వృద్ధాప్యంలో దర్జా జీవితం!

వృద్ధాప్యంలో దర్జా జీవితం!


► రిటైర్మెంట్‌ హోమ్స్‌.. పెద్దల కోసం ప్రత్యేక గృహాలు

► విస్తీర్ణం నుంచి వసతుల వరకూ అన్నీ ప్రత్యేకమే

► పదవీ విరమణ కంటే పదేళ్ల ముందు కొంటేనే బెటర్‌




సాక్షి, హైదరాబాద్‌ : ఎప్పుడూ కష్టపడటమే. చిన్నప్పుడు చదువుకోసం.. ఆ తరువాత కెరీర్‌ కోసం.. కెరీర్‌లో స్థిరపడ్డాక కుటుంబం కోసం.. ఆ తరువాత పిల్లల కోసం.. ఇక విశ్రాంతెక్కడ? రిటైర్మెంట్‌ అన్నది అందుకే కావచ్చు. అయితే నిజంగానే విశ్రాంత జీవితం ప్రశాతంగా సాగుతోందా? చాలామంది వృద్ధుల విషయంలో లేదనే సమాధానమే వస్తోంది.


దీనికి పరిష్కారం చూపిస్తున్నాయి నిర్మాణ సంస్థలు. పిల్లలు తమ దగ్గరున్నా లేకున్నా తమ లాంటి వారి మధ్య, సకల సౌకర్యాలతో ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే వారికోసం రిటైర్మెంట్‌ హోమ్స్‌ను నిర్మిస్తున్నాయి.  లగ్జరీతో పాటు ఆరోగ్యం, ఆనందం, శాంతి భద్రతలు, ప్రేమానురాగాలు కలిసిన ఈ రిటైర్మెంట్‌ హోమ్స్‌పై ‘సాక్షి రియల్టీ’ ఈవారం ప్రత్యేక కథనం.



వృద్ధాశ్రమాలతో పోలికే లేదు...

రిటైర్మెంట్‌ హోమ్స్‌ గురించి విన్నవారెవరైనా... వృద్ధాశ్రమాల్లాంటివేగా...!! అని అనుకోవచ్చు. కానీ ఈ రెండింటికీ ప్రధానమైన తేడా ఏంటంటే ఈ రిటైర్మెంట్‌ హోమ్స్‌లో ఫ్లాట్‌ కొన్నవారో లేకపోతే అద్దెకు తీసుకున్నవారో మాత్రమే ఉంటారు. నిర్వహణ రుసుం చెల్లించి అన్ని సౌకర్యాలూ పొందవచ్చు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే అపార్ట్‌మెంట్‌లోనే ప్రాథమిక చికిత్సా కేంద్రం ఉంటుంది. 24 గంటలు అంబులెన్స్, రెసిడెంట్‌ నర్సు, వైద్యుడు అందుబాటులో ఉంటారు.


అనారోగ్యం తలెత్తితే క్షణాల్లో దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్తారు. వారానికోసారి డాక్టరొచ్చి అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు కూడా. నడక కోసం గ్రీన్‌ స్పేస్‌తో పాటు హాబీ సెంటర్, కమ్యూనిటీ కిచెన్, స్విమ్మింగ్‌ పూల్, యోగా కేంద్రాలు, ఏటీఎం, సూపర్‌ మార్కెట్,  గ్రంథాలయం వంటి సౌకర్యాలన్నీ రిటైర్మెంట్‌ హోమ్స్‌లో ఉంటున్నాయి. నివాసితులు బృందాలుగా ఏర్పడి సంఘసేవ, గార్డెనింగ్‌ చేయొచ్చు. అపార్ట్‌మెంట్‌ వాహనంలో పుణ్యక్షేత్రాలు, విహార  యాత్రలకు కూడా వెళ్లొచ్చు. ఇక వినోదానికి ఇండోర్‌ థియేటర్, ఓపెన్‌ థియేటర్‌లు సైతం వీటిలోనే ఉంటాయి.



క్రమం తప్పని మెనూ..

రిటైర్మెంట్‌ హోమ్స్‌లో వృద్ధులు వంట చేసుకోనక్కర్లేదు. ఉదయం 5 గంటల కల్లా టీతో మొదలుపెట్టి... టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, బిస్కెట్లు, రాత్రి భోజనం ఇలా అన్నీ సరైన వేళల్లో అందిస్తారు. మెస్‌కు వచ్చి భోజనం చేయలేని వారికి ఫ్లాట్‌కే పంపిస్తారు. కావాల్సిన వారికి ఇంట్లోనే పైపులైన్లో గ్యాస్‌ అందుబాటులో ఉంటుంది. కరెంటు పొదుపు, వ్యర్థాలను మళ్లీ వాడటం, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా నీటిని శుద్ధి చేయడం వంటివి మామూలే. ఇంట్లో పనులకు, బట్టలు ఉతకడానికి ప్రత్యేకించి పనిమనుషులుంటారు.



నిర్మాణంలోనే ప్రత్యేక ఏర్పాట్లు...

