డీరెగ్యులేషన్‌కి మరింత చేరువగా డీజిల్ రేట్లు

డీరెగ్యులేషన్‌కి మరింత చేరువగా డీజిల్ రేట్లు - Sakshi


కొనుగోలు, రిటైల్ అమ్మకం ధరలకు మధ్య భారీగా తగ్గిన వ్యత్యాసం

న్యూఢిల్లీ: డీజిల్ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ సంస్థల ఆదాయ నష్టాలు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ధరల నియంత్రణ ఎత్తివేత (డీరెగ్యులేషన్) మరింత వేగిరం కానుంది. వాస్తవ ధర, రిటైల్ అమ్మకపు ధర మధ్య వ్యత్యాసం ప్రస్తుతం 8 పైసలకు తగ్గిపోవడం ఇందుకు తోడ్పడనుంది. కొనుగోలు, రిటైల్ అమ్మకపు ధరల మధ్య వ్యత్యాసం ఇంత తక్కువ స్థాయికి దిగి రావడం దశాబ్ద కాలంలో ఇదే తొలిసారని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. నెలవారీగా డీజిల్ రేటు పెంచుతూ పోవడం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటం దీనికి తోడ్పడినట్లు వివరించింది.



ఇదే ధోరణి కొనసాగితే.. వచ్చే వారం కల్లా డీజిల్ ధరలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఉంటాయి. అదే జరిగితే ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగిస్తూ అక్టోబర్ 1న ధరను మరో అర్ధ రూపాయి (లీటరుకు) పెంచాల్సిన అవసరం రాదు. నష్టాలను తగ్గించుకునే ఉద్దేశంతో 2013 జనవరి నుంచి డీజిల్ రేట్లను ప్రతి నెలా లీటరుకు 50 పైసల చొప్పున పెంచుతున్న సంగతి తెలిసిందే. దీంతో 19 విడతల్లో రేటు రూ.11.81 మేర పెరిగింది.  

 

నియంత్రణ ఎత్తివేతకు సరైన సమయం: డీజిల్ రేట్లను నిర్ణయించుకునేందుకు చమురు కంపెనీలకు (ఓఎంసీ) స్వేచ్ఛనివ్వడానికి ఇదే సరైన సమయం అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఓఎంసీల క్రెడిట్ రేటింగ్ మెరుగుపడగలదని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ప్రభుత్వం కూడా ఆర్థిక క్రమశిక్షణ లక్ష్యాలను సాధించడానికి ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. డీజిల్ ధరలు.. మార్కెట్ రేట్ల స్థాయికి చేరడం పెట్రోలియం రంగానికి సానుకూలాంశమని ఐసీఆర్‌ఏ వివరించింది.



మరోవైపు, సబ్సిడీల భారాన్ని ప్రభుత్వం, చమురు ఉత్పత్తి సంస్థలు (ఓఎన్‌జీసీ, ఓఐఎల్) చెరి సగం పంచుకోవాలన్న ప్రభుత్వ ప్రతిపాదన చమురు సంస్థలకు సానుకూలమని మూడీస్ తెలిపింది. ఇది అమలైతే ఓఎన్‌జీసీ, ఓఐఎల్ ఇంధన సబ్సిడీల భారం దాదాపు 36 శాతం.. అంటే సుమారు రూ. 22,000 కోట్ల మేర తగ్గుతుందని వివరించింది. దీంతో ఆయా కంపెనీల లాభదాయకత కూడా పెరగగలదని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top