స్‌కు డిమాండు లేకపోవడంతో లెగ్ పీసులను కిలో 40-80 సెంట్ల కంటే తక్కువ రేటుకే ఎగుమతి చేస్తారు. చికెన్ బ్రెస్ట్ విక్రయంతోనే అమెరికా పౌల్ట్రీ రైతులకు తగినన్ని లాభాలు వస్తాయి.



లెగ్ పీసులంటే దాదాపు వృథాకిందే లెక్క. ఎలాంటి సుంకాలు లేకుండా వాటిని దిగుమతి చేసుకోవడమంటే దేశీయ పౌల్ట్రీ రంగాన్ని చావుదెబ్బతీయడమే. పౌల్ట్రీ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తుంది. కానీ భారత్‌లో మాత్రం పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. ఈ నేపథ్యంలో చికెన్ లెగ్స్ దిగుమతులపై సుంకాలను తగ్గించవద్దు. అంతేకాదు, దేశీయ పౌల్ట్రీ రైతుల ప్రయోజనాల దృష్ట్యా చికెన్ లెగ్స్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం విధించాలి’ అని ప్రభుత్వానికి నెక్ విజ్ఞప్తి చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top