విడాకులు తప్పకుంటే... ఆ తప్పులు చేయొద్దు

విడాకులు తప్పకుంటే... ఆ తప్పులు చేయొద్దు


స్థూలంగా గుర్తుంచుకోతగినవి..



♦ కుటుంబం ఆస్తులు, అప్పులను విశ్లేషించుకోవాలి.

♦ అన్ని ఆర్థిక, ఆస్తి పత్రాలు దగ్గర ఉంచుకోవాలి.

♦ ఉమ్మడివైనా, వ్యక్తిగతమైనవైనా అన్ని అప్పులను మదింపు చేసుకోవాలి.

♦ కట్టాల్సిన పన్నులు, బకాయిలు వంటి వాటి గురించి అవగాహన ఉండాలి.


 

 మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్.. అన్నది చాలా ప్రాచుర్యం పొందిన నానుడి. నిజమే. కానీ స్వర్గంలో రాసిపెట్టిన వైవాహిక బంధం .. దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని సందర్భాల్లో కలకాలం సాగకపోవచ్చు. అనేకానేక కారణాలు.. విడాకులకు దారి తీయొచ్చు. ఇలాంటప్పుడు తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంది. మానసికంగానే కాకుండా ఆర్థికంగానూ అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఆర్థికాంశాల విషయానికొస్తే..  ఆస్తుల పంపకాలు, ఉమ్మడిగా నెరవేర్చాల్సిన బాధ్యతలు, తీర్చాల్సిన అప్పులు చాలా ఉంటాయి. దీర్ఘకాలంలో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించేదే ఈ కథనం.



 విడాకుల పరిస్థితి తలెత్తినప్పుడు అన్నింటికన్నా ముందుగా.. కుటుంబం ఆస్తులు, అప్పుల గురించి అవగాహన ఉండాలి. వ్యక్తిగతంగా మీ ఆదాయం, మీతో పాటు మీ జీవిత భాగస్వామి ఆదాయాలు (ఒకవేళ వారు కూడా ఆర్జిస్తున్న పక్షంలో), మొత్తం అప్పుల గురించి తెలిసి ఉండాలి. దీనివల్ల విడాకుల తర్వాత మీ చేతికి వచ్చేదేమిటీ అన్న దానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆ తర్వాత మీరు అలవాటుపడిన జీవనవిధానాన్ని ఇకపై కూడా యథాప్రకారం కొనసాగించేందుకు ఎంత మేర నగదు అధికంగా అవసరమవుతుందో లెక్కించుకోవాలి. విడాకుల ద్వారా వచ్చేది (ఆస్తుల పంపకం), మీ ఆదాయం.. వీటన్నింటినీ లెక్కవే సుకున్నాక, నగదు అవసరాల్లో వాటికి తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసుకోవాలి.



 భవిష్యత్‌లో ఇతరత్రా సమస్యేమీ తలెత్తకుండా ఆస్తులు మొదలైన వాటికి సంబంధించి జాయింట్‌గా ఉన్నవైనా, సింగిల్‌గా ఉన్నవైనా... అన్ని ఆర్థిక పత్రాలు దగ్గర ఉంచుకోవాలి. ఇవన్నీ తర్వాతెప్పుడైనా కూడా అవసరం పడొచ్చు గనుక వీటిని సురక్షితమైన చోట భద్రంగా ఉంచాలి. వివాహం ద్వారా వచ్చిన ఆస్తి, వారసత్వంగా వచ్చే ఆస్తి సంబంధిత చట్టాల గురించి కూడా అవ గాహన ఉండాలి. ఆస్తి పత్రాలు దగ్గర ఉంటే యాజమాన్య హక్కులను గురించి చింతించనక్కర్లేదు. న్యాయపరమైన అడ్డంకులేమైనా ఉన్నా అధిగమించవచ్చు. ఇక్కడో విషయం. డైవర్స్ ద్వారా వచ్చే ఆస్తులు, ప్రాపర్టీలు అన్నీ కూడా ఉపయోగకరమేనని భావించడానికి లేదు. ఉదాహరణకు, మీ వాటా కింద పెద్ద ఇల్లు వచ్చిన పక్షంలో చూడటానికి బాగానే ఉంటుంది. కానీ భారీ భవంతికి.. మెయింటెనెన్స్ ఖర్చులూ భారీగానే ఉంటాయని గుర్తుంచుకోవాలి. అంతే గాదు దానిపై రుణ బకాయిలేమైనా ఉన్నా కూడా సమస్యే.



 ఎవరి బకాయిలెంత..

 కొన్నిసార్లు జీవిత భాగస్వాములిద్దరూ కట్టాల్సిన రుణాలు ఉంటాయి. భార్యాభర్తలిద్దరూ కలసి తీసుకున్న గృహ రుణం లాంటివి ఈ కోవకి వస్తాయి. ఒకోసారి వ్యక్తిగత రుణాలు లాంటివి ఉండొచ్చు. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై కట్టాల్సిన బాకీల్లాంటివి. ఇవన్నింటి గురించి కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎవరెవరికి ఎవరు ఎంతెంత కట్టాల్సి ఉంటుందన్నది లెక్క వేసుకోవాలి.  ఇవి గాకుండా, పన్నుపరమైన బాధ్యతలు కొన్ని ఉంటాయి. మీ భాగస్వామి ఆర్థిక స్థితిగతులు, పన్నుల రికార్డులు మొదలైనవన్నీ మదింపు చేసేందుకు సమర్థులైన ఆడిటర్ సహకారం తీసుకోవడం మంచిది. దీనివల్ల భవిష్యత్‌లో పన్ను బకాయిల్లాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడొచ్చు. అలాగే ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు సదరు భాగాలపై వర్తించే పన్నులు, ఎవరు ఎంత కట్టాల్సి ఉంటుందనేది కూడా ముందుగానే నిర్ధారించుకోవాలి.



 ఒకవేళ జాయింట్ బ్యాంకు అకౌంటు ఉండి, ఇతరత్రా ఆస్తులు, క్రెడిట్ కార్డులు మొదలైనవి దానికే అనుసంధానమై ఉంటే మరికొన్ని అంశాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఖాతాను వేరు చేసి, ఆస్తులను పంచుకున్నప్పుడు క్రెడిట్ స్కోర్లు, క్రెడిట్ కార్డుల పరిమితులు మొదలైనవన్నీ కూడా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, జాయింట్ అకౌంటుతో పాటు ఎవరికి వారికి తమ ప్రత్యేక బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డుల్లాంటివి ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తవు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top