నిర్మాణ సమయంలోనే ఈ ఫ్లాట్లను వృద్ధులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతారు. ఇవి ఐదు అంతస్తుల్ని మించవు. వెడల్పాటి తలుపులు, పెద్ద బాత్రూమ్‌లు, వీల్‌ చైర్స్‌ వెళ్లేలా మెట్లు, విశాలమైన లిఫ్ట్‌లుంటాయి. మోకాళ్ల నొప్పులున్న వారికి ఫ్లాట్స్‌లో ప్రత్యేకమైన టాయ్‌లెట్స్‌ ఉంటాయి. బాత్రూమ్, బెడ్‌ రూమ్, కారిడార్లలో గ్రాబ్‌ బార్స్‌తో పాటు అత్యవసర సమయాల్లో వినియోగించే ప్యానిక్‌ బజర్లూ ఉంటాయి. గ్రాబ్‌ బార్స్‌తో వృద్ధులు సులువుగా నడవటం, కూర్చోవటం చేయొచ్చు. ప్రాజెక్ట్‌ అంతా యాంటీ స్కిడ్‌ ఫ్లోరింగే.



25 బిలియన్‌ డాలర్ల పరిశ్రమ!

ప్రాపర్టీ కన్సల్టెన్సీ జోన్స్‌లాంగ్‌ లాసెల్లె అంచనా ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా రిటైర్మెంట్‌ హోమ్స్‌ మార్కెట్‌ విలువ ఏకంగా 25 బిలియన్‌ డాలర్లు. అమెరికాలోని సీనియర్‌ సిటిజన్స్‌లో 12 శాతం మంది వీటిలోనే ఉంటున్నారు. ఆస్ట్రేలియాలో వీరి వాటా 4 శాతం. 100 కోట్ల జనాభా దాటిన మన దేశంలో 3 లక్షల రిటైర్మెంట్‌ హోమ్స్‌ అవసరమవుతాయని, వీటి విలువ బిలియన్‌ డాలర్ల పైనేనన్నది విశ్లేషకుల అంచనా. మనదేశంలో 60 ఏళ్లకు పైబడిన వారి జనాభా దాదాపు 10 కోట్లు. ఏటా 3.8 శాతం పెరుగుతోంది. దీంతో 2050 నాటికి 24 కోట్లకు చేరుతుందని అంచనా. భవిష్యత్తులో దేశంలో రిటైర్మెంట్‌ హోమ్స్‌కు ఉండబోయే డిమాండ్‌కు ఈ అంకెలే నిదర్శనం.



పదేళ్ల ముందు కొంటే మంచిది...!

రిటైరవటానికి 5–10 ఏళ్ల ముందు ఈ హోమ్స్‌ను కొంటే చాలనేది నిపుణుల సూచన.  ఎందుకంటే వివిధ కారణాల వల్ల రియల్టీ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. అలాకాక 60 ఏళ్లు దాటాక కొనుగోలు చేస్తే గృహ రుణం పొందటం కష్టం. పొందినా ఈఎంఐల భారం ఎక్కువ. అధిక ఫ్లాట్‌ విస్తీర్ణాలతో పాటు ప్రత్యేక వసతులుంటాయి కనక సాధారణ ఫ్లాట్లతో పోలిస్తే రిటైర్మెంట్‌ హోమ్స్‌ ధర 10–15%ఎక్కువగా ఉంటుంది. వీటిని ఏ వయసువారైనా కొనొచ్చు. కానీ వాటిలో ఉండాలంటే 55 ఏళ్లు దాటాల్సిందే. ఒకవేళ భవిష్యత్‌ కోసం చిన్న వయసు వారు కొంటే.. దాన్ని 55 ఏళ్లు దాటినవారికి అద్దెకో, లీజుకో ఇవ్వొచ్చు. ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సీనియర్‌ సిటిజన్స్‌కే అమ్మాలి.  



దీన్ని మరిచిపోవద్దు సుమా!

రిటైర్మెంట్‌ హోమ్స్‌లోని ప్రత్యేక వసతుల నిమిత్తం ముందుగా ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు. ప్రాజెక్టు పూర్తయితే బిల్డరే నిర్వహణకు ముందుకొస్తారు. ఒకవేళ రాకున్నా... ఫ్లాట్‌ ఓనర్ల అసోసియేషన్‌ ఈ నిర్వహణను చేపడుతుంది. అయితే ఇక్కడొకటి గుర్తుంచుకోవాలి. సాధారణ ప్రాజెక్ట్‌లతో పోలిస్తే రిటైర్మెంట్‌ హోమ్స్‌ను విక్రయించడం కాస్త కష్టమే. ఎందుకంటే వీటి నిర్వహణ వ్యయం ఎక్కువ.  పైపెచ్చు నిర్వహణ సరిగ్గా లేకుంటే ధర కూడా పడిపోతుంటుంది. సాధారణ నివాస ప్రాజెక్ట్‌లతో పోలిస్తే వీటి నిర్వహణ చార్జీలు 40–50 శాతం ఎక్కువ. దాదాపు నెలకు చదరపు అడుక్కి రూ.8–10 వరకూ వసూలు చేస్తుంటారు.



