‘క్యాష్‌లెస్‌’ కాస్త ఖరీదే!!

‘క్యాష్‌లెస్‌’ కాస్త ఖరీదే!!


డిజిటల్‌ చెల్లింపుల్లో పెరుగుతున్న సమస్యలు

కార్డులు, వాలెట్లు, నెట్‌ బ్యాంకింగ్‌కు చార్జీలు

కార్డులపై చెల్లింపులకు ఏకంగా 2 శాతంపైనే

వాలెట్లో డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే తంటా

నెట్‌ సహా అన్ని లావాదేవీల్లో వైఫల్యాలు

ట్రాన్సాక్షన్‌ పూర్తి కాదు.. ఖాతాలో డబ్బులేమో మాయం

ఎక్కడికి వెళ్లాయో అర్థమవ్వదు;ఎవరినీ సంప్రదించాలో తెలీదు

కొత్త మాధ్యమాలకు కరవైన నిబంధనలు

సామాజిక మాధ్యమాలను ఆశ్రయించాలంటున్న నిపుణులు  




నిజం!! ఇది డిజిటల్‌ యుగం. మీడియా నుంచి ఆర్థిక లావాదేవీల దాకా అన్నీ డిజిటల్‌ మయమే. అందుకే ప్రభుత్వం కూడా చలామణిలో ఉన్న కరెన్సీని ఒక్కసారిగా రద్దు చేసి డిజిటల్‌ లావాదేవీల ప్రచారం మొదలుపెట్టింది. కరెన్సీ పెద్దగా అందుబాటులో లేదు కనక జనం కూడా విధిలేక డిజిటల్‌ లావాదేవీల వైపు అడుగులేస్తున్నారు. కాకపోతే ఇంకా చాలామందికి మొబైల్‌ వాలెట్లు వాడేదెలా? దానికి చార్జీలేమైనా అవుతాయా? ఇంటర్‌ నెట్లో బ్యాంకింగ్‌ లావాదేవీలు ఎలా చేయాలి? ఒకవేళ మధ్యలో ఫెయిలైతే పరిస్థితేంటి? కార్డుల ద్వారా ఎవరికైనా చెల్లింపులు చేయొచ్చా? చార్జీలేమైనా భరించాల్సి ఉంటుందా? ఇలాంటి సందేహాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానమే ఈ వారం ప్రాఫిట్‌ ప్రధాన కథనం...



మొబైల్లోనే ఉంటుంది మీ వాలెట్‌...

సుజన ఆన్‌లైన్‌లో మొబైల్‌ ఫోన్‌ కొంటూ... మొబైల్‌ వాలెట్‌తో చెల్లించింది. లావాదేవీ పూర్తయినట్లు వాలెట్‌ ప్రొవైడర్‌ నుంచి సుజనకు మెయిల్‌ వచ్చింది. ఆన్‌లైన్‌ రిటైలర్‌ మాత్రం తనకు పేమెంట్‌ అందలేదన్నాడు. కాబట్టి ఫోన్‌ పంపలేదు. ఒక వారం గడిచింది. అయినా సుజన డబ్బులు ఆమె ఖాతాలోకి రాలేదు.

ఎవరికి చెప్పాలన్నది ఆమెకు తెలియలేదు.



ఏం చేయాలంటే..!

పేటీఎం సహా చాలా వాలెట్లు ఫిర్యాదులు తీసుకోవటానికి ఫోన్‌ నెంబరేమీ ఇవ్వటం లేదు. యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా మెయిల్‌ పంపటానికి మాత్రం అవకాశం ఇస్తున్నాయి. అంటే... మనం గట్టిగా ఎవరినీ అడగటానికి లేదు. మెయిల్‌ ఇవ్వటం... సమాధానం వచ్చేదాకా చూడటం.... అంతే చేయగలిగింది. అయితే చాలా వరకూ మెయిళ్లకు ఈ సంస్థలు స్పందించి లావాదేవీల్ని పరిష్కరిస్తున్నాయి.

