లేటు వయసులో తల్లిదండ్రులైతే..!

లేటు వయసులో తల్లిదండ్రులైతే..!


భిన్నమైన ప్లానింగ్ తప్పనిసరి



  ఈనాటి యువత కెరీర్‌కే ప్రాధాన్యమిస్తుండటంతో పెళ్లి, పిల్లలు వంటివి ఆలస్యమవుతున్నాయి. ఒకవేళ సకాలంలో పెళ్లయినా భార్యాభర్తలిద్దరూ కెరీర్ జపం చేస్తుండటం వల్ల పిల్లలు లేటుగా పుడుతున్నారు. ఇలాంటి 35-40 సంవత్సరాల మధ్య ఉండే లేట్ పేరెంట్స్... ఆర్థిక విషయాల్లో ఇతరులకన్నా భిన్నంగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వారికి ఆ సమయంలోనే ఆదాయం ఎక్కువగా ఉండడంతో పాటు పిల్లలు, వారి సంరక్షణ ఖర్చూ అప్పుడే ఎక్కువగా ఉంటుంది. మరోవంక రిటైర్ అయ్యే సమయం ముంచుకొస్తూ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేయాలి. అందుకోసం నిపుణుల సలహాలివీ...

 

 పొదుపు... పొదుపు... అదే మదుపు

 లేటు వయస్సులో తల్లిదండ్రులైన వాళ్లు కొన్ని త్యాగాలు చేయకతప్పదు. విలాసాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. విలాసవంతమైన క్లబ్‌లలో సభ్యత్వం, ఏడాదికి రెండు సార్లు విదేశీ విహారం లాంటివి తగ్గించుకోవాలి. అలాగని మరీ త్యాగమూర్తులు కావాల్సిన పనిలేదు. ఒక తండ్రిని ఉదాహరణగా తీసుకుంటే.... ఆయన ఖర్చులపై అదుపు కోసం వినూత్న విధానాన్ని అనుసరించాడు. అప్పటివరకూ బీమా ప్రీమియాల్ని ఏడాదికి ఒకేసారి కట్టేసేవాడు. కూతురు పుట్టాక మూడునెలకొకసారి ప్రీమియం చెల్లిస్తున్నాడు. దీనివల్ల చెల్లించాల్సిన ప్రీమియమ్‌లో పెద్దగా తేడా ఉం డదు. కానీ, మూడునెలలకొకసారి చెల్లించడం వల్ల అనవసర ఖర్చులు తగ్గించుకోగలిగానన్నది ఆయన మాట.



 రిస్క్‌లు వద్దే వద్దు....

 లేటు వయసులో పిల్లలు పుట్టడం వల్ల రిటైర్మెంట్ తర్వాత కూడా పిల్లల కోసం భారీగానే ఖర్చు చేయాల్సి రావచ్చు. అందుకని ఇలాంటి వాళ్లు రిస్క్‌లు తగ్గించుకోవాలి. తక్కువ రాబడులొచ్చే పొదుపు మార్గాలను తగ్గించుకోవాలి. ఎక్కువ మొత్తంలో పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. స్టాక్ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్‌చేయడం ఒకింత రిస్క్ అనే చెప్పవచ్చు. రిస్క్ తగ్గించుకోవడానికి మ్యూచుల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పరిశీలించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఒకింత రిస్క్ ఉంటుంది. అందుకని లార్జ్ క్యాప్ ఫండ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. కొంచెం రిస్క్ తీసుకోగలిగితే మల్టీ-క్యాప్ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. తల్లిదండ్రుల్లో ఒకరే సంపాదనపరులైతే రిస్క్ విషయానికి తగినంత ప్రాధాన్యమివ్వాలి.



 సెకండ్ కెరీర్‌నీ చూసుకోవాలి...

 లేటు వయస్సు తల్లిదండ్రులు రిటైరైనప్పటికీ, వారి పిల్లల బరువు, బాధ్యతలు పూర్తిగా తల్లిదండ్రులపైనే ఉంటాయి. ఇది లేటు వయస్సు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులపై బాగానే ప్రభావం చూపుతుంది. రిటైరయ్యాక కూడా ఆదాయం కోసం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాల్సిందే. పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తే కొంత వరకూ ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది.



 విల్లు రాయాల్సిందే..

 కుటుంబానికి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో విల్లు రాయడం కీలకం. ఏదైనా జరగరానిది జరిగితే, బిడ్డ/భార్యకు సంరక్షకులుగా వ్యవహరించడానికి నమ్మకస్తులైన బంధువు/మిత్రుడిని ఎంచుకోవాలి. విల్లులోని వివరాలు సమూలంగా జీవిత భాగస్వామికి వివరించాలి. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తవు.

 

 దీర్ఘకాల కవర్ ఉండాలి...

 బీమాకు సంబంధించి కవర్ అధిక మొత్తంలో ఉండడమే కాక ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తికి కూతురో, కొడుకో పుడితే... ఆ వ్యక్తి రిటైరయ్యేటప్పటికి ఈ పాప/బాబు కాలేజీ చదువు కూడా పూర్తవదు. అందుకే ఆ వ్యక్తి లైఫ్ కవర్ 65 లేదా 70 ఏళ్ల వరకూ తీసుకోవాలి. ఇప్పుడు చాలా కంపెనీలు ఈ వయస్సు వరకూ టెర్మ్ కవరేజీని ఇస్తున్నాయి. 40 ఏళ్ల వ్యక్తి తర్వాతి 30 ఏళ్లకు రూ.కోటి బీమా కవర్ తీసుకుంటే బీమా ప్రీమియం ఏడాదికి రూ.18,000 వరకూ ఉండొచ్చు.



తక్కువ కవర్‌ను ఇచ్చే అనవసర జీవిత బీమా పాలసీలను సరెండర్ చేసి వాటి బదులుగా టెర్మ్ పాలసీలు తీసుకోవాలి. దీనివల్ల వార్షికంగా కొంత ఆదాయం మిగులుతుంది. దీంతో మరిన్ని రాబడులు వచ్చేలా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చు. లేదా ఈ మిగులు సొమ్ముతో అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవచ్చు. ఆరోగ్య బీమా కూడా ముఖ్యమైనదే. కుటుంబం మొత్తానికి ఫ్లోటర్ హాస్పిటలైజేషన్ కవర్ తీసుకోవడం మంచిది. 40 ఏళ్ల వయస్సులో ఇలాంటి పాలసీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువగానే చెల్లించాల్సి ఉంటుంది.  అందుకని బేస్ కవర్ తీసుకొని,వాటికి సూపర్ టాప్-అప్ హెల్త్‌ప్లాన్‌లు జత చేయాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top