రిటైర్మెంట్‌ హోమ్స్‌కు ప్రణామ్‌!

రిటైర్మెంట్‌ హోమ్స్‌ను హైదరాబాద్‌కు పరిచ యం చేసింది కాప్రా కేం ద్రంగా పనిచేస్తున్న సాకేత్‌ గ్రూప్‌ అనే చెప్పాలి. ఈసీఐఎల్‌ సమీపంలోని 5 ఎకరాల్లో ప్రణామ్‌ పేరుతో ఐదేళ్ల కిందటే రిటైర్మెంట్‌ హోమ్స్‌ను నిర్మించింది. 3 బ్లాకుల్లో మొత్తం 375 ఫ్లాట్లను నిర్మించింది. ‘ప్రణామ్‌ అంటే నమస్కారం. అందుకే దీనికి ఆ పేరు పెట్టామని కంపెనీ డైరెక్టర్‌ రవికుమార్‌ చెప్పారు. ప్రస్తుతం గౌడవెల్లిలో నిర్మిస్తున్న భూఃసత్వా ప్రాజెక్ట్‌లోనూ రిటైర్మెంట్‌ హోమ్స్‌ను నిర్మించాలని నిర్ణయించాం. 6 ఎకరాల్లో 480 ఫ్లాట్లొస్తాయి. అనుమతుల కోసం చూస్తున్నాం. సెప్టెంబర్‌లో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.



ఇతర నగరాల్లోనూ జోరు...

పరంజపే స్కీమ్స్‌ కన్‌స్ట్రక్షన్స్, ఆషియానా హౌసింగ్, అదానీ రియల్టీ, టాటా హౌసింగ్, సిల్వర్‌ గ్రేడ్స్, బ్రిగేడ్, మ్యాక్స్‌లు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, పూణె నగరాల్లో రిటైర్మెంట్‌ హోమ్స్‌ నిర్మిస్తున్నాయి. ఆషియానా హౌసింగ్‌ పుణె, ఢిల్లీ ఎన్‌సీఆర్, జైపూర్, చెన్నైల్లో పెద్దల గృహాలను నిర్మిస్తోంది.    



హయత్‌నగర్‌లో బృందావన్‌ మిడోస్‌

సాక్షి, హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలంలోని సాహెబ్‌నగర్‌లో ఎస్‌వీఎస్‌ అండ్‌ ఏఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ బృందావన్‌ మిడోస్‌ పేరిట లే అవుట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ గేటెడ్‌ కమ్యూనిటీలో 30, 40, 60 ఫీట్ల అంతర్గత రోడ్లతో పాటూ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్, వీధి లైట్లు, గ్రీనరీ వంటి అన్ని రకాల వసతులను అభివృద్ధి చేస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈఎంఐ, బ్యాంకు రుణ సదుపాయాలను కూడా కల్పిస్తున్నామన్నారు.



సుఖీభవ ప్రాపర్టీస్‌కు ప్రతిభా పురస్కారం...

సాక్షి, హైదరాబాద్‌: పద్మమోహన ఆర్ట్స్‌ సంస్థ 27వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సినీ నిర్మాత, ప్రముఖ నిర్మాణ సంస్థ సుఖీభవ ప్రాపర్టీస్‌ సీఎండీ ఏ గురురాజ్‌కు పద్మమోహన్‌ ప్రతిభా పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 27 ఏళ్లుగా స్థిరాస్తి రంగంలో అందించిన సేవలకు గాను ఈ అవార్డు వరించిందన్నారు.


వెంచర్ల విషయానికొస్తే.. ప్రస్తుతం రాయగిరిలో 150 ఎకరాల్లో వనమాలి టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మొత్తం వెయ్యి ప్లాట్లుంటాయి. 100, 133, 150, 200, 300 గజాల్లో ప్లాట్లను కొనుగోలు చేయవచ్చు.  400 ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ధర గజానికి రూ.3,150. రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధి 95 శాతం పూర్తయింది. ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి రిసార్ట్‌ మెంబర్‌ ఉచితంగా అందిస్తాం. విజయ దశమి నాటికి మరో నాలుగు వెంచర్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.



28, 29న న్యూఢిల్లీలో  నరెడ్కో 14వ జాతీయ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) 14వ జాతీయ సమావేశం ఈనెల 28, 29 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ‘ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌–అన్‌ఫోల్డింగ్‌ ది న్యూ ఎరా ఆఫ్‌ గ్రోత్‌’ అనే అంశంపై ఈ సదస్సును నిర్వహించనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో ప్రముఖ స్థిరాస్తి సంస్థల ప్రతినిధులతో పాటూ ఈక్విటీ ఇన్వెస్టర్లు, పాలసీ రూపకర్తలు, నిపుణులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరెడ్కో చాప్టర్ల నుంచి సుమారు 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top