‘‘లావాదేవీలు నిర్వహించే మాధ్యమాన్ని బట్టి లావాదేవీ సెటిల్‌మెంట్‌ ఉంటుంది. కొన్ని సార్లు ట్రాన్సాక్షన్లు ఫెయిలవుతాయి. ఇలాంటపుడు ఆ లావాదేవీ మొత్తం తిరిగి మనకు చేరడానికి కొన్ని సెకన్ల నుంచి ఏడు పనిదినాల సమయం పట్టొచ్చు. ఇంకా ఎక్కువ సమయం పడితే.. అపుడు ఆ డబ్బులు పూల్‌ అకౌంట్‌లో ఉంటాయి. వాలెట్స్‌/ బ్యాంకులు.. పేమెంట్‌ నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌తో కలిసి ఈ అకౌంట్లను నిర్వహిస్తాయి’’ అని పేయూ ఇండి యా సర్వీస్‌ డెలివరీ హెడ్‌ హరి వేలాయుధన్‌ చెప్పారు.



వాలెట్లు ఎలా వాడాలి?

పేటీఎం, మొబిక్విక్, ఆక్సిజన్, ఫోన్‌పే, స్వైపే... ఇలా రకరకాల మొబైల్‌ వాలెట్లు అందుబాటులో ఉన్నాయి. దేని ప్రయోజనాలు దానివి. దేని నష్టాలు దానివి. ఎందుకంటే అన్ని వాలెట్లూ అన్ని లావాదేవీలకూ వాడలేం. ఉదాహరణకు మనం ఒక దుకాణంలో పేటీఎం ద్వారా చెల్లించాలని భావిస్తే... సదరు దుకాణదారుడు కూడా పేటీఎం వాడుతుండాలి. తను వేరే వాలెట్‌ వాడితే కుదరదు. వీటిని వాడాలనుకున్న వారు మొబైల్‌ ఫోన్లో ఆండ్రాయిడ్‌ లేదా యాపిల్‌ ప్లే స్టోర్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మన వివరాలతో రిజిస్టర్‌ చేసుకుని... మనకున్న ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతా నుంచో, లేకపోతే క్రెడిట్‌/డెబిట్‌ కార్డు నుంచో దీన్లో డబ్బులు వేయాలి. అప్పటి నుంచి వాడటం మొదలుపెట్టొచ్చు.



చార్జీలెలా ఉంటాయంటే...

వాలెట్లలో ఉన్న ప్రస్తుతం చాలా వాలెట్లు మనం లావాదేవీలు చేసేటపుడు ఎలాంటి చార్జీలూ వసూలు చేయటం లేదు. కాకపోతే వాలెట్లో డబ్బులు వేసేటపుడు మన బ్యాంకులు మాత్రం లావాదేవీ చార్జీ తీసుకుంటున్నాయి. ఒకవేళ మనం వాలెట్లో ఉన్న డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో వేసుకోవాలన్నా ఇవి 1–4 శాతం మధ్య చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ గమనించి వాడాల్సి ఉంటుంది.



మీ బ్యాంకంతా... ఇంటర్‌నెట్లోనే

రాజేష్‌ తన బ్యాంకు ఖాతా నుంచి మొబైల్‌ వాలెట్‌కు ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా డబ్బు బదిలీ చేశాడు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు వెళ్లింది. కానీ వాలెట్లో జమ కాలేదు. ఎందుకిలా? బ్యాంకును ఫోన్లో సంప్రదించాడు. ‘‘సర్‌! ఇది రెండంచెల వ్యవస్థ. రెండింటి మధ్య పేమెంట్‌ గేట్‌వే ఉంటుంది. ఇది బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు తీసుకొని.. దాన్ని వాలెట్‌లో జమ చేస్తుంది. గేట్‌వేకు చేరక ముందే లావాదేవీ ఫెయిలయి ఉండొచ్చు. సర్వర్‌ పనిచేయకపోవడం, నెట్‌వర్క్‌ సమస్యలు ఉండొచ్చు. గేట్‌వే కంపెనీలు బ్యాంకులతో రోజూ లావాదేవీలను సెటిల్‌ చేస్తాయి.


