సిబిల్ స్కోరు ఎంతుండాలి?

సిబిల్ స్కోరు ఎంతుండాలి?


ఫైనాన్షియల్ బేసిక్స్

రుణ మంజూరుకు సంబంధించి సిబిల్ స్కోర్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. రుణమిచ్చే సంస్థ/బ్యాంక్ ఒకరికి రుణమివ్వడానికి ముందు వారి సిబిల్ స్కోర్ ఎంతుందో చూస్తుంది. స్కోర్ బాగుంటే పర్వాలేదు. రుణం వస్తుంది. లేకపోతే రుణ లభ్యత కష్టమవుతుంది. అందుకే సిబిల్ స్కోర్‌ను జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. సిబిల్ స్కోర్ సాధారణంగా 300-900 మధ్యలో ఉంటుంది. సిబిల్ సంస్థ ఒక వ్యక్తి బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డు లావాదేవీలను ఆధారంగా చేసుకొని అతనికి 300-900 మధ్యలో ఒక స్కోర్‌ను కేటాయిస్తుంది.



ఈ స్కోర్ 900కు దగ్గరిలో ఉంటే.. రుణమిచ్చే సంస్థలు మీరు రుణాన్ని తిరిగి చెల్లించగలరని ఒక అంచనాకు వస్తాయి. అంటే రుణ మంజూరు సులభంగా జరుగుతుంది. ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకమైన సిబిల్ స్కోర్‌ను రుణ మంజూరుకు ప్రాతిపదికగా తీసుకుంటాయి. అయితే సాధారణంగా చాలా బ్యాంకులు మాత్రం 750 లేదా అంత కన్నా ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు రుణాలివ్వటానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే మీ క్రెడిట్ రేటింగ్ ఎలా ఉందనేది తరచూ పరిశీలించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఉచితంగా ఈ రిపోర్ట్ పొందవచ్చని ఇటీవలే ప్రభుత్వం ప్రతిపాదించింది. మీ ఆర్థిక జీవనంలో క్రెడిట్ స్కోర్ పాత్ర ఎంతో కీలకమన్న విషయం మర్చిపోవద్దు. ఈ రిపోర్టును మీరు బ్యాంకు లేదా సిబిల్ నుంచి పొందే వీలుంది.

 

తప్పిదాలు జరగొచ్చు జాగ్రత్త: మనం క్రెడిట్ కార్డు పేమెంట్స్‌ను సక్రమంగా చెల్లించినా కూడా సిబిల్ స్కోర్ తక్కువగా రావొచ్చు. దీనికి బ్యాంకులు లేదా మాన్యువల్ తప్పిదాలు కారణంగా నిలువొచ్చు. ఒక్కొక్కసారి డేటా తప్పుగా అప్‌డేట్ జరగవచ్చు. రిపోర్ట్ సందర్భంలో పేరు, అడ్రస్, పుట్టినతేదీ వంటి వివరాల్లో చిన్న తేడా వచ్చినా, రిపోర్ట్ తప్పుగా నమోదయ్యే వీలుంటుంది. ఏదైనా తప్పు ఎంట్రీ జరిగితే.. దానిని సిబిల్ దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top