ఇది జరిగి మీ ఖాతాలోకి డబ్బులు రావటానికి 1–2 పనిదినాలు పట్టొచ్చు’’ అని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ వివరించాడు. ఒకవేళ పేమెంట్‌ గేట్‌వే డబ్బుల్ని తీసుకున్నాక లావాదేవీ ఫెయిలైతే ఆ డబ్బులు వాలెట్‌కు చేరుతాయి. అదీ కథ. ‘‘నిజమే! వాలెట్‌ నుంచి బ్యాంక్‌కు డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేసేటపుడు ఎక్కువ సమస్యలొస్తున్నాయి’’ అని పేటీఎం సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ దీపక్‌ అబాట్‌ చెప్పారు. ‘‘బ్యాంకుల్లో రద్దీ వల్ల రిఫండ్‌ ఆలస్యం కావొచ్చు. మేం వాటికి రెఫరెన్స్‌ నంబర్‌ను పంపిస్తాం. బ్యాంకులో జరిగే ప్రక్రియతో మాకెలాంటి సంబంధం ఉండదు. మా దగ్గరకొచ్చిన కస్టమర్లకు ఏం చేయాలో సూచనలు మాత్రమే ఇవ్వగలం’’ అని వివరించారాయన.



నెట్‌బ్యాంకింగ్‌ చేసేదెలా?

ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్‌ చేయడానికి మీకు మొదట బ్యాంకు ఖాతా ఉండాలి. తరవాత బ్యాంకు బ్రాంచిలో సంప్రదిస్తే వారు చిన్న దరఖాస్తు తీసుకుని నెట్‌బ్యాంకింగ్‌ ఐడీ ఇస్తారు. పాస్‌వర్డ్‌ను పోస్ట్‌లో పంపిస్తారు. ఈ ఐడీ, పాస్‌వర్డ్‌ సాయంతో నెట్‌బ్యాంకింగ్‌ లావాదేవీలు చేయొచ్చు. ఈ నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా బిల్లులు చెల్లించటంతో పాటు, ఇతరుల బ్యాంకు ఖాతాలకు, మొబైల్‌ వాలెట్లకు డబ్బులు బదిలీ చేయొచ్చు. ఇపుడు ప్రతి బ్యాంకూ మొబైల్‌ యాప్‌లు తెచ్చింది. మొబైల్‌ యాప్‌ ద్వారానే నెట్‌బ్యాంకింగ్‌ లావాదేవీలన్నీ జరుపుకోవచ్చు. వాలెట్లతో పోలిస్తే వీటికి భద్రత ఎక్కువ. చార్జీలూ తక్కువ.



చార్జీలూ ఉంటాయి...

ఇతరుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయాలంటే వారిని మీ పేయీలుగా జత చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక... ఇమీడియెట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌)తో పాటు నెఫ్ట్, ఆర్‌టీజీఎస్‌ ద్వారా డబ్బులు బదిలీ చేయొచ్చు. ప్రతి లావాదేవీకీ కొంత చార్జీ ఉంటుంది. ఇది రూ.2–5 మధ్య ఉంటుంది. ఎక్కువ మొత్తాలకైతే ఆర్‌టీజీఎస్, తక్కువ మొత్తాలకైతే నెఫ్ట్, తక్షణం (సెకన్లలో) డబ్బు బదిలీ కావాలంటే ఐఎంపీఎస్‌ వాడాలి. ఐఎంపీఎస్‌కు కాస్త ఎక్కువగా రూ.5 వరకూ చార్జీలవుతాయి.

కార్డు వాడొచ్చు... కానీ చార్జీలుంటాయ్‌

సౌమ్య ఓ షాపులో సరుకులు కొని డెబిట్‌ కార్డుతో చెల్లించబోయింది. స్వైప్‌ చేశాక.. కాసేపటికి ట్రాన్సాక్షన్‌ తిరస్కరణకు గురైనట్లు అక్కడ మెసేజీ కనిపించింది. కానీ మొబైల్‌కు మాత్రం బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. బ్యాంకును సంప్రదిస్తే... ఆ డబ్బులు తిరిగి వస్తాయని, కంగారు పడొద్దని చెప్పారు. కంగారు సంగతి సరే! ముందు దుకాణదారుకు చెల్లించటానికి డబ్బులుండాలి కదా!! అనుకుంది. స్నేహితుల సాయంతో పని పూర్తిచేసింది.



కార్డులు వాడటమెలా?

నిజానికి ప్రభుత్వమిపుడు కరెన్సీని తగ్గించి డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహిస్తోంది. నెట్‌బ్యాంకింగ్, మొబైల్‌ వాలెట్ల వంటివి కాస్త ఇంటర్‌నెట్‌ పరిజ్ఞానం ఉన్నవారికే కాగా... అందరికీ చేతనైనది కార్డుల వాడకమే. ఎందుకంటే దేశంలో చాలా కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయి. వారికి డెబిట్‌ కార్డులూ ఉన్నాయి. కొందరికైతే క్రెడిట్‌ కార్డులుంటాయి. షాపుల్లో చెల్లింపులకు కార్డులు వాడొచ్చు. ఇంటర్‌నెట్లో కూడా ఈ కార్డుల ద్వారా లావాదేవీలు జరపొచ్చు. ఈ కార్డుల వాడకానికి కావాల్సిన పిన్‌ నంబరును బ్యాంకులే ఇస్తాయి.



చార్జీలతో జాగ్రత్త!

డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం... డిజిటల్‌ లావాదేవీలు జరిపేవారిపై చార్జీలను కూడా బాదుతుండటం గమనార్హం. కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించే ప్రతి వ్యాపారీ... చివరికి అలా స్వీకరించిన డబ్బును తన బ్యాంకు ఖాతాలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు తీసుకునేటపుడు బ్యాంకులు 2 నుంచి 4 శాతం చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ తామెందుకు భరించాలని భావిస్తున్న వ్యాపారులు.... ఆ చార్జీల్ని కూడా కస్టమర్లపైనే వేస్తున్నారు. వీటిని భరించటమెందుకని భావిస్తున్న కస్టమర్లు... కార్డు బదులు నగదు ఇవ్వటానికే మొగ్గు చూపుతున్నారు. ఇదంతా ఒక గొలుసు వ్యవస్థ.



ఇటీవలే పెట్రోలు బంకులు ఈ విషయంపై సమ్మె చేశాయి. తమను కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేయొద్దని చెబుతూ... తమ వద్ద నుంచి మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. సమ్మె చేస్తామన్నారు. కార్డులు తీసుకోకూడదని కూడా ఒక దశలో నిర్ణయించారు. చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకుని కొంత గడువు అడగటంతో వెనక్కి తగ్గారు. నిజానికిది ఒక్క పెట్రోలు బంకుల సమస్య మాత్రమే కాదు. కార్డుల్ని స్వీకరించే వారందరి సమస్య. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఎలాంటి లావాదేవీలూ లేని లైఫ్‌టైమ్‌ ఫ్రీ కార్డులు జారీ చేస్తున్నాయి. కానీ తమకు చార్జీలవుతున్నాయి కాబట్టి వ్యాపారులు ఈ కార్డుదారుల నుంచి కూడా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది 4 శాతం వరకూ ఉండటంతో కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు.



మనలో ఆ సత్తా ఉందా?

వాలెట్లెలా వాడాలి? కార్డులెలా వాడాలి? నెట్‌ బ్యాంకింగ్‌ ఎలా చేయాలి? చార్జీలెంత? అనే విషయాలన్నీ పక్కనబెడితే... ఆసలు డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహించే వ్యవస్థ మన దగ్గర ఉందా? అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే డిజిటల్‌ లావాదేవీల్లో ఫెయిలవటం సాధారణంగా మారిపోయింది. ఇక మోసగాళ్ల సంగతి సరేసరి. అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే ఖాతాలో డబ్బులు మాయం. పైపెచ్చు కొత్తగా వస్తున్న డిజిటల్‌ మాధ్యమాలకు సరైన నిబంధనలు కూడా లేవు.



ఉదాహరణకు డబ్బులు తీసుకెళ్లడానికి ఏటీఎంకు వెళతాం. అక్కడ డబ్బులు రావు. కానీ డబ్బులు కట్‌ అయినట్లు మన మొబైల్‌కి మేసేజ్‌ మాత్రం వస్తుంది. తర్వాత మళ్లీ మన ఖాతాలో ఆ డబ్బులు జమవుతాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. సమస్య పరిష్కారానికి ఆర్‌బీఐ కొన్ని నిబంధనలు పెట్టింది. ఏటీఎంలో డబ్బులు రాకుండా, మన అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ అయితే.. ఈ విషయాన్ని బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన ఏడు పనిదినాల్లో బ్యాంకులు ఆ సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే అవి రోజుకు రూ.100 జరిమానా భరించాలి. కానీ వాలెట్స్, యూపీఐ వంటి కొత్త పేమెంట్‌ చెల్లింపు మాధ్యమాలకు వచ్చేసరికి ఇలాంటి నిబంధనలు లేవు.



లావాదేవీలకు, ఉద్యోగుల సంఖ్యకు పొంతన లేదు..

‘‘పెద్ద నోట్ల రద్దు తరవాత లావాదేవీల పరిమాణం 10 రెట్లు పెరిగింది. కానీ ఉద్యోగుల సంఖ్య మాత్రం 1.5–2 రెట్లే పెరిగింది. అందుకే ఫెయిలైన లావాదేవీల పరిష్కారానికి కొన్ని సంస్థలు ఎక్కువ రోజుల సమయం తీసుకోవచ్చు’ అని మొబిక్విక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) ఆకాశ్‌ గుప్తా చెప్పారు. వాలెట్‌ సంస్థలు వారి సిబ్బందిని వేగంగానే పెంచుకుంటున్నాయని తెలియజేశారు. ‘నవంబర్‌కు ముందు మొబిక్విక్‌లో 160 మంది ఉద్యోగులు ఉన్నారు. మార్చి చివరి నాటికి వీరి సంఖ్య 1,000కి చేరొచ్చు’ అని తెలిపారు.



సోషల్‌ మీడియాను వాడేసుకోవచ్చు...

లావాదేవీ ఫెయిలయ్యాక రెండు నుంచి ఏడు రోజుల్లోగా రిఫండ్‌ రాకపోతే.. వెంటనే వాలెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. మీకు వచ్చిన రెస్పాన్స్‌ సంతృప్తికరంగా లేకపోతే ఇంకా గట్టిగా ప్రయత్నించండి. ప్రతి వాలెట్‌ సంస్థ వాటి వెబ్‌సైట్‌లో సమస్య పరిష్కారపు నిబంధనలను పొందుపరిచే ఉంటుంది. అక్కడ సంబంధిత అధికారుల వివరాలు ఉంటాయి. వారిని సంప్రదించాలి. ‘‘చిట్టచివరిగా గ్రీవెన్స్‌ అధికారి వద్ద సమస్య కచ్చితంగా పరిష్కారమవ్వాలి. అక్కడా కాకపోతే మీరు ఆర్‌బీఐ గ్రీవెన్స్‌ సెల్‌ను సంప్రదించొచ్చు’ అని ఫ్రీచార్జ్‌ అధికార ప్రతినిధి చెప్పారు. సమస్యను బ్యాంక్‌ లేదా వాలెట్‌ సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేస్తే త్వరగా పరిష్కారం కావచ్చని చిల్లర్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చెప్పారు. ‘సంస్థలు వారి సోషల్‌ మీడియా ఇమేజ్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మీ సమస్య ఏడు రోజులు దాటినా కూడా తీరకపోతే.. అప్పుడు మీరు ఆయా సంస్థల సోషల్‌ మీడియా పేజ్‌లను వాడుకోండి’ అని సూచించారు.

